ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి - DRDO RAC Chairman D.N.Reddy
కొన్ని వర్సిటీలకే డీఆర్‌డీఓ పరిశోధన ప్రాజెక్టులు వస్తున్నాయి. మిగతా కాలేజీలనూ ప్రోత్సహిస్తే రీసెర్చ్ విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది కదా?
ఏదైనా వర్సిటీ తన వద్దనున్న వనరులు, పరిశోధనాసక్తి వివరాలతో ముందుకువస్తే.. ప్రతిభ ఆధారంగా ప్రాజెక్టులు ఇవ్వడానికి సిద్ధమే. వాస్తవానికి ఐఐటీ, ఐఐఐటీల్లో ఫ్యాకల్టీకి బోధనభారం కొంత తక్కువగా ఉంటుండటంతో రీసెర్చ్‌లో రాణిస్తున్నారు. అందుకే వారికి వరుస ప్రాజెక్టులు లభిస్తున్నాయి.
మిగతా వర్సిటీల్లోని ప్రొఫెసర్లకు బోధన బాధ్యతలు ఎక్కువ. పైగా సాధారణ వర్సిటీలు, కాలేజీల్లో బోధన సిబ్బంది ఎక్కువ శాతం తాత్కాలిక ప్రొఫెసర్లే. పూర్తిస్థాయి సిబ్బంది కలిగిన వర్సిటీలు ఉంటే ప్రాజెక్టులివ్వడానికి మేం సిద్ధమే.
ఏటా 200 మంది యువ సైంటిస్టులకు ఉద్యోగాలిస్తామని డీఆర్‌డీఓ చెబుతోంది. దేశంలో లక్షల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్, సైన్స్ అభ్యర్థులకు 200 పోస్టులు చాలా తక్కువ కదా?
ఏటా 500కుపైగా యువ శాస్త్రవేత్తలను తీసుకోవాలనుకుంటున్నాం. కానీ అనుమతులు 200కు మించి రావడంలేదు. ఆర్థికభారం దృష్ట్యా ఈ సంఖ్యను పెంచడం కష్టమవుతోంది. ఇకపై ఈ సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తాం.
దేశంలో ఏటా ఉన్నత విద్యలో చేరుతున్నవారు కేవలం 15 శాతమే. దీన్ని యూజీసీ పేర్కొన్నట్లు 22 శాతానికి పెంచడం సాధ్యమేనా?
ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు. కేవలం ప్రభుత్వ వర్సిటీలతోనే చేయాలంటే కష్టం. ప్రైవేటు యూనివర్సిటీల పాత్ర కూడా ముఖ్యమే. దేశంలో మొత్తం 110కిపైగా ప్రైవేటు వర్సిటీలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వర్సిటీలు కలిసి పనిచేస్తే.. ఉన్నత విద్యలో చేరేవారి సంఖ్యను పెంచడంతోపాటు పరిశోధన రంగానికి కూడా ఊతమివ్వొచ్చు.
చాలా వర్సిటీల్లో బోధన ప్రమాణాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరోవైపు వచ్చే పదేళ్లలో వేయి వర్సిటీల ఏర్పాటును యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ప్రమాణాలు మరింత దిగజారతాయి కదా!
దేశంలో పెరుగుతున్న సామాజిక, పరిశోధన అవసరాలకు అనుగుణంగా వర్సిటీలను పెంచాలి. ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు ప్రస్తుతమున్న వర్సిటీలు సరిపోవడంలేదు. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త వర్సిటీల స్థాపన తప్పనిసరి. కానీ నాణ్యత దిగజారకుండా చూసుకోవాలి.
మౌలిక వసతులు లేకుండా.. కొత్త వర్సిటీలు స్థాపిస్తే ప్రమాణాలు దిగజారి విద్యార్థులు నష్టపోతారు. అందుకే ప్రతి వర్సిటీ 5 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకొని.. బోధన, ఆర్థికపరంగా అంచనాలు రూపొందించుకొని రంగంలోకి దిగాలి. అప్పుడేప్రమాణాలు పడిపోకుండా ఉన్నత విద్యను అందించొచ్చు.
