పరిశోధనలతో బహుళ ప్రయోజనాలు..
ఒక దేశం అభివృద్ధి పథంలో పయనించాలన్నా.. ఓ వ్యక్తి ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నా.. దోహదపడే సాధనం పరిశోధనలు (రీసెర్చ్). ప్రస్తుతం మనదేశంలో పరిశోధనల అవసరం ఎంతో ఉంది. అందుకే విద్యార్థులను చిన్నప్పటి నుంచే ఆ దిశగా ప్రోత్సహించాలి. ఈ విషయంలో ఫ్యాకల్టీది కీలక పాత్ర. సరైన మార్గ నిర్దేశకులు ఉంటేనే యువత కెరీర్ పరంగా సముచిత నిర్ణయాలు తీసుకొని లక్ష్యాలను చేరుకోగలదు అంటున్నారు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్(బిట్స్)-పిలానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిజేంద్రనాథ్ జైన్. ఐఐటీ- కాన్పూర్‌లో బీటెక్.. స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆయనకు ఐఐటీ - ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో మూడు దశాబ్దాలకు పైగా బోధనానుభవం ఉంది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, స్టార్టప్స్‌లపై ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ...
ఆ మూడే.. ముఖ్య ప్రాతిపదికలు
ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే ముఖ్యంగా మూడు అంశాలు ప్రాతిపదికగా నిలుస్తాయి. అవి.. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఇంటర్నేషనలైజేషన్ (అంతర్జాతీయీకరణ), ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ మూడు అంశాల్లో బిట్స్ ఎంతో ముందంజలో ఉంది. ఎన్నో స్పాన్సర్డ్ రీసెర్చ్, కన్సల్టెన్సీ బేస్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ చేపట్టడంతోపాటు వాటిలో విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్పంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. అందుకే బిట్స్‌కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తోంది.
ఫ్యాకల్టీ పాత్ర కీలకం
విద్యార్థులను పరిశోధనలపరంగా నడిపించడంలో ఫ్యాకల్టీది కీలక పాత్ర. ఫ్యాకల్టీ రీసెర్చ్ చేస్తుంటే.. పీహెచ్‌డీ విద్యార్థులను గైడ్ చేయడం కూడా సులభంగా ఉంటుంది. అందుకే బిట్స్ పిలానీలో ఫ్యాకల్టీ 20 నుంచి 40 శాతం సమయాన్ని కచ్చితంగా పరిశోధనల్లో పాల్గొనేలా చూస్తున్నాం. ఫలితంగా స్పాన్సర్డ్ రీసెర్చ్ గ్రాంట్స్ లభించడంతోపాటు ప్రఖ్యాత జర్నల్స్‌లో రీసెర్చ్ పేపర్స్ ప్రచురితమవుతున్నాయి. అంతేకాకుండా ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌ను.. టీచింగ్, రీసెర్చ్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇండస్ట్రీ ఎంగేజ్‌మెంట్‌లో ముందుంచేలా మిషన్-2015 అనే ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాం.
విద్యార్థుల్లో పీహెచ్‌డీపై ఆసక్తి పెరగాలంటే
పీహెచ్‌డీ విషయంలో మనదేశంలోని విద్యార్థులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆర్థిక ప్రోత్సాహకాలు అంతంతమాత్రంగా ఉండటం. అందుకే చాలా మంది విద్యార్థులు పీహెచ్‌డీ, బోధన రంగాలపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. అయితే ఈ రెండు విభాగాల్లో ఇతర దేశాల్లో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు కారణం ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహకాలే! ప్రభుత్వం కూడా పీహెచ్‌డీ ఔత్సాహికులకు ఇచ్చే స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ మొత్తాన్ని పెంచితే మరింత ఎక్కువ మంది పరిశోధనల రంగంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మరో ప్రధాన సమస్య మన దేశంలోని విద్యార్థులకు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తయ్యే వరకూ పీహెచ్‌డీపై సరైన అవగాహన ఉండటం లేదు. ఈ విషయంలో పాఠశాల స్థాయి నుంచే తరగతి గదిలోనే పరిశోధన దృక్పథం అలవర్చే వాతావరణాన్ని కల్పించాలి. ఆసక్తిని పెంపొందించే విధానాలు అమలు చేయాలి.
