Skip to main content

ఉజ్వల కెరీర్‌కు కేరాఫ్ కెమిస్ట్రీ

 కెమిస్ట్రీ.. విద్యార్థులకు ఓ మిస్టరీ! కానీ భవిష్యత్తు తరాల్లో అన్ని రంగాల్లోనూ కెమిస్ట్రీదే కీలక పాత్ర అంటున్నారు ఐఐటీ-ఢిల్లీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ నళిన్ పంత్. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే బేసిక్ సెన్సైస్‌లో ఒక విభాగమైన కెమిస్ట్రీపై ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్తులో అద్భుత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు అని ఆయన సూచిస్తున్నారు. కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో విద్య, ఉద్యోగావకాశాలపై ప్రొఫెసర్ నళిన్ పంత్‌తో ఇంటర్వ్యూ...

కెమిస్ట్రీ.. అన్ని రంగాల్లోనూ అవసరమైన సబ్జెక్ట్:
మెడిసిన్, బయాలజీ, బయో కెమికల్స్, ఫిజిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, ఆస్ట్రానమీ, ప్లాంటేషన్స్, బయోటెక్నాలజీ.. ఇలా ప్రతి దాంట్లోనూ కెమిస్ట్రీ ప్రమేయం లేనిదే ఆశించిన ఫలితాలు సాధ్యం కావు. మనం రోజూ చూసే మందుల షాపుల బోర్డులపై కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని ఉంటుంది. దీంతో చాలామంది కెమిస్ట్రీలో పట్టాలు పుచ్చుకున్నా.. ఇదే భవిష్యత్తా? అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు.

మరో సమస్య కమ్యూనికేషన్:
కెమిస్ట్రీలో ఉన్నత చదువులు, ఆపై అత్యున్నత ఉద్యోగావకాశాలు ప్రస్తుతం అనేకం ఉన్నాయి. కానీ వీటిని అందిపుచ్చుకోవడంలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ రంగంలోని అవకాశాల గురించి అవగాహన కల్పించే చర్యలు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. విద్యార్థి లోకమంతా ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్.. ఇవే కెరీర్ గమ్యాలు అని భావిస్తోంది. ఒక దేశ భవిష్యత్తుకు సోపానాలు పరిశోధనలు- ఆవిష్కరణలు. వాటికి మూలాలు కెమిస్ట్రీ ఆధారంగానే ఉంటాయి. దీన్ని గుర్తించాలి. ప్రాథమిక స్థాయి నుంచే బేసిక్ సైన్స్‌పై ఆసక్తి కల్పిస్తే.. కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో అవకాశాలు అపారం.

భవిష్యత్తు అవకాశాలు:
కెమికల్ సెన్సైస్‌లో భవిష్యత్తు అవకాశాలకు కొదవ లేదు. అంతర్జాతీయంగా కెమికల్ ఉత్పత్తి రంగం తిరోగమన బాట పట్టిన దశ (1999-2004)లోనూ మన దేశంలో ఈ రంగం పురోగమించడమే ఇందుకు నిదర్శనం. ప్రపంచ కెమికల్ పరిశ్రమ వృద్ధిలో భారత వాటా మూడు శాతం పైమాటే. ఇది అంకెల్లో చెప్పాలంటే.. 108 బిలియన్ డాలర్ల మేర కెమికల్ రంగంలో కార్యకలాపాలకు సమానం. ఈ విధంగా దేశంలో రసాయన పరిశ్రమ వృద్ధి సాధిస్తోంది. అంతేకాకుండా.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు చేపడుతున్న చర్యల కారణంగా.. 2017నాటికి భారత కెమికల్ ఇండస్ట్రీ 224 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని 12వ పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. కానీ ఇదే సమయంలో సుశిక్షితులైన మానవ వనరుల కొరత పెద్ద సమస్యగా ఉంది.

50 లక్షల మంది అవసరం:
అదే విధంగా పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం- 2017 నాటికి దాదాపు 50లక్షల మంది సుశిక్షితులైన మానవ వనరుల అవసరం ఏర్పడనుంది. వీరిలో అత్యున్నత స్థాయి ప్రమాణాలతో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థుల అవసరం 14వేలకు పైమాటే! ఈ క్రమంలో.. ఈ విభాగాన్ని పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం భారీ స్థాయిలో చర్యలు చేపడుతోంది.