నాణ్యమైన బోధనలేక చాలా వర్సిటీల్లో రీసెర్చ్‌లో చేరడానికి విద్యార్థులే జంకుతున్నారు. వర్సిటీల్లో పరిశోధనలను ప్రోత్సహించాలంటే ఏంచేయాలి?
వర్సిటీల్లో రీసెర్చ్‌ను ప్రోత్సహించడానికి యూజీసీ 28 పథకాలు అమలుచేస్తున్నా వర్సిటీలు వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలేదు. ఏటా కాలేజీలు, వర్సిటీలకు ఇస్తున్న నిధుల్లో 50 శాతం మాత్రమే ఖర్చవుతుండగా.. మిగతా సొమ్మంతా యూజీసీకే తిరిగి వస్తోంది.
స్టేట్ వర్సిటీల్లో ప్రొఫెసర్లు, ఇతర బోధన సిబ్బంది జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. ఆయా ప్రభుత్వాలు ఈ పోస్టులను భర్తీచేయడంలేదు. దాంతో ప్రొఫెసర్లు లేక పరిశోధన కుంటుపడుతోంది. దీనివల్ల విద్యార్థులు పరిశోధనను కెరీర్‌గా ఎంచుకోవడానికి జంకుతున్నారు.
వర్సిటీల్లో కాలంచెల్లిన కోర్సులు.. కంపెనీల అవసరాలకు ఉపయోగపడని సిలబస్ అమలవుతుండడంతో విద్యార్థులు నష్టపోతున్నారనే అభిప్రాయం ఉంది?
ఇంజనీరింగ్ కాలేజీల్లో సిలబస్, కోర్సుల ఆధునికీకరణ కనీసస్థాయిలోనైనా జరుగుతోంది. ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లో కొత్త కోర్సుల రూపకల్పన, ఉపాధినిచ్చే సిలబస్‌ను ప్రవేశపెట్టే దిశగా ఒక్క అడుగూ పడడంలేదు. ఈ విషయాన్ని యూజీసీ కూడా గుర్తించింది. ప్రతి వర్సిటీలో నాణ్యమైన, సమర్థత కలిగిన ప్రొఫెసర్లుంటే విద్యార్థులకు ఉపాధి కష్టాలు ఉండవు. రాష్ట్రాల్లోని వర్సిటీల్లో 40 శాతానికిపైగా ప్రొఫెసర్ల కొరత ఉంది. దాంతో కాంట్రాక్టు ప్రొఫెసర్లతో కాలం నెట్టుకొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేస్తే.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చు.
దేశంలో ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇది కలవరపర్చే విషయం. దీన్ని యూజీసీ ఎలా ఎదుర్కోబోతోంది?
కొత్త ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రొఫెసర్ల కొరత తలెత్తింది. దేశంలో ఇప్పుడున్న అవసరాలకు ఏటా 10వేల మంది పీహెచ్‌డీ చేయాల్సి ఉండగా.. కేవలం 1,000 మంది మాత్రమే పీహెచ్‌డీ చేస్తున్నారు. దాంతో కొత్తగా అధ్యాపకులు తయారుకావడంలేదు. అంతేకాకుండా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి చక్కని ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతో వారు ఉన్నత విద్యవైపు వెళ్లడం లేదు. విద్యార్థులను పీహెచ్‌డీ వైపు ఆకర్షిస్తే ఫ్యాకల్టీ కొరత ఉండదు.
వర్సిటీల మధ్య కోర్సులు, ప్రొఫెసర్ల మార్పిడి కనీసస్థాయిలో కూడా జరగడం లేదనే అభిప్రాయముంది?
చాలా వర్సిటీలు పక్కనున్న మంచి వర్సిటీలను గుర్తించకుండా.. ఇతర దేశాలకువెళ్లి అక్కడి వర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఎక్కువ ఖర్చుతో ప్రొఫెసర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది సరికాదు. ప్రతి వర్సిటీ సహచర యూనివర్సిటీలతో కలిసి కోర్సులు, ప్రొఫెసర్ల మధ్య మార్పిడి జరిగేలా ఆయా వీసీలు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో యూజీసీ నుంచి కూడా మరింత జాగ్రత్తపడతాం.
