Skip to main content

మీ లక్ష్యాన్ని ఇష్టపడితే చాలు !

‘బైజూ’స్ లెర్నింగ్ యాప్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కూడా... చదువుతో ప్రేమలోనే పడ్డాడు. అదే ప్రేమతో ‘క్యాట్’ పరీక్ష రెండుసార్లు రాసి... రెండుసార్లూ 100 పర్సంటైల్ సాధించాడు. కానీ, ఐఐఎంలో చేరలేదు. అంతేకాదు!! కేరళలోని కన్నూర్ జిల్లా అజికోడ్ లాంటి పల్లెకు చెందిన రవీంద్రన్... మలయాళీ మీడియంలో చదువుతూ... క్రికెట్ కామెంటరీ విని ఇంగ్లిష్ నేర్చుకున్నాడంటే దాన్నెలా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. ఫుట్‌బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్... ఇలా ఆటలాడుతూ చదువును కూడా ఆటలా మార్చేసి... తన బైజూస్‌ను రెండుకోట్ల మంది యూజర్లతో రూ.1400 కోట్ల వార్షికాదాయాన్ని ఆర్జించే కంపెనీగా మార్చాడు. నాలుగో తరగతిలో మొదలెడితే... క్యాట్, జీమ్యాట్, గేట్, సివిల్స్ వంటిప్రతిష్టాత్మక పోటీ పరీక్షల ప్రిపరేషన్...అంతా తన యాప్‌తోనేఅందిస్తున్నాడు. ‘యువత తమ లక్ష్యాన్ని ప్రేమించాలి’ అని చెప్పే రవీంద్రన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...
ప్రశ్న. ఓ చిన్న పల్లె నుంచి... అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎడ్‌టెక్ స్టార్టప్ సీఈఓగా... ఈ ప్రయాణం ఎలా ఉంది? అసలు బైజూస్ ఆలోచన ఎలా వచ్చింది?
జవాబు:
నేను పుట్టి, పెరిగింది.. కేరళలోని అజికోడ్‌లో! ఇంటర్ వరకు చదివిందీ అక్కడే. అమ్మానాన్న టీచర్లు. మలయాళం మీడియంలోనే హైస్కూల్ చదువు పూర్తయింది. తర్వాత కన్నూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. ఆ పట్టాతో యూకేకు చెందిన మల్టీ నేషనల్ షిప్పింగ్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. రెండేళ్లు చేశా. అప్పుడోసారి సెలవుల్లో బెంగళూరులోని స్నేహితుల వద్దకు వెళ్లాను. వాళ్లు ‘క్యాట్’కు సిద్ధమవుతున్నారు. మ్యాథ్స్‌లో సందేహాలొస్తే నన్ను అడిగారు. షార్ట్‌కట్ మెథడ్‌లో వాటిని సాల్వ్ చేసి.. ఎలా చేయాలో చూపించాను. వాళ్లు క్యాట్‌లో ర్యాంకు కొట్టి ఐఐఎంలో సీటు సాధించారు. నన్ను కూడా ‘క్యాట్’ రాయమని ప్రోత్సహించి వాళ్లే నా దరఖాస్తు కూడా పంపించారు. సరదాగా పరీక్షకు హాజరయ్యా. హాజరయ్యాక ఖాళీగా ఉండలేం కదా..! ప్రశ్నలన్నిటికీ సమాధానాలు గుర్తించా. 2007 క్యాట్‌లో వంద పర్సంటైల్ లభించింది. దీంతో అన్ని ఐఐఎంలలో సీటు లభించే అవకాశముంది. కానీ ఏ ఐఐఎంకూ దరఖాస్తు చేసుకోలేదు. ఎందుకంటే.. స్నేహితులకు క్యాట్ ప్రిపరేషన్‌కు సలహాలిచ్చేటపుడు నాకు ఓ ఆలోచన వచ్చింది. దాన్ని అమల్లోపెట్టి... సొంతగా పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి తోడ్పాటు అందించేలా టీచింగ్‌పై దృష్టిపెట్టాను. తొలినాళ్లలో ఆఫ్‌లైన్ విధానంలో బోధించా. తర్వాత 2009లో వీ-శాట్ ఆధారంగా క్యాట్ ఆన్‌లైన్ శిక్షణనివ్వడం ప్రారంభించాను.