నైపుణ్యాలు అందించాలంటే:
ఒకవైపు పెరుగుతున్న అవసరాల కారణంగా అవకాశాలు లక్షల సంఖ్యలో ఉంటే.. ఏటా సర్టిఫికెట్లతో బయటికి వస్తున్న నైపుణ్యాలున్న వారి సంఖ్య వందల్లోనే ఉంటోంది. ఈ క్రమంలో కేవలం ఉన్నత శ్రేణి ఇన్‌స్టిట్యూట్‌లలోనే కాకుండా.. రాష్ట్రస్థాయి యూనివర్సిటీల్లోనూ కెమిస్ట్రీని ప్రధాన విభాగంగా గుర్తించాలి. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయి లో ఏదో అడ్మిషన్ లభించింది కదా? చేరుదాం? అనే ధోరణి కాకుండా.. భవిష్యత్తు అవకాశాలు, కెమిస్ట్రీ ఆధారం గా సమాజానికి కలిగే మేలును దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో అకడెమిక్స్‌పై దృష్టిసారించాలి. ముఖ్యంగా కెమికల్ ఈక్వేషన్స్ ఉపయోగించి ఏదైనా ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు అది సత్ఫలితం సాధించడం వల్ల లభించే ఆనం దం వర్ణనాతీతం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కెమిస్ట్రీ మిస్టరీ అనే అపోహకు విద్యార్థులు ఇట్టే ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు.

శిక్షణ దిశగా ప్రభుత్వ చర్యలు:
కెమికల్ ఇండస్ట్రీ అవసరాలకు సరిపడే స్థాయిలో శిక్షణనిచ్చే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. 12వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో డిమాండ్ దృష్ట్యా పెద్దయెత్తున వొకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్, డిప్లొమా ఇన్‌స్టిట్యూట్స్ ను నెలకొల్పాలని సూచించింది. అంతేకాకుండా.. కెమిస్ట్రీ స్పెషలైజ్డ్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కూడా పేర్కొంది. దీంతోపాటు టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ పేరిట ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది.

ప్రస్తుత విద్యావకాశాలు:
ప్రస్తుతం కెమిస్ట్రీ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. యూనివర్సిటీ స్థాయిలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి కోర్సులను పూర్తిచేయడం. అదేవిధంగా ఐఐటీల్లో కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో పీజీ కోర్సులో ప్రవేశించడం. ఐఐటీల్లో ప్రవేశానికి ఐఐటీ-జామ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.

అకడెమిక్స్‌లో రాణించాలంటే:
ఒకసారి కోర్సులో అడుగుపెట్టాక అంతటితో సంతృప్తి చెందకుండా నిరంతర అధ్యయనం, పరిశ్రమలో చోటు చేసుకుంటున్న తాజా మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలి. కెమిస్ట్రీ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులకు ఉండాల్సిన మరో ప్రధాన లక్షణం.. టెక్నికల్ రైటింగ్ స్కిల్స్. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇంటర్నెట్ ఆధారంగా కెమిస్ట్రీ సంబంధిత అంశాలను పరిశీలించాలి. ప్రస్తుతం ఎన్నో బ్లాగ్‌లు కెమిస్ట్రీకి సంబంధించి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కార్ల్‌జిమ్మర్, కెమ్‌బార్క్, డిబ్రీఫ్ వంటి బ్లాగ్‌లను అనుసరిస్తే ఎంతో విలువైన సమాచారం లభించడంతోపాటు సబ్జెక్ట్ నైపుణ్యం కూడా సొంతమవుతుంది. ప్రయోగశాలల్లో ఎక్కువ సమయం గడిపేందుకు సిద్ధంగా ఉండాలి.

పీహెచ్‌డీ చేస్తే మరిన్ని అవకాశాలు:
వాస్తవానికి ప్రస్తుత డిమాండ్ మేరకు మంచి పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ పూర్తి చేయగానే ఆయా విద్యార్థులకు ఉద్యోగాలందించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉంటున్నాయి. అయితే ఈ విభాగంలో విద్యార్థులు పీహెచ్‌డీ చేస్తే భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉంటుంది. ముఖ్యంగా స్పెషాలిటీ కెమికల్స్, బయో ఫ్యూయల్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ వంటి విభాగాల్లో పీహెచ్‌డీ చేస్తే అవకాశాలకు ఆకాశమే హద్దు.