మన రాష్ట్రంలో చాలా వర్సిటీల నాణ్యత తీసికట్టుగా ఉంటోంది. పరీక్షల నిర్వహణ, కొత్తకోర్సుల రూపకల్పన వరకు నత్తనడక, మొక్కుబడి వ్యవహారమే? ఈ పరిస్థితికి కారణం?
వర్సిటీల పనిదినాల సంఖ్య బాగా తగ్గిపోతుండడంతో..ఆ ప్రభావం సిలబస్‌పై పడుతోంది. మనరాష్ట్రంలో ఒక్కసారే 5కుపైగా కొత్త వర్సిటీలు స్థాపించారు. తర్వాత వాటికి నిధులు ఇవ్వడంలోను, బోధన సిబ్బందిని నియమించడంలో నిర్లక్ష్యాన్ని చూపడం కూడా సమస్యలకు దారితీస్తోంది.
దాంతో పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఇతర పాలనా వ్యవహారాలు నాసిరకంగా మారి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెడుతున్నాయి. అందుకే సరిగా పనిచేయని వర్సిటీలపై నిఘా పెట్టి..అవసరమైతే వాటి అనుమతులను రద్దుచేసేందుకు త్వరలో ట్రిబ్యునల్, మాల్‌ప్రాక్టీస్ బిల్లులను తేవడానికి యూజీసీ ప్రయత్నాలు చేస్తోంది
దేశంలో 110కిపైగా ప్రైవేటు యూనివర్సిటీలుంటే.. మనరాష్ర్టంలో ఒక్కటీ లేదు. కారణం?
ఉన్నత విద్య అవసరాలను ప్రభుత్వ వర్సిటీలొక్కటే తీర్చలేవు. అందుకే ప్రైవేటు, డీమ్డ్, స్టేట్ వర్సిటీల అవసరాలు పెరిగాయి. ఇప్పటివరకు 116 కొత్త ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు అనుమతులు యూజీసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన దరఖాస్తులు ఎక్కువే ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలోని 18 రాష్ట్రాల్లో 110కిపైగా ప్రైవేటు వర్సిటీలుండగా.. మరో 5రాష్ట్రాల్లో ఒక్క ప్రైవేటు వర్సిటీ స్థాపన జరగలేదు. వీటికి అనుమతినివ్వాల్సిందే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే.
కోర్సులు పూర్తి చేసుకొని వచ్చేవారిలో నాణ్యత లోపిస్తుండటంతో.. ఉద్యోగాలివ్వడానికి కంపెనీలు నిరాకరిస్తున్నాయి. అలాంటప్పుడు విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గమేంటి?
ఈ పరిస్థితికి వర్సిటీలనే తప్పుబట్టాలి. నైపుణ్యాలు విద్యార్థుల్లో పెరగాలంటే ముందు సిలబస్ మార్చాలి. కాలేజీలు, వర్సిటీల పని దినాలు పెరగాలి. బోధనలో కొత్త మార్పులు తెచ్చి విద్యార్థులు క్లాస్‌రూంకు వచ్చేలా చేయాలి. ప్రాజెక్టు వర్కులు పెంచి పరిశ్రమలతో అనుసంధానం కచ్చితంగా చేసి తీరాలి. ఉద్యోగానికి అవసరమైన లక్షణాలు కాలేజీలో ఉండగానే నేర్చుకునేలా ప్రొఫెసర్లు ప్రణాళిక రూపొందించాలి. కోర్సు ఏదైనా.. క్షేత్రస్థాయి నైపుణ్యం లభించేలా చేయాలి. ఇలా చేస్తే ప్రముఖ కాలేజీ విద్యార్థులకు వచ్చే జాబ్ ఆఫర్లు కచ్చితంగా సాధారణ వర్సిటీ, కాలేజీ విద్యార్థులకు వస్తాయి. సౌకర్యాలు లేని కాలేజీలో విద్యార్థులే సొంతంగా తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.
