Skip to main content

దృక్పథం మార్పుతో ఉజ్వల భవిష్యత్తు: జయశ్రీ సురేశ్

ప్రొఫెషనల్ కోర్సుల బోధనలో విద్యార్థులను భాగస్వాములను చేస్తేనే విద్యకు సార్ధకత లభిస్తుందని ఆసియా బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ అవార్డును అందుకున్న జయశ్రీ సురేశ్ తెలిపారు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో డీన్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్న జయశ్రీ.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రొఫెసర్‌గా నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన జయశ్రీ సురేశ్‌తో ఈ వారం గెస్ట్ కాలం...
ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు వాస్తవ పరిస్థితుల నుంచి అనుభవాలను పొందేలా వ్యవహరించాలి. ఈ విషయంలో అధ్యాపకుల పాత్ర కీలకమైంది. సిలబస్‌కే పరిమితం కాకుండా పాఠ్యాంశంలోని విషయాలను వాస్తవ పరిస్థితులకు అన్వయిస్తూ బోధించాలి. అప్పుడే విద్యార్థులకు పూర్తి అవగాహనతోపాటు చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ విధానం ద్వారా లబ్ధి చేకూరుతుంది.

కేస్ స్టడీలే కీలకం:
వాస్తవ పరిస్థితులను అన్వయిస్తూ బోధించేందుకు కేస్ స్టడీలు ఉపయోగపడతాయి. ఒక పాఠంలోని అంశానికి, వాస్తవ పరిస్థితులను అన్వయించుకుంటూ ఒక కేస్ స్టడీని రాయమని అడగడం ద్వారా అనుభవాన్ని గడిస్తారు. రియల్ కేస్ స్టడీస్‌తో పోల్చి చూస్తే విద్యార్థులు తాము ఏ అంశాల్లో మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉందో అవగాహనకు వస్తుంది. దీంతో వారి ప్రతిభకు సానపట్టినట్లు అవుతుంది.

డిజిటల్‌తో కొరతకు చెక్:
విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర ఫ్యాకల్టీదే. అయితే ఐఐఎంల నుంచి సాధారణ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ల వరకు ఫ్యాకల్టీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఐసీటీ విధానాల ద్వారా ఫ్యాకల్టీ కొరతను కొంత నివారించవచ్చు. ఆన్‌లైన్ లెక్చర్లు, మూక్స్, వర్చువల్ క్లాస్‌రూం వంటి వాటితో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో విద్యార్థులకు నాణ్యత కలిగిన బోధన లభిస్తుంది. ఐసీటీ వంటి మౌలిక వసతులు కల్పించి ఆన్‌లైన్ లెక్చర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఫ్యాకల్టీ కొరతను తగ్గిస్తూ, విద్యార్థుల్లోని నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు.

అవగాహన పెరగాలి:
ఇటీవల కాలంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన పెరుగుతోంది. అకడమిక్ స్థాయిలోనూ ఈ మేరకు కోర్సుల రూపకల్పన జరుగుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే మన సామాజిక, ఆర్థిక అంశాల వల్ల అధిక శాతం చిన్న, మధ్య తరహా సంస్థలకే పరిమితం అవుతోంది. ఎక్కువ శాతం మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఉన్న అవకాశాలపై అవగాహన, సమాచారం సరిగా లేదు. దీనికి క్లాస్ రూం స్థాయి నుంచే పరిష్కారం కనుక్కోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి, వారి ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి ఫ్యాకల్టీ కృషి చేయాలి.

విస్తృత ప్రచారం కల్పించాలి:
దేశంలో విద్యారంగంలో లింగవివక్షను తగ్గించేలా చేపడుతున్న చర్యలు ఆహ్వానించదగినవి. ఐఐఎంలు, ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెంచేలా జండర్ డైవర్సిటీకి ఎంపిక ప్రక్రియలో అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడం హర్షణీయం. వీటి వల్ల సత్వరమే ఫలితాలు కనిపించకపోయినా భవిష్యత్తులో లక్ష్యం తప్పక నెరవేరుతుంది. రీసెర్చ్ వైపు ప్రోత్సహించేలా డీఎస్‌టీ, ఇతర ఆర్ అండ్ డీ విభాగాలు మహిళల కోసం రూపొందిస్తున్న పథకాలు ప్రయోజనం చేకూర్చేవే. కార్పొరేట్ సంస్థల్లో మహిళలకు ప్రాముఖ్యాన్ని పెంచేలా డెరైక్టర్ల బోర్డులో స్త్రీ తప్పనిసరి అనే నిబంధన ద్వారా అన్ని రంగాల్లో వారు దూసుకెళ్లేందుకు ఉపకరిస్తుంది. అయితే ఈ విధానాలు రూపొందించడం వరకే పరిమితం కాకుండా వీటికి విస్తృత ప్రచారం కల్పిస్తేనే ఫలితాలు లభిస్తాయి.

తల్లిదండ్రులూ మారాలి:
ఆడపిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రుల దృక్పథం మారాలి. దేశంలో ఇప్పటికీ ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకు అనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల్లో ఈ ఆలోచనలు అధికం. ఇలాంటి వారిని బ్లాక్ స్థాయిలోనే ప్రభుత్వ వర్గాలు లేదా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి.

రియల్ టైం లెర్నింగ్‌కు ప్రాధాన్యం:
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో కొత్తగా అడుగుపెట్టే విద్యార్థులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఏదో ఒక పీజీ కోసం ఎంబీఏలో చేరకుండా తమదైన రంగాన్ని దృష్టిలో ఉంచుకొని చేరాలి. ఇలా ఉంటేనే వారికి అనుభవం వస్తుంది. వీలైనన్ని కేస్ స్టడీస్‌ను అధ్యయనం చేయడం ద్వారా రియల్ టైం లెర్నింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే గమ్యం దిశగా సరైన అడుగులు పడతాయి.
Published date : 29 Aug 2016 05:56PM

Photo Stories