పరిశ్రమతో అనుసంధానం:
కేవలం కోర్సుల బలోపేతంపైనే దృష్టిపెట్టకుండా.. సంబంధిత రంగంలోని పరిశ్రమలతో అవగాహన ఏర్పరచుకుని, ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు మార్గం వేయాలి. ఇందుకోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు చొరవ చూపాలి. నిరంతరం పరిశ్రమలతో మమేకం అవుతూ.. తాజా సమస్యలు, పరిష్కార మార్గాలపై అన్వేషణ సాగించాలి. అందుకు తగిన పరిశోధన ప్రతిపాదనలతో ముందుండాలి.

ఉద్యోగావకాశాలు:
ప్రస్తుత అంచనాల ప్రకారం- భారత కెమికల్ పరిశ్రమలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2017 నాటికి అదనంగా మరో 15వేల మంది అర్హులైన కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ల అవసరం ఏర్పడనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు కెరీర్ అంటే కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ అనే కాకుండా.. కెమిస్ట్రీ వైపు దృష్టి సారిస్తే అద్భుత భవిష్యత్తు సొంతమవుతుంది.

గ్లోబల్ వార్మింగ్.. అవకాశాలకు సోపానం:
గ్లోబల్ వార్మింగ్.. క్లైమేట్ ఛేంజ్.. ఇప్పుడివి ప్రపంచ సమస్యగా పరిణమించిన అంశాలు. అయితే, వీటి కారణంగానే కెమిస్ట్రీలో సుశిక్షితులైన అభ్యర్థులకు అంతర్జాతీయ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ మొత్తం జనాభాలో 40 శాతం మేరకు పెరగనుంది. ఆ మేరకు ప్రజల నిత్యావసరాలైన పరిశుద్ధమైన నీరు, ఆహారం, శక్తి వంటివి గ్లోబల్‌వార్మింగ్ కారణంగా కష్ట సాధ్యం. అందుకే ఇప్పటినుంచే మురుగునీటి శుద్ధి, బయోమాస్ ఎనర్జీ ప్రొడక్షన్, బయోసోర్స్ ఫ్యూయల్ ప్రొడక్షన్, బయో రిఫైనరీస్ వంటి ప్రత్యామ్నాయ వనరులపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా యూకే, అమెరికా, బ్రెజిల్, కెనడా, ఆఫ్రికా దేశాల్లో ఇవి ఊపందుకుంటున్నాయి. ఈ ప్రక్రియలు విజయవంతం కావాలంటే కెమికల్ ట్రీట్‌మెంట్‌తోనే సాధ్యం. దానికి మార్గం సుశిక్షితులైన కెమికల్ పట్టభద్రులే. కాబట్టి వీరికి అంతర్జాతీయంగానూ అవకాశాలకు కొదవ లేదు.

ఉపాధి వేదికలు:
కెమిస్ట్రీ విభాగంలో నైపుణ్యం సాధించిన వారికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు అన్నిచోట్లా అవకాశాలు లభిస్తాయి. ఫ్యూయల్ ఇండస్ట్రీ, బయో ఇండస్ట్రీ, మాన్యుఫాక్చరింగ్, బల్క్ డ్రగ్ ప్రొడక్షన్, క్లినికల్ టెస్టింగ్, డ్రగ్ ఫార్ములేషన్, మెరైన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్.. ఇలా ఇవన్నీ ఉపాధి వేదికలే. నైపుణ్యాలు, చదివిన కోర్సును బట్టి ప్రారంభ వేతనం రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు ఉంటుంది.

