Skip to main content

ఐఐటీల్లో ఒత్తిడి అనేది అపోహ మాత్రమే...

దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రవేశ ప్రక్రియ మొదలైంది. త్వరలో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానుంది. ఇప్పటివరకు ఐఐటీల్లో ప్రవేశానికి అవసరమైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు కోసం అహర్నిశలు కృషి చేసి.. లక్ష్యం చేరుకున్న విద్యార్థులు.. అసలైన కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో కొంత మానసిక ఆందోళన, మరికొంత బిడియం సహజం. అలాంటి వాటిని దూరం చేసుకోవాలని.. అందుకు ఐఐటీలు కూడా చక్కటి వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొంటున్నారు ఐఐటీ-చెన్నై డెరైక్టర్, భాస్కర్ రామమూర్తి. ఐఐటీ-చెన్నైలో 1980లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన.. రామమూర్తి తాను చదివిన ఇన్‌స్టిట్యూట్‌కే డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. నేటి ఇంజనీరింగ్ విద్యా విధానం.. ఐఐటీల్లో కొత్తగా అడుగుపెట్టనున్న విద్యార్థులకు సలహాలు.. ఐఐటీలు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ముందంజలో నిలవడానికి చేపట్టాల్సిన చర్యలు.. తదితర అంశాలపై ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ...

ఐఐటీల్లో కొత్త విద్యార్థులు ఇబ్బందిగా భావించే అంశాలేవి?
ఐఐటీల్లో అడుగుపెట్టే విద్యార్థుల విషయంలో ప్రధాన సమస్య.. మానసిక ఆందోళన. ఐఐటీల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో.. సీనియర్లు, ఇతర సహచరులు ఎలా ఉంటారో అనే సందేహాలతో బిడియంగా ఉంటారు. కానీ.. బయట అనుకుంటున్నట్లు ఐఐటీల్లో ఎలాంటి ఒత్తిడి ఉండదు. పైగా.. విభిన్న పరిస్థితులు, అకడెమిక్ నేపథ్యాల నుంచి వచ్చిన కొత్త విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

కొత్త విద్యార్థుల విషయంలో ఐఐటీలకు ఎదురవుతున్న సవాళ్లు?
ఐఐటీల్లో జేఈఈ అడ్వాన్‌‌సడ్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉంటుంది. దాంతో విద్యార్థులు తాము పొందిన ర్యాంకుకు సీటు లభించిన బ్రాంచ్‌లో అడుగుపెడతారు. వాస్తవానికి వారి అభిరుచి గల బ్రాంచ్ వేరే ఉంటుంది. ఈ పరిస్థితిలో ఏ బ్రాంచ్‌లో చేరిన విద్యార్థినైనా.. సదరు బ్రాంచ్‌కు సరితూగేలా తీర్చిదిద్దడమే ఐఐటీలకు ఎదురవుతున్న ప్రధాన సమస్య. అందుకే.. ప్రతి ఐఐటీ మొదటి ఏడాది అకడెమిక్స్‌తోపాటు ఇలాంటి అంశాలపైనా ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఫలితంగా నాలుగేళ్ల వ్యవధిలో ఎలాంటి ఆందోళన లేకుండా విద్యార్థి కోర్సును పూర్తిచేసుకునే అవకాశం ఏర్పడుతుంది.

నేటి మన ఇంజనీరింగ్ విద్యా విధానంపై మీ అభిప్రాయం?
నేటి ఇంజనీరింగ్ విద్యలో అధిక శాతం ఐటీ రంగం లక్ష్యంగా ఉండటం బాధాకరం. ఈ కారణంగా డొమైన్ నాలెడ్జ్, కోర్ స్కిల్స్‌కు తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. చాలామంది ఐటీ రంగంలో కెరీర్‌నే ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇది ఇన్‌స్టిట్యూట్‌లకు బోధనపరంగా కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఒకే తరగతిలో ఐటీ, నాన్-ఐటీ లక్ష్యంగా రెండు రకాల విద్యార్థులుంటున్నారు. దాంతో భవిష్యత్తులో కోర్ ఇండస్ట్రీస్‌లో రాణించాలనుకునే విద్యార్థులను గుర్తించి నైపుణ్యాలు అందించడం కష్టంగా మారుతోంది.