యూజీసీ సభ్యుడిగా వర్సిటీలు, కాలేజీలకు మీరిచ్చే సలహా?
అవసరమైనంత మంది ప్రొఫెసర్లను, నిధులను సమకూర్చుకోవాలి.అవసరాలకనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలి. కంపెనీలతో కలిసి వారి అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలి. ఇది జరిగితే విద్యార్థికి ఉపాధి సమస్య తలెత్తదు. ఐఐటీ, ముంబై కంప్యూటర్ కోర్సులకు, ఐఐఎం, బెంగళూరు మేనేజ్‌మెంట్ విద్యకు పెట్టింది పేరు.
ఇలా ప్రతి యూనివర్సిటీ ఫోకస్డ్ ఏరియాలో దృష్టిపెట్టి రాణించాలి. ప్రతి అవసరానికి ప్రభుత్వ నిధులకోసం ఎదురుచూస్తే వర్సిటీ నాణ్యతను ఫణంగా పెట్టినట్టే. సొంతంగా నిధుల సమీకరణకు యత్నించాలి.
యూజీసీ-యూనివర్సిటీలు-రాష్ట్రాల ఉన్నతవిద్యా మండలి.. ఈ మూడింటికి మధ్య సమన్వయం ఉండడంలేదు. ఇది ఉన్నత విద్య ప్రమాణాలపై ప్రభావం చూపడం లేదంటారా?
సమన్వయలోపం మాట నిజమే. ఈ సమస్యకు పరిష్కారం సరైన నాయకత్వం. సమస్యల్లా నాయకత్వ లోపమే. అన్నిచోట్లా ఇప్పుడు బోధనతో సంబంధంలేని నిపుణులను వర్సిటీలు, ఉన్నతవిద్యామండలి ఉన్నతాధికారులుగా నియమిస్తుండడంతో..ప్రణాళికలేమితో ఈ వ్యవస్థలు నడుస్తున్నాయి.
దేశంలో విదేశీ వర్సిటీలతో మనకు కలిగే మేలేంటి?
అమెరికా, ఐరోపా దేశాల్లోని వర్సిటీలు విద్యార్థుల్లో క్షేత్రస్థాయి నైపుణ్యం పెంపొందించేందుకు కరిక్యులంలో పెద్దపీట వేస్తాయి. దాంతో అక్కడ స్టూడెంట్- జాబ్ సక్సెస్‌రేట్ చాలా ఎక్కువ. ఇటువంటి వర్సిటీలు మన దేశంలో ఏర్పాటైతే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.
అంతేకాకుండా విదేశీ వర్సిటీల పోటీని తట్టుకోవడానికి.. ఇక్కడ వర్సిటీలు తమ పంథా మార్చుకుని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాయి.
యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల మధ్య సమన్వయలోపం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చడమెలా?
యూనివర్సిటీలు, వాటిపరిధిలోని కాలేజీల మధ్య సమన్వయం తీసుకురావలసిన బాధ్యత ఉన్నత విద్యామండలిది. ఆ తర్వాత వైస్‌ఛాన్సలర్లది. వైస్ ఛాన్సలర్ల నియామకంలో బోధన అనుభవం ఉన్నవారికి పెద్దపీట వేస్తే వర్సిటీలు, కాలేజీల్లో ప్రమాణాలు పెరుగుతాయి. ఇది అంతిమంగా వర్సిటీ పనితీరును మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది.
విద్యార్థులకు మీరిచ్చే సలహా?
టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తోంది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే.. దాన్ని ఔపోసనపట్టాల్సిందే. అందుకే వృత్తిఏదైనా.. ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను వృద్ధిచేసుకోవాలి. అందరిలా ఏదో ఉద్యోగం చేసుకుపోదాం..! అనుకుంటే కెరీర్ గ్రాఫ్ ఆగిపోయినట్లే. ఎవరైతే సృజనాత్మకంగా ఆలోచిస్తారో.. వారికే మార్కెట్లో ఉద్యోగాలు వరిస్తాయి!!