Skip to main content

విద్యార్థులు సామాజిక అభివృద్ధికి తోడ్పడాలి...

‘ప్రభుత్వాలు కొత్త విధానాలు రూపొందిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే, ఆ విధానాలు లక్షిత వర్గాలకు క్షేత్రస్థాయిలో సమర్థంగా అందేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అప్పుడే సమాజం ప్రగతి పథంలో నడుస్తుంది’ అంటున్నారు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘బేర్‌ఫుట్ అకాడమీ ఆఫ్ గవర్నెన్స్’ డెరైక్టర్ ప్రొఫెసర్ వి.సురేశ్. గత కొన్నేళ్లుగా విద్య, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం తదితర విభాగాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, విధానాలు ఆయా వర్గాలకు చేరేలా కృషిచేస్తూ.. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్న బేర్‌ఫుట్ అకాడమీ ఆఫ్ గవర్నెన్స్ డెరైక్టర్ వి.సురేశ్‌తో ఈ వారం గెస్ట్‌కాలం...
క్షేత్రస్థాయి అమలే ప్రధాన సమస్య :
మన దేశం సామాజికంగా, భౌగోళికంగా విభిన్న సంస్కృతులు, పరిస్థితులకు నిలయం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పథకాన్నైనా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం, లక్షిత వర్గాలకు అందేలా చేయడం ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ విషయంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పల్లె ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ఉన్నప్పటికీ.. వాటి గురించి వారికి తెలియడం లేదు. ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రభుత్వ శాఖల్లోని కిందిస్థాయి అధికారులు ఆశించిన రీతిలో వ్యవహరించడం లేదు. ఫలితంగా నేటికీ మన సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయి.

చక్కటి ప్రణాళిక ఉంటే...
ముందుచూపుతో వ్యవహరించి,చక్కటి ప్రణాళికను రూపొందించుకొని అమలు చేస్తే.. ఎలాంటి సమస్యనైనా సులువుగా అధిగమించొచ్చు. ఉదాహరణకు ఇటీవల చెన్నైలో కనిపిస్తున్న నీటి కొరత. ఈ సమస్యను ముందుగానే గుర్తించి.. ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే.. పరిష్కారం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి విషయాల్లో మన దేశంలో పరిపాలనలో ప్రణాళిక లోపం కనిపిస్తోంది. ముఖ్యంగా వైద్యం, పారిశుద్ధ్యం, గ్రామీణ ప్రాంతాలకు విద్యావకాశాలు వంటి విషయాల్లో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. వీటిని ఆయా వర్గాలకు అందేలా చేయడంలో సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకం. అందుకే మేము బేర్‌ఫుట్ అకాడమీ ఆఫ్ గవర్నెన్స్‌ను ప్రారంభించాం.

నూతన విద్యా విధానం.. సిఫార్సులు :
విద్యా రంగం విషయానికొస్తే నూతన విద్యా విధాన ముసాయిదాలో.. కమిటీ పలు కీలక సిఫార్సులు చేయడం.. వాటిపై వ్యతిరేకత రావడం తెలిసిందే. మన దేశ పరిస్థితుల దృష్ట్యా.. ఈ సిఫార్సుల అమలుకు ముందుగా మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం చాలా అవసరం. సెకండరీ ఎడ్యుకేషన్ దశలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు.. తప్పనిసరిగా కొన్ని ఉమ్మడి సబ్జెక్ట్‌లను బోధించాలనే సిఫార్సు మంచిదే. అయితే సెమిస్టర్ విధానంపై పునరాలోచించాలి.

అప్పుడే ఆర్‌టీఈ విజయం :
విద్యా హక్కు చట్టాన్ని ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అమలు చేయాలనే సిఫార్సు ఆహ్వానించదగిందే. అదే సమయంలో పేద వర్గాలకు జీవనోపాధి మార్గాలు కూడా చూపాలి. కనీస ఆదాయ హామీ కల్పించాలి. అప్పుడే విద్యా హక్కు చట్టం సమర్థవంతంగా అమలుచేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ప్రజలకు పూట గడవని పరిస్థితి. అలాంటి కుటుంబాలు జీవనం కోసం తమ పిల్లలను పనికి పంపిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకు ఆర్‌టీఈ సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఉచిత విద్య, మధ్యాహ్న భోజన పథకం వంటి వాటితోనే అందరికీ విద్య అందుతుందనుకోవడం సరికాదు. పేద కుటుంబాలకు కనీస ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అది కూడా దీర్ఘకాలిక విధానంలో ఉండాలి. ఉచిత రేషన్ వంటి సంక్షేమ పథకాలకంటే..సుస్థిరాదాయం కల్పించే దీర్ఘకాలిక విధానాలు అమలు చేయాలి.

‘విద్య’లోనూ అదే పరిస్థితి :
విద్యా రంగంలోనూ మౌలిక వసతుల కొరత ఉంది. చాలా వరకు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కానీ, పలు గ్రామాల్లో అప్పర్ ప్రైమరీ, సీనియర్ సెకండరీ చదవాలంటే.. కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికో, డివిజన్ కేంద్రానికో వెళ్లాల్సి వస్తోంది. ఇది ఉన్నత విద్యలో ఎన్‌రోల్‌మెంట్ పెరుగుదలకు అవరోధంగా మారుతోంది. కాబట్టి అన్ని గ్రామాల్లోనూ కనీసం సీనియర్ సెకండరీ వరకైనా పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

అవగాహన పెంచాలి...
ఆయా పథకాల అమలు పరంగా ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో ముఖ్యం. ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ కార్యక్రమాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. గత మూడు, నాలుగేళ్లుగా దీని గురించి ప్రచారం జరుగుతోంది. సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇప్పటికీ ఓపెన్ డెఫకేషన్ సమస్య కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా నిరక్షరాస్యుల్లో దీని గురించి అవగాహన కల్పించాల్సిన అవసరముంది. జరిమానాలు విధించడం లేదా ఇతర చర్యలు తీసుకోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించదు. అవగాహన కల్పించడంతోపాటు సదుపాయాలు కల్పించాలి.

మౌలిక సదుపాయాల కొరత :
ఏ పథకమైనా సమర్థంగా అమలవ్వాలంటే.. ఆ పథకం ఉద్దేశానికి అనుగుణంగా ముందుగా సంబంధిత విభాగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలి. ఉదాహరణకు ప్రజారోగ్యాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. కిందిస్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రథమ చికిత్స చేసే సదుపాయాలు కూడా లేవు. ఇలాంటి విషయాలను తీవ్రంగా పరిగణించాలి.

‘సామాజిక’ దృక్పథం :
విద్యార్థులకు సామాజిక దృక్పథం ఎంతో అవసరం. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడం, వాటికి పరిష్కార మార్గాల గురించి ఆలోచించడం వల్ల సామాజిక అభివృద్ధికి తోడ్పడినవారవుతారు. దీన్ని గుర్తించే ఇటీవల ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు తమ సమీప గ్రామాల్లో ఔట్‌రీచ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితి అన్ని ఇన్‌స్టిట్యూట్‌లలోనూ కనిపిస్తే.. సమాజంలో ఎదురవుతున్న సమస్యలకు సులువుగా పరిష్కారం లభిస్తుంది!!
Published date : 20 Aug 2019 11:34AM

Photo Stories