Skip to main content

ఇంజనీరింగ్, సైన్స్‌లో కొత్త కోర్సులు రావాలి

విద్యార్థుల్లో నైపుణ్యాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కోవాలంటే..
ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్‌లలో కొత్త కోర్సుల రూపకల్పన అవసరమని అంటున్నారు ఇండో-అమెరికన్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియా సూల్క్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ ఆర్. విజయ్ కుమార్. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి అయిన విజయ్ కుమార్ రోబోటిక్స్ రీసెర్చ్‌లో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఎస్ అండ్ టీ కార్యాలయంలో రోబోటిక్స్ అండ్ ఫిజికల్ సిస్టమ్స్ విభాగం అసిస్టెంట్ డెరైక్టర్‌గానూ విధులు నిర్వర్తించారు. వర్సిటీకి డీన్‌గా నియమితులైన నేపథ్యంలో ప్రొఫెసర్ ఆర్.విజయ్ కుమార్‌తో గెస్ట్ కాలమ్..

యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియాలో ఇంజనీరింగ్ డీన్‌గా ఎంపిక కావడం ఆనందాన్ని కలిగిస్తోంది. అదే సమయంలో కొత్త హోదా బాధ్యతలను మరింత పెంచుతుంది. క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని మరింత మెరుగుపరచడం నా తక్షణ లక్ష్యం. ఫ్యాకల్టీ సంఖ్యను, రీసెర్చ్ కార్యకలాపాలను పెంచడం, ఎక్కువ మంది విద్యార్థులను టెక్నాలజీవైపు ఆకర్షితులను చేయడం నేను నిర్దేశించుకున్న లక్ష్యాలు.

ఎస్ అండ్ టీదే కీలక పాత్ర
ప్రస్తుతం అన్ని రంగాలు ప్రగతి బాటలో నడుస్తున్నాయి. కానీ వీటన్నిటిలో కాస్త ఎక్కువ ప్రాధాన్యత గల రంగం సైన్స్ అండ్ టెక్నాలజీ. సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో టెక్నాలజీ ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి. హెల్త్‌కేర్ మొదలు అన్ని రంగాల్లో ఇప్పుడు టెక్నాలజీ తప్పనిసరిగా మారడమే దీనికి కారణం. సుస్థిర అభివృద్ధి, ఆయా రంగాల పురోభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర కీలకమైంది.

ఐఐటీలను మరింతగా తీర్చిదిద్దాలి
భారతదేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లు ముఖ్యంగా ఐఐటీలను పోటీ ప్రపంచానికి అనుగుణంగా మరింతగా తీర్చిదిద్ది నిర్వహణ పరంగా మార్పులు తేవాలి. ఐఐటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యైన ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలి. ఫ్యాకల్టీ రీసెర్చ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, అందుకు తగిన సదుపాయాలు కల్పించడం ద్వారా ఐఐటీలను బలోపేతం చేయొచ్చు. ఇతర దేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో 70 నుంచి 75 శాతం మంది ఫ్యాకల్టీ.. వ్యక్తిగత రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేస్తూ తమ విద్యార్థులను భాగస్వాములను చేస్తారు. ఐఐటీల్లోనూ ఇలాంటి వాతావరణాన్ని కల్పిస్తే నాణ్యమైన ఫ్యాకల్టీతో పాటు విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ నైపుణ్యాలు లభిస్తాయి. విద్యార్థులకు రీసెర్చ్‌పై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో సామాజిక అభివృద్ధి పరంగా ఎన్నో సత్ఫలితాలను అందిస్తుంది.

పరిస్థితులకు అనుగుణంగా కోర్సులు
ఇటీవల భారత ప్రభుత్వం దేశంలోని విద్యార్థులకు విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లలోని ఫ్యాకల్టీతో లెక్చర్స్ అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ అంశాలపై అవగాహనతోపాటు విస్తృత పరిజ్ఞానం లభిస్తుంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుకు, అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనేందుకు ఇంజనీరింగ్, సైన్‌‌స రంగాల్లో కొత్త కోర్సుల రూపకల్పన వల్ల సామాజిక అవసరాలు కూడా తీరతాయి. ఇందుకు రోబోటిక్స్ మంచి ఉదాహరణ. ఒకప్పుడు దీని గురించి ఆలోచించడానికి కూడా వెనుకాడే పరిస్థితులు ఉండేవి. నేడు పరిశోధనలు, ఆవిష్కరణల ఫలితంగా ఒక కోర్సుగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి సామాజికంగా అనేక రంగాల్లో మమేకం అయింది. ఇలా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన జరగాలి.

భవిష్యత్తు దృష్టితో బోధన
విద్యార్థుల్లో నైపుణ్యాల పరంగా ఫ్యాకల్టీ దృక్పథంలో కూడా మార్పు రావాలి. భవిష్యత్తు సవాళ్లను అంచనా వేసి వాటిని ఎదుర్కొనే సామర్థ్యం అందించే విధంగా బోధన సాగాలి. ఇందుకోసం అధ్యాపకులు కూడా నిరంతరం తాజా పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. వారు కూడా నిత్య విద్యార్థుల్లా కొత్త అంశాల అన్వేషణ సాగించాలి.

విద్యార్థుల దృక్పథం మారాలి
ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు అవసరమని ఇప్పుడు అకడమిక్ నిపుణులందరూ చెబుతున్న మాట వాస్తవమే. కానీ విద్యార్థుల్లో వీటిని అందిపుచ్చుకునే ఆసక్తి, దృక్పథంలో మార్పు వస్తేనే ఎలాంటి ప్రయోగాలైనా సత్ఫలితాలనిస్తాయి. విద్యార్థులు తమ ఆసక్తి మేరకు కోర్ సబ్జెక్ట్స్‌తోపాటు ఇతర కోర్సులు ఎంచుకునే ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అవకాశం లభిస్తుంది.

అందిపుచ్చుకునే బాధ్యత విద్యార్థులదే
నేటి పరిస్థితుల్లో ఏ రంగంలోనైనా అవకాశాలకు కొదవ లేదు. కానీ వాటిని అందిపుచ్చుకునే విధంగా తమను తాము మలచుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే. క్లాస్ రూం టీచింగ్, ఫ్యాకల్టీ పర్యవేక్షణ కొంత మేరకే ఉంటాయి. స్వీయ అభ్యసనం, విస్తృత ఆలోచన పరిధిని పెంపొందించుకోవాలి. అలా చేసిన వారే తాము అడుగుపెట్టిన రంగంలో నిలదొక్కుకోగలరు!!
Published date : 21 Apr 2015 02:24PM

Photo Stories