Skip to main content

కొత్త సిలబస్.. సరికొత్త ప్రయోగం

మారిన సిలబస్‌తో ఎంసెట్-2014కు నోటిఫికేషన్ వెలువడింది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా, పక్కా ప్రణాళికతో పరీక్షను నిర్వహించి, విజయవంతంగా కౌన్సెలింగ్ పూర్తిచేస్తామని భరోసా ఇస్తున్నారు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్.వి.రమణరావు. కొత్త సిలబస్‌తో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు చెబుతున్న ఆయనతో ‘భవిత’ ఇంటర్వ్యూ...

ఎంసెట్-2014లో ప్రధాన మార్పులు ఏవి?
ఇంటర్మీడియట్ సిలబస్ మారిన నేపథ్యంలో ఎంసెట్ సిలబస్‌లోనూ మార్పులు చేయడం అనివార్యమైంది. దీనివల్ల ఎంసెట్ తొలిసారి రాయబోతున్న విద్యార్థులకు ఇబ్బందేమీ ఉండదు. కానీ, రెండోసారి పరీక్షకు సిద్ధమయ్యే వారు కొంచెం ఎక్కువ కసరత్తు చేయక తప్పదు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఏవైనా తప్పులు దొర్లితే, పరీక్ష తేదీకి ముందే వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నాం. అక్రమాలను అరికట్టడంలో భాగంగా ఈ-భద్రతా చర్యలు తీసుకున్నాం. ఈసారి వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ సమాధాన పత్రాలను ఉంచనున్నాం.

ఈ ఏడాది పరీక్షకు ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశముంది?
గతేడాది ఇంజనీరింగ్ పరీక్షను 2.95 లక్షల మంది, మెడిసిన్ పరీక్షను 1.5 లక్షల మంది రాశారు. కెరీర్ పరంగా అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఎంసెట్‌కు 4.10 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశముంది. పరీక్ష నిర్వహణలో గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం.

ఎంసెట్-2014 ద్వారా ఏయే కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు?
గతేడాది తరహాలోనే ఈ ఏడాది ఎంసెట్ ద్వారా మొత్తం 17 కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాం. ఇంజనీరింగ్ విభాగంలో మూడు లక్షల సీట్లున్నాయి. మెడిసిన్‌లో వెయ్యి సీట్లు పెరగడం వల్ల అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 6 వేలకు చేరింది. బీఫార్మసీ సీట్లను ఎంపీసీ, బైపీసీ అభ్యర్థులకు చెరిసగం కేటాయిస్తాం.

ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏమిటి?
10+2 అర్హత ఉన్నవారు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ గ్రూప్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 40శాతం మార్కులుంటే సరిపోతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు ఫీజు ఎక్కడ చెల్లించాలి?
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్ విభాగానికి రూ.250; అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాలకు రూ.250 ఫీజు ఉంటుంది. రెండూ రాసే వారికి రూ.500 ఫీజు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 20న ప్రారంభమవుతుంది. సూచనలన్నీ పూర్తిగా చదివిన తర్వాత దరఖాస్తు నింపాలి. ఒకవేళ ఏవైనా తప్పులు దొర్లితే, నిర్దేశ తేదీలోగా వాటిని సరిచేసుకోవచ్చు. దరఖాస్తు పంపాక, ప్రింటవుట్‌ను జాగ్రత్తపరచుకోవాలి. పరీక్ష రోజున ప్రింటవుట్ తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి.

ఎంసెట్ ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్ జాప్యంతో వేల మంది విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. ఈసారైనా అంతా సకాలంలో జరుగుతుందని ఆశించవచ్చా?
ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, జాప్యాన్ని నివారించేలా ఏర్పాట్లు చేశాం. ప్రణాళిక ప్రకారం పరీక్ష నిర్వహణ నుంచి కౌన్సెలింగ్ వరకు అన్నీ సకాలంలో జరిగేలా చూస్తాం.

రాష్ట్రంలో ఎంసెట్ కీలక పరీక్ష. దీనికి సంబంధించి మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజ్, హైటెక్ సాధనాల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నాం. పరీక్ష గదిలోకి ఎలాంటి వస్తువులనూ అనుమతించం. చివరకు ఎలక్ట్రానిక్ వాచీలనూ నిషేధించాం. జామర్ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల వేలిముద్రలను కూడా తీసుకుంటాం.

చాలా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులను వారి కళాశాలల్లో చేరేలా యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను మార్చడం, అప్షన్స్ మార్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి వాటిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఈ ఏడాది నుంచి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు విద్యార్థులు తల్లిదండ్రుల ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వారిని మాత్రమే కౌన్సెలింగ్ కేంద్రాలకు అనుమతిస్తాం. హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే వెబ్ అప్షన్లు ఇవ్వాలి. అప్షన్లు మార్చుకోవాలంటే విద్యార్థి తప్పనిసరిగా హెల్ప్‌లైన్ కేంద్రానికి రావాల్సిందే!

మంచి ర్యాంకు సాధించేందుకు అభ్యర్థులకు మీరిచ్చే సలహా?
సిలబస్‌పై పూర్తిస్థాయి అవగాహన అవసరం. దీనికి తగినట్లు ప్రిపరేషన్‌ను మలచుకోవాలి. కేవలం విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడమే కాకుండా, వారి తెలివితేటలను అంచనా వేసేందుకు వీలుగా ప్రశ్నపత్రం ఉంటుంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో లోకల్, నాన్ లోకల్ విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా?
లోకల్, నాన్‌లోకల్ విషయంలో గతేడాది విధానాన్నే అమలుచేస్తాం.

పరీక్ష విధానం
ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 160 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 180 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. బైపీసీ విద్యార్థులకు జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
Published date : 20 Feb 2014 03:44PM

Photo Stories