Skip to main content

విద్యార్థులకు ‘డిజిటల్’ నైపుణ్యాలతోనే భవిత

‘ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కోర్సు విద్యార్థులైనా డిజిటల్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటేనే భవిష్యత్తు అవకాశాలు మెరుగవుతాయి. డిజిటల్ స్కిల్స్ఉంటే కెరీర్‌లో రాణించేందుకు చక్కటి మార్గం ఏర్పడుతుంది’ అంటున్నారు ఐఐఎం-ఉదయ్‌పూర్ డెరైక్టర్ ప్రొఫెసర్ జనత్ షా. ఐఐఎం-అహ్మదాబాద్ నుంచి ఫెలో ప్రోగ్రామ్ పూర్తి చేసి ఐఐఎం-బెంగళూరులో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి.. ప్రస్తుతం ఐఐఎం- ఉదయ్‌పూర్ డెరైక్టర్‌గా రెండో విడత కొనసాగుతున్న ప్రొఫెసర్ జనత్ షాతో గెస్ట్ కాలం...
ట్రెండ్‌కు అనుగుణంగా..
విద్యార్థులు జాబ్ మార్కెట్ ట్రెండ్స్ కు అనుగుణంగా తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. అకడమిక్స్‌కే పరిమితమైతే మార్కెట్‌లో రాణించలేని పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఏ కోర్సు విద్యార్థులైనా మార్కెట్ పరిస్థితులు, కంపెనీల దృక్పథాన్ని పరిశీలిస్తూ.. అందుకు అనుగుణంగా తమ అభ్యసన తీరును మలచుకోవాలి. విద్యార్థులు ఒక సబ్జెక్టుపై పరిపూర్ణత సాధించాలంటే.. తాము చదువుతున్న అంశం వాస్తవ సామాజిక పరిస్థితుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దృక్పథంతో అధ్యయనం చేయాలి. అంతేకాకుండా దాన్ని అన్వయించే పద్ధతులపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. అప్పుడే సదరు అంశంపై పరిపూర్ణత లభిస్తుంది.

డిజిటల్ టెక్నాలజీస్ :
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీస్‌పై అవగాహన పెంచుకోవడం తప్పనిసరిగా మారింది. డిజిటల్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ సంస్థలకే పరిమితం కాలేదు. అన్ని రంగాలకు విస్తరిస్తోంది. విద్యార్థులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చదువుతున్న కోర్సుకు సంబంధించి జాబ్ మార్కెట్ పరంగా బాగా డిమాండ్ ఉన్న టెక్నాలజీపై నైపుణ్యం సొంతం చేసుకోవాలి. డిజిటల్ టెక్నాలజీ.. మేనేజ్‌మెంట్ విభాగంలోకి కూడా చొచ్చుకొస్తోంది. మార్కెటింగ్, హెచ్‌ఆర్, ఆపరేషన్స్, సప్లయ్ చైన్.. ఇలా అన్ని విభాగాల్లోనూ డిజిటల్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. ఉదాహరణకు మార్కెటింగ్‌నే తీసుకుంటే బిగ్‌డేటా అనలిటిక్స్ ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

ఐఐఎంల్లో కోర్సులు :
డిజిటల్ టెక్నాలజీస్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ వంటి వాటికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఐఎంలు సంబంధిత కోర్సులు ప్రవేశ పెడుతున్నాయి. ఇటీవల ఐఐఎం, ఉదయ్‌పూర్‌లోనూ డేటా అనలిటిక్స్ కోర్సును ప్రారంభించాం. విద్యార్థులు తమ అకడమిక్ కరిక్యులానికే పరిమితం కాకూడదు. ‘కరిక్యులంలో మార్పు చేయట్లేదు.. జాబ్ మార్కెట్‌లో రాణించలేం’.. అనే ఆలోచనను వదిలి.. స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యం ఇస్తే జాబ్ రెడీ స్కిల్స్ సొంతమవుతాయి.

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్.. మంచిదే కానీ
ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ విధానం మంచిదే. కానీ.. వీటిలో చేరే ముందు విద్యార్థులు అయిదేళ్లపాటు తాము అందులో కొనసాగగలమా? లేదా? అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే.. ఇవి +2 అర్హతతోనే మొదలవుతాయి. ఆ సమయంలో స్వీయ ఆసక్తిపై విద్యార్థుల్లో అవగాహన తక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఆశయాలు, ఆసక్తిని అడిగి తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్‌లో చేరే విషయంపై నిర్ణయం తీసుకోవాలి.

రీసెర్చ్ దృక్పథం :
విద్యార్థుల్లో రీసెర్చ్ దృక్పథం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌కు వచ్చే సంస్థలు.. విద్యార్థుల్లోని రీసెర్చ్ ఓరియెంటేషన్ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాయి. కాబట్టి కోర్సులో చేరిన మొదటిరోజు నుంచే పరిశోధనాత్మక దృష్టితో అభ్యసనం కొనసాగించాలి. దాంతోపాటు విద్యార్థులు సవాళ్లను స్వీకరించే మనస్తత్వం పెంపొందించుకోవాలి. అలాంటి వారికే సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రతి అంశాన్ని ఒక సమస్య అనే కోణంలో చదివితే ఈ సామర్థ్యం అలవడుతుంది.

ఒక్క స్పెషలైజేషన్‌కే పరిమితం కావద్దు :
మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌కే పరిమితం కాకూడదు. ఇతర విభాగాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. అప్పుడే ఏ రంగంలోనైనా రాణించే సామర్థ్యం లభిస్తుంది. అందుకే ఐఐఎంల్లో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు, ఎలక్టివ్స్ విధానంలో బోధన సాగుతోంది. ఇతర బీస్కూల్స్‌లో చదివే ఎంబీఏ విద్యార్థులు కూడా ఇలాంటి దృక్పథంతో అడుగులు వేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

ఐఐఎం-బిల్లుతో..
ఇటీవల ఆమోదం పొందిన ఐఐఎం-బిల్లుతో ముఖ్యంగా న్యూ జనరేషన్ ఐఐఎంలుగా పిలిచే క్యాంపస్‌లలో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ కొరత వంటివి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఐఐఎంల్లో భారీ ఫీజులు అనే వ్యాఖ్యలు వినిపించడం వాస్తవమే. ఇక్కడ అనుసరిస్తున్న బోధన విధానాలు, అందిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన విద్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఫీజు గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు.

‘క్యాట్’ ఎంట్రీ పాస్ మాత్రమే :
క్యాట్‌లో ఉత్తీర్ణత, క్యాట్ స్కోర్ కార్డ్ అనేవి ఐఐఎంలలో ఎంట్రీ పాస్ మాత్రమే. దీనికి అదనంగా అభ్యర్థులు మరెన్నో అంశాల్లో తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. కాబట్టి జీడీ, ఇంటర్వ్యూ, రిటన్ ఎబిలిటీ టెస్ట్ వంటి వాటిల్లో రాణించేందుకు ముందునుంచే కృషిచేయాలి. క్యాట్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులే ముందంజలో ఉంటారనే మాట కొంతమేరకు వాస్తవమే. దీనికి ప్రధాన కారణం.. క్యాట్‌లో ఉండే సబ్జెక్ట్‌ల పరంగా వారు మెరుగ్గా రాణించగలడమే. ఇలాంటి అభిప్రాయాన్ని తొలగించేందుకు ఐఐఎంలు అకడమిక్ డైవర్సిటీ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇతర కోర్సుల విద్యార్థులకు కూడా అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు.
Published date : 04 Sep 2019 04:54PM

Photo Stories