Skip to main content

కెరీర్ లక్ష్యంగా విద్యాబోధన - అశోక్ మిట్టల్

ఈ రోజుల్లో విద్య వ్యాపారమే. ఎవరూ కాదనలేని సత్యం ఇది. ధనార్జనే ధ్యేయంగా సంస్థలు నడిపేవాళ్లు ఎందరో ఉన్నారు. కానీ ఒక్క మినహాయింపుగా కనిపిస్తుంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. దేశం నలుమూలల నుంచి దాదాపు 40 వేల మంది విద్యార్థులు జలంధర్ సమీపంలోని 600 ఎకరాల క్యాంపస్‌లో విద్యను అభ్యసిస్తుండటమూ.. ప్రైవేట్ యూనివర్సిటీగానే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ చేపట్టడమూ.. వర్సిటీ రూటు సపరేటు అనేందుకు తార్కాణాలు. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను కూడా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో యూనివర్సిటీ కులపతి అశోక్ మిట్టల్‌తో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ...
ప్రశ్న: ఎల్‌పీయూలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే 20 శాతం వరకూ ఉన్నారు కదా.. మరింత మందిని ఆకర్షించేందుకు దక్షిణాదిలో రెండో క్యాంపస్ ఏర్పాటు చేయవచ్చు కదా?
జవాబు:
ప్రపంచం మొత్తమ్మీద ఏ ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయానికీ రెండో క్యాంపస్ లేదు. దక్షిణాదిలో ఇంకో క్యాంపస్ పెడితే. ఈ క్యాంపస్ మానవ వనరులను పంచుకోవాల్సి వస్తుంది. ఇది నాణ్యతతో రాజీపడటమే. నాణ్యమైన విద్య అందిస్తున్నందుకే అంత దూరం నుంచి విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి రెండో క్యాంపస్ ఎందుకు?

ప్ర: మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు. మరి.. ఇంతమంది విద్యార్థుల కారణంగా బోధన నాణ్యత దెబ్బతింటుంది కదా..?
జ:
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం నాణ్యతకు ఏమాత్రం సమస్య కాదు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీలకు వేల ఎకరాల భూమి ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువ. ఇది పరోక్షంగా పన్ను డబ్బులను వృథా చేయడమే. అక్కడ ఫీజులు తక్కువగానే ఉన్నా వనరుల దుర్వినియోగం అవుతున్న మాటేమిటి? ఎల్‌పీయూలో కరిక్యులం రూపకల్పన మొదలు.. పరీక్షల నిర్వహణ వరకూ అన్నింటినీ స్వతంత్ర వ్యవస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నాం. అధ్యాపకుల బోధనకు సంబంధించి ప్రతీ క్లాస్ ఆడియో, వీడియో రికార్డింగ్ జరుగుతుంది. దీనిపై తరచూ సమీక్ష జరిపి వారి లోటుపాట్లను సరిదిద్దే వ్యవస్థనూ ఏర్పాటు చేశాం. వీటన్నింటికీ అదనంగా బయటి సంస్థల నిపుణులు మా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా కట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాం కూడా.

ప్ర: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు క్షీణిస్తున్నాయని అంటున్నారు. మీ దృష్టిలో దీనికి కారణాలేమిటి?
జ:
అవి మా కంటే ముందుగా ఏర్పాటైన సంస్థలు. అంటే మాకు అన్నల్లాంటి వారు. లోపాలు ఉండవచ్చుగానీ.. ఆ తప్పులు ఎంచేందుకు నాకు ఏ హక్కూ లేదు. మాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి.. ఉంటాయి కూడా. వాటిని గుర్తుంచుకుని దిద్దుకోవడం మేం చేయగలిగిన పని. అదే పని అక్కడ కూడా జరుగుతోందని అనుకుంటున్నాం.