కెరీర్‌లో రాణించాలంటే:
కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ.. ఇలా బేసిక్ సైన్స్ విభాగమేదైనా ఒకసారి కెరీర్‌లో అడుగుపెట్టాక అత్యున్నత స్థాయికి చేరాలంటే నిరంతర అధ్యయనం, పరిశోధనలకు పెద్దపీట వేయడం.. ఆ మేరకు సమయాన్ని వెచ్చించగలిగే సహనం వంటి సహజ లక్షణాలు ఎంతో అవసరం. ముఖ్యంగా కెమిస్ట్రీ విషయానికొస్తే కొన్నిసార్లు.. చేసిన ప్రయోగాలు ఆఖరి దశలో విఫలమవడం సహజం. కానీ ఇలాంటి సందర్భాల్లోనూ నిబ్బరం కోల్పోకుండా, విసుగు చెందకుండా.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. అంతకుముందు ప్రయోగం ఎందుకు విఫలమైందో విశ్లేషించుకుని ముందుకు సాగాలి. ఇలా నిరంతరం నైపుణ్యాలు మెరుగుపరచుకుంటూ సాగితే ఉజ్వల కెరీర్‌కు కెమిస్ట్రీ కేరాఫ్‌గా నిలుస్తుంది!!

కెమిస్ట్రీని పీజీ స్థాయిలో ఆఫర్ చేస్తున్న సంస్థలు

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - బెంగళూరు
    కోర్సు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కెమిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iisc.ernet.in
  • ఐఐటీ - బాంబే
    కోర్సు: ఎంఎస్సీ కెమిస్ట్రీ;ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యుయెల్
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iitb.ac.in
  • ఐఐటీ- ఢిల్లీ
    కోర్సు: ఎంఎస్సీ - కె మిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iitd.ac.in
  • ఐఐటీ- గువహటి
    కోర్సు: ఎంఎస్సీ కెమిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iitg.ac.in
  • ఐఐటీ -కాన్పూర్
    కోర్సు: ఎంఎస్సీ కెమిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iitk.ac.in
  • ఐఐటీ - ఖరగ్‌పూర్
    కోర్సు: జాయింట్ ఎంఎస్సీ - పీహెచ్‌డీ కెమిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iitkgp.ac.in
  • ఐఐటీ - మద్రాస్
    కోర్సు: ఎంఎస్సీ కెమిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iitm.ac.in
  • ఐఐటీ-రూర్కీ
    కోర్సు: ఎంఎస్సీ కెమిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iitr.ac.in
  • ఐఐటీ- భువనేశ్వర్
    కోర్సు: జాయింట్ ఎంఎస్సీ - పీహెచ్‌డీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iitbbs.ac.in
  • ఐఐటీ -గాంధీనగర్
    కోర్సు:
    ఎంఎస్సీ కెమిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iitgn.ac.in
  • ఐఐటీ- హైదరాబాద్
    కోర్సు: ఎంఎస్సీ కెమిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iith.ac.in
  • ఐఐటీ- ఇండోర్
    కోర్సు: ఎంఎస్సీ కెమిస్ట్రీ
    ఎంపిక: జామ్ ద్వారా
    వెబ్‌సైట్: www.iiti.ac.in
  • ఎన్‌ఐటీ - వరంగల్
    కోర్సు:
    ఎంఎస్సీ కెమిస్ట్రీ
    ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
    వెబ్‌సైట్: www.nitw.ac.in
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
    కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- కెమికల్ సెన్సైస్, కెమిస్ట్రీలో రెండేళ్ల ఎంఎస్సీ
    ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
    వెబ్‌సైట్: www.uohyd.ac.in
  • ఉస్మానియా యూనివర్సిటీ - హైదరాబాద్
    కోర్సు:
    ఎంఎస్సీ కెమిస్ట్రీ (వ్యవధి: రెండేళ్లు), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- కెమిస్ట్రీ (వ్యవధి: ఐదేళ్లు)
    ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
    వెబ్‌సైట్: www.osmania.ac.in
  • ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
    కోర్సు: ఎంఎస్సీ కెమిస్ట్రీ
    ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
    వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
  • ఆంధ్రా యూనివర్సిటీ
    కోర్సు: ఎంఎస్సీ కెమిస్ట్రీ (వ్యవధి: రెండేళ్లు), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - అప్లైడ్ కెమిస్ట్రీ (వ్యవధి: ఐదేళ్లు)
    ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
    వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
  • శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ - తిరుపతి
    కోర్సు: ఎంఎస్సీ - కెమిస్ట్రీ
    ఎంపిక : ప్రవేశపరీక్ష ద్వారా
    వెబ్‌సైట్: www.svuniversity.in
Published date : 31 Oct 2013 02:59PM

Photo Stories