పశ్న. మరి క్యాట్ టీచర్‌గా ఆరంభించి బైజూస్ లెర్నింగ్ యాప్ వరకూ ఎలా వెళ్లారు? బైజూస్ ప్రత్యేకతేంటి?
జ.
దాదాపు మూడేళ్లపాటు క్యాట్ కోచింగ్‌కే పరిమితయ్యాను. అప్పుడే... ఇక్కడితో ఆగిపోకుండా మరింత మందికి చేరువవ్వాలనే ఆలోచన మొదలైంది. దాంతో 2011లో... నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని.. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ అందుబాటులోకి తెచ్చాం. ఈ స్థాయిలో చాలామంది పిల్లలు యాంత్రికంగా చదువుతుంటారు. అలా చదవడం వల్ల మార్కులు వస్తాయేమో కానీ.. సబ్జెక్ట్‌పై, నేర్చుకోవటంపై వారికి ఆసక్తి పెరగదు. దీంతో భవిష్యత్‌లో ఉన్నత చదువుల పరంగా ఇబ్బందిపడతారు. దీన్ని గుర్తించి లెర్నింగ్ పట్ల విద్యార్థుల్లో ఇష్టం పెరిగేలా టూల్స్‌ను రూపొందించి.. ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చాం. ఇది ఎంతో విజయవంతమైంది.

ప్రశ్న. బైజూస్ ఇంత త్వరగా ఎలా విజయవంతమయింది?
జ.
2015...మాకు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అది మరిచిపోలేని సంవత్సరం. అప్పుడే దేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతోంది. దీన్ని గుర్తించి ఆ సంవత్సరంలో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను తెచ్చాం. ఈ యాప్ ద్వారా అరచేతిలోనే అన్ని కోర్సులు, సబ్జెక్ట్‌లకు సంబంధించి లెర్నింగ్ సాధనాలు లభించేలా ప్రోగ్రామ్ రూపొందించాం. ఈ యాప్‌లో మరో విశిష్టత ఏంటంటే... ప్రతి ఒక్కరికీ వారి ఆసక్తులు, అభిరుచులకు తగ్గట్టు బోధనను అందించడమే. నిజానికిపుడు విద్యార్థులు చదువుతున్న దానికి, కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుంటున్న విధానానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు-మార్కుల కోణంలో అధిక శాతం మెమరీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప.. నిజమైన ఆసక్తి చూపడం లేదు. ఈ ఆసక్తి పెంచేలా లెర్నింగ్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చాం.

పశ్న. ఇపుడు మీకు యూజర్లెందరున్నారు? ఇంకా కొత్తగా ఏం చేస్తున్నారు?
జ.
2015లో బైజూస్ యాప్‌ను ప్రారంభించినప్పటి నుంచీ చాలా ఆదరణ ఉంది. ప్రస్తుతం ఏడు ప్రధాన నగరాలతోపాటు 1700కు పైగా పట్టణాల నుంచి 2 కోట్లకు పైగా యూజర్లున్నారు. బైజూస్‌ను ఒక లెర్నింగ్ విప్లవం అని చెప్పడానికి ఇంకా చాలా చేయాలి. ఈ అక్టోబర్‌లో కొత్త ఉత్పత్తిని తెస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో సైతం మా ఉత్పత్తులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రొడక్ట్‌లను తయారు చేస్తున్నాం. దీనికోసం యూట్యూబ్‌లో బాగా ఆదరణ పొందిన టీచర్స్‌ను ఇక్కడికే రప్పించి.. వారి లెక్చర్స్‌ను రికార్డ్ చేయాలని భావిస్తున్నాం. ఈ ఏడాది దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా దృష్టిపెడుతున్నాం.

పశ్న. ఖాళీ సమయాల్లో మీరేం చేస్తుంటారు? మిమ్మల్ని ‘పుస్తకాల పురుగు’ అనుకోవచ్చా?
జ.
అలాంటిదేమీ లేదు. నిజానికి నా చిన్నతనం పాఠశాల స్థాయి చదువంతా ఆటలతోనే గడిచింది. తరగతి గదిలో కంటే ప్లే గ్రౌండ్‌లోనే ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్ ఇలా.. స్కూల్‌లో అన్నిరకాల ఆటల్లో ముందుండే వాణ్ని. మరోవైపు చదువులో వెనుకబడకూడదనే తాపత్రయం. దీంతో సొంతంగా చదువుకునే వాడిని. ఫలితంగా ఒక పాఠాన్ని, అంశాన్ని ‘విశ్లేషించుకుని’ కాన్సెప్ట్‌లు అర్థం చేసుకునే లక్షణం అలవడింది. అంతేకాకుండా ప్రశ్నించే తత్వం, సమస్యకు సొంతంగా పరిష్కారం కనుగొనే నైపుణ్యాలు లభించాయి. ఇవే నన్ను ఈ రోజు ఈ స్థాయికి చేర్చాయని చెప్పొచ్చు. ఆటలు.. టీమ్ వర్క్‌ను, ఒత్తిడి వాతావరణంలో పని చేయడం, దుందుడుకు స్వభావాన్ని నియంత్రించుకోవడం, నాయకత్వ లక్షణాలు వంటివెన్నో నేర్పిస్తాయనేది నా నమ్మకం.