బోధనపరంగా ఐఐటీ - చెన్నై ఎలాంటి విధానాలు అవలంబిస్తోంది?
ప్రాథమిక అంశాలపై పట్టు, ఆసక్తి ఉంటే.. భవిష్యత్తులో అవి ఎన్నో ఆవిష్కరణలకు మార్గం చూపుతాయి. అందుకే ప్రతి సబ్జెక్ట్‌లోనూ విద్యార్థి సొంత ఆలోచనలను వెలికితీసేలా బేసిక్స్ బోధనకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం. అన్ని కాన్సెప్ట్స్‌ను తాజా పరిణామాల కు అన్వయించేలా అప్లైడ్ టీచింగ్ మెథడాలజీని అమలు చేస్తున్నాం. మా లక్ష్యం ఒకటే.. భవిష్యత్తులో ఉద్యోగం, పరిశోధన, ఉపాధి.. ఇలా ఏదైనా సొంతంగా ఆలోచించేలా చేయడమే! ఇందుకోసం నిరంతరం కరిక్యులంలో మార్పులు చేస్తున్నాం. క్రమం తప్పకుండా ఇంటర్‌డిసిప్లినరీ కోర్సులకు రూపకల్పన చేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో పరిశోధనల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం.

ఇంజనీరింగ్‌లో ఇంటర్‌డిసిప్లినరీ కోర్సుల ఆవశ్యకత ఉందా?
కచ్చితంగా ఉంది! నేడు మన ముందు ఆవిష్కృతమవుతున్న ఉత్పత్తులు.. మెటీరియల్ సైన్స్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్.. ఇలా ఎన్నో విభాగాల సమష్టి కృషితో సాధ్యమవుతున్నవే. కాబట్టి విద్యార్థులకు ఒక ప్రొడక్ట్ ఆవిష్కరణ వెనుక సమ్మిళితమైన వివిధ విభాగాల గురించి తెలియాలి. లేకుంటే.. విద్యార్థులు కొత్త ఆలోచనలు, కొత్త సాంకేతిక అంశాలపై పరిజ్ఞానాన్ని పొందలేరు. అదేవిధంగా హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ గురించి కూడా తెలిసుండాలి. ఇంజనీరింగ్ ఉత్పత్తులు, సేవల అంతిమ లక్ష్యం సమాజ అవసరాలను తీర్చడమే. అందువల్ల ఒక నిర్దిష్ట ఉత్పత్తికి సంబంధించి లక్షిత ప్రజల అవసరాలపై అవగాహన తప్పనిసరి. అందుకే ఐఐటీలు కూడా హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులను బోధిస్తున్నాయి.

ఐఐటీల్లో ఫ్యాకల్టీ కొరత ఉందని, అది ఆర్ అండ్ డీపైనా ప్రభావం చూపుతోందంటున్నారు?
ఐఐటీల్లో ఫ్యాకల్టీ కొరత ఉన్న మాట వాస్తవం. ఐఐటీ క్యాంపస్‌ల సంఖ్య పెంచడంతో ఈ సమస్య కూడా పెరిగింది. దీనికి పరిష్కారం.. విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో మాదిరిగా ఆకర్షణీయ వేతనాలు, సదుపాయాలు కల్పించడమే! తద్వారా అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు లభిస్తారు. ప్రస్తుతం అన్ని ఐఐటీలు బీటెక్ స్థాయిలోనే రీసెర్చ్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాయి. ఐఐటీ-చెన్నై ఈ విషయంలో మరో ముందడుగు వేసింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తోంది.

ఐఐటీలు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవాలంటే?
ప్రధానంగా రెండు ప్రామాణికాలు.. అంతర్జాతీయ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్యను సర్వే మెథడాలజీ నుంచి తొలగించాలి. అలాచేస్తే ఐఐటీలు కచ్చితంగా టాప్-50కి సమీపంలో నిలవడం ఖాయం. ఇప్పటికే సబ్జెక్ట్ పరమైన ర్యాంకుల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో టాప్-50 నుంచి 70 జాబితాలో నిలుస్తున్నాయి. రీసెర్చ్ అంశాలపై మరింత దృష్టిసారిస్తే రాబోయే పదేళ్లలోపే టాప్-30లో ఉంటాయి.

ఐఐటీల్లో, ఇతర సంస్థల్లో చేరే కొత్త విద్యార్థులకు మీరిచ్చే సలహా?
ఐఐటీలు.. విద్యార్థులకు చక్కటి అధ్యయన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. కేవలం అధ్యాపకులే కాకుండా సీనియర్లు, పూర్వ విద్యార్థులు కూడా ఫ్రెషర్స్‌కు సహకరిస్తున్నారు. వీటిని అందిపుచ్చుకోవాలి. నాలుగైదేళ్ల వ్యవధిలో తమను తాము సమాజ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలి. ఐఐటీల్లో సీట్లు రాని విద్యార్థులు ఆ నిరుత్సాహాన్ని వీలైనంత త్వరగా విడనాడాలి. ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ ఉంటుంది. కానీ ఐఐటీల్లో సీట్ల పరిమితి కారణంగా అందరికీ సీటు సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. కష్టపడి చదివి అద్భుత విజయాలు సొంతం చేసుకోవాలి!!
Published date : 04 Aug 2014 11:20AM

Photo Stories