బోధనలో తేడాలు
అమెరికా.. భారత్‌లను పోల్చితే బోధన, పాఠం చెప్పే తీరులో వ్యత్యాసం ఉంటోంది. అమెరికాలో టీచింగ్ అసిస్టెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఫ్యాకల్టీ తరగతి గదిలో ఒక అంశాన్ని బోధిస్తే.. దానికి సంబంధించిన లేబొరేటరీ వర్క్, అసైన్‌మెంట్ల పరిష్కారం దిశగా టీచింగ్ అసిస్టెన్స్ సదుపాయం ప్రత్యక్షంగా లభిస్తుంది. ఫలితంగా విద్యార్థులకు తాము థియరిటికల్‌గా నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్‌గా అవగాహన పొందే వీలు కలుగుతుంది. ఈ విధానం మన దేశంలో ఐఐటీలు, బిట్స్ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలోనే ఉంది. ఇది అన్ని స్థాయిల్లో, అన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో అమలు కావాలి.
కరిక్యులంలో మార్పులు చేయాలి
కరిక్యులంలో మార్పు అనేది నిరంతర ప్రక్రియగా సాగాల్సిందే. అప్పుడే పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు సొంతం చేసుకోగలుగుతారు. బిట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో కరిక్యులంలో మార్పులు నిరంతరం జరుగుతుంటాయి.
మరిన్ని అవకాశాలకు.. డ్యూయల్ డిగ్రీలు
ఇటీవల కాలంలో విద్యార్థులకు కెరీర్ పరంగా ఆకర్షణీయంగా మారుతున్నవి డ్యూయల్ డిగ్రీ కోర్సులు. వీటివల్ల విద్యార్థులకు కెరీర్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ప్రస్తుతం బిట్స్‌లో అమలు చేస్తున్న ఈ డ్యూయల్ డిగ్రీ విధానంలో విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సు నిర్ణీత కాల వ్యవధి తర్వాత అదనంగా ఒక ఏడాది ఏదైనా ఒక అంశాన్ని రెండో స్పెషలైజేషన్‌గా చదివితే డ్యూయల్ డిగ్రీ అందజేస్తున్నాం. వాస్తవంగా ఇప్పటి పోటీ పరిస్థితుల్లో డ్యూయల్ డిగ్రీలు ఎంతో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.
స్టార్టప్స్‌కు అనుకూల వాతావరణం కల్పించాలి
స్టార్టప్స్ విషయంలో ఇటీవల కొంత పురోగతి కనిపిస్తున్నప్పటికీ.. అది ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. కారణం వీటికి అవసరమైన సదుపాయాలు తగినంతగా లేకపోవడమే. కానీ.. సిలికాన్ వ్యాలీలో పరిస్థితిని చూస్తే మొత్తం ఉత్పత్తుల్లో 25 శాతం భారతీయుల ఆలోచనలకు ప్రతిరూపాలే. దీని అర్థం.. అవకాశాలు కల్పిస్తే మన దేశంలోనే ఎన్నో ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. ఇటీవల కాలంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించే దిశగా ఐఐటీలు, బిట్స్, ట్రిపుల్ ఐటీలు వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఇంక్యుబేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఇవి ఇంకా పెరగాలి. అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలంటే కొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
లక్ష్యంపై స్పష్టత
విద్యార్థులు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చేరినా.. తమను తాము ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాలి. సదరు ఇన్‌స్టిట్యూట్, కోర్సులో ఎందుకు చేరారు? ఏయే లక్షణాలు తమలో ఉన్నాయి? కోర్సు పూర్తి చేసి ఇన్‌స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక ఏం చేయాలనుకుంటున్నారు? అనే అంశాల్లో స్పష్టత ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తాము వేసే ప్రతి అడుగు జీవితంలో సుదీర్ఘ కాలం ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. ఇక.. కోర్సు పూర్తి చేశాక ఉన్నత విద్య వైపు వెళ్లడమా? ఉద్యోగం సొంతం చేసుకోవడమా? అనేది ఆయా విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉన్నత విద్య ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చని గుర్తించాలి!!