ప్ర:విద్యావిధానం విషయంలో ఎల్‌పీయూ ప్రత్యేకత ఏమిటి?
జ:
మిగతా విద్యాసంస్థల్లో ముందు చదువు చెబు తారు. డిగ్రీ ఇస్తారు. విద్యార్థులకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఎల్‌పీయూ ప్రణాళిక దీనికి పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉద్యోగ అవకాశాల అధ్యయనం తర్వాత వాటికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతల ఆధారంగా కరికులం రూపొందిస్తాం. కోర్సు సాగినన్ని రోజులు విద్యార్థులు తమ ఇష్టాఇష్టాలకు తగిన ఉద్యోగాన్ని సంపాదించు కునేందుకు కావాల్సిన అన్ని రకాల శిక్షణకు అవకాశాలు కల్పిస్తాం. తొలి ఏడాదిలో అవకాశాల గురించి వివరిస్తే.. రెండో ఏడాది ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న మార్గాలను చెబుతాం. అవసరమైతే విద్యార్థి తన మునుపటి ఆప్షన్‌ను సరిచేసుకునేందుకూ వీలుంటుంది. ఈ ప్రణాళిక కారణంగానే ఎల్‌పీయూ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు 70-80 శాతం వరకూ ఉన్నాయి. జాగ్రఫీ డిగ్రీ చేసిన వారు కూడా మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.

ప్ర: ఎల్‌పీయూలో 200 కోర్సుల వరకూ ఉన్నాయి. వీటి ఫీజుల గురించి చెబుతారా?
జ:
సగటున ఒక్కో ఇంజనీరింగ్ విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు ఏడాదికి సగటున రూ.1.25 లక్షల వరకూ ఉంటుంది. ఈ వర్సిటీ రూటు సపరేటు అనేందుకు ఒక నిదర్శనం. హాస్టల్ ఫీజు రూ.50 వేల నుంచి మొదలవుతుంది. దేశంలోని ఏ ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజులతో పోల్చినా ఇది 20 నుంచి 40 శాతం వరకూ తక్కువ. ఎల్‌పీయూ నెస్ట్ పరీక్షలో మంచి మార్కులు సంపాదించిన వారికి స్కాలర్‌షిప్పులూ ఇస్తున్నాం.

ప్ర: ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు ఉండటం చాలా అరుదు?
జ:
నిజమే. అయితే మానవ వికాసంలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగాలు చాలా కీలకమనేది మా నమ్మకం. పైగా విద్య ఏదో ఒక అంశానికి మాత్రమే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో మేము బీఏ, బీకామ్‌లతోపాటు ఫైన్ ఆర్ట్స్ కోర్సులూ ప్రవేశపెట్టాం. పైగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సబ్జెక్టులు తెలుసుకోవడం అవసరమవుతుంది.

ప్ర: ఎల్‌పీయూలో వైద్య విద్య కోర్సు లేకపోవడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా?
జ:
కొన్నేళ్ల క్రితం ఈ కోర్సు కోసం ప్రయత్నించాం. అయితే బోలెడన్ని అనుమతులు, నిబంధనలు ఉన్నాయి. పైగా అక్కడ వ్యవస్థ పనితీరు కూడా అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో మా ఆలోచన విరమించుకున్నాం. ఈ ప్రభుత్వ హయాంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా.. అవి పూర్తయ్యాక ఆలోచిస్తాం.

ప్ర: లవ్లీ మిఠాయి దుకాణం ద్వారా మీ ప్రస్థానం మొదలైంది. విద్యారంగం వైపు మళ్లేందుకు కారణాలు?
జ:
మిఠాయిల వ్యాపారం ద్వారా ఎంతో సంపాదించాం. సమాజానికి ఎంతో కొంతతిరిగి ఇచ్చేయాలని అనుకున్నాం. ఆస్పత్రులు కట్టడం మొదలుకొని వృద్ధాశ్రమాలు, ఇతర సేవ కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాం. ప్రాథమిక స్థాయి విద్యా బోధనలో ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే బాగా రాణిస్తున్న నేపథ్యంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని భావించి ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశించాం. సమాజ అభివృద్ధికి దోహదపడే ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.
Published date : 12 Jan 2019 04:18PM

Photo Stories