పశ్న.ఇప్పటి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మీకు నచ్చని అంశాలేమైనా ఉన్నాయా?
జ.
అలా చెప్పలేం కానీ... తల్లిదండ్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు తమ పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమంటే.. తమ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఉంటున్నారు. దీంతో పిల్లలు కూడా స్పూన్ ఫీడింగ్ విధానంలోనే చదువుతున్నారు తప్ప.. తమ సొంత ఆలోచనలకు పదును పెట్టడం లేదు. ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. కానీ సమస్యలను గుర్తించడం, ప్రశ్నలు అడిగే దృక్పథం వంటి లక్షణాలు అలవడటంలేదు.

పశ్న. స్టూడెంట్లు కానీ... ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుకానీ... యువతకు మీరిచ్చే సలహా...
జ.
యువ ఔత్సాహి పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేదొకటే. మీరు చేసే పని సమాజంలో సమస్యలకు పరిష్కారం చూపించేదైతే... ఫలితం లభించాక కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. నా ఉద్దేశంలో డబ్బు మీద ఆసక్తితో వ్యాపారాన్ని నిర్వహించలేం. సమాజంలో మార్పు తేవాలనే ఆసక్తితో మొదలుపెట్టాలి. వాస్తవానికి నా విషయాన్నే తీసుకుంటే.. వృత్తి రీత్యా ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించాను. తర్వాత అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగాను. ఆసక్తితో టీచర్‌గా మారాను. అసలు ఈ వ్యాపారం(బైజూస్) ప్రారంభించాలని నేను ఏనాడూ అనుకోలేదు. నాలో ఆసక్తిని అన్వేషించాను. నా బలాల్ని సమీకరించుకోవడంతో అదే వ్యాపారంగా మారింది.

యువత ఆలోచనల పరిధి విస్తరించాలి. పెద్దగా ఆలోచించాలి. ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి సరైన ప్రణాళికతో శరవేగంగా కదలాలి. మీ ఆలోచన పట్ల మీకు ఆసక్తి ఉంటే.. దానికి రూపమిచ్చేలా మొదటి నుంచీ కష్టపడితే విజయం మిమ్మల్ని తప్పకుండా అను సరిస్తుంది. యువత తమ లక్ష్యంపై స్పష్టత తో... ప్రేమతో ముందుకు కదలాలి. మెజరబుల్ గోల్స్ సూత్రాన్ని నమ్ముకోవాలి. ఫలితంగా మీ ఆశయ సాధన క్రమంలో ఏ స్థాయికి చేరారనేది నిరంతరం సమీక్షించుకునే వీలుంటుంది. బైజూస్‌ను ప్రారంభించేటప్పుడు దేశంలో అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్నాలజీ బ్రాండ్‌గా నిలవాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాం. అది నెరవవేరడమే కాకుండా.. ప్రపంచంలోనే అతి పెద్ద బ్రాండ్‌గా పేరొందే దిశగా ప్రస్తుతం పయనిస్తున్నాం!!

బైజూస్ ప్రయాణం...
  • 2011లో... నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని.. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ అందుబాటులోకి తెచ్చారు.
  • 2015లో బైజూస్ యాప్‌ను ప్రారంభించినప్పటి నుంచీ చాలా ఆదరణ ఉంది. ప్రస్తుతం ఏడు ప్రధాన నగరాలతోపాటు 1700కు పైగా పట్టణాల నుంచి 2 కోట్లకు పైగా యూజర్లున్నారు.
  • ఫుట్‌బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్... ఇలా ఆటలాడుతూ చదువును కూడా ఆటలా మార్చేసి... తన బైజూస్‌ను రెండుకోట్ల మంది యూజర్లతో రూ.1400 కోట్ల వార్షికాదాయాన్ని ఆర్జించే కంపెనీగా రవీంద్రన్ మార్చాడు.
Published date : 15 Aug 2018 07:48PM

Photo Stories