Skip to main content

Engineering: నవంబర్ నుంచే.. ఇంజనీరింగ్ క్లాసులు

రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Engineering
నవంబర్ నుంచే.. ఇంజనీరింగ్ క్లాసులు

ఇందుకు సంబంధించిన కాలపట్టికను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి అక్టోబర్‌ 25 నుంచే 2022–23 విద్యా సంవత్సరం ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పేర్కొంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవ్వలేదు. మొదటి దశ సీట్ల భర్తీ జరిగినా రెండో దశను సెప్టెంబర్‌ 27న పూర్తి చేయాలని తొలుత భావించారు. ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారంలో ఎఫ్‌ఆర్‌సీ ఎటూ తేల్చకపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను అక్టోబర్‌ 11 నుంచి మొదలు పెట్టారు. అక్టోబర్‌ 16వ తేదీన సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ దశలో కూడా మిగిలిపోయిన సీట్లకు నెలాఖ­రు­లోగా ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపట్టే వీలుందని అధి­కార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 25లోగా పూర్తి చేసి. ఆ తర్వాత కాలేజీల్లో ఐదు రోజుల పాటు పరిచయ కార్యక్రమా­లు నిర్వహించి, నవంబర్‌ 1 నుంచి బోధన చేపట్టాలని భావిస్తున్నారు. 

చదవండి: Career Opportunities in Mobile App Development... నైపుణ్యాలు, కొలువులకు మార్గాలు..

జాతీయ స్థాయిలోనూ...

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో కూడా అక్టోబర్‌ 16తో సీట్ల భర్తీ కార్యక్రమం పూర్తవుతుంది. దీంతో జాతీయ స్థాయిలో కూడా నవంబర్‌ మొదటి వారంలోనే క్లాసులు మొదలయ్యే వీలుంది. జోసా కౌన్సెలింగ్‌ తర్వాతే రాష్ట్ర ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ముగించాలని ఉన్నత విద్య మండలి రెండేళ్ళుగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. జేఈఈ ర్యాంకు ద్వారా జాతీయ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈలోగానే సీట్ల భర్తీ ముగిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాస్త ఆలస్యంగానే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు.

చదవండి: Coding and Programming Jobs: కోడింగ్‌తో కొలువులు.. నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలు..

ఇతర కోర్సులూ నవంబర్‌లోనే 

ఎంటెక్, ఎంబీఏ, బీఈడీ, న్యాయవాద కోర్సుల్లో కామన్‌ పరీక్ష ఫలితాలు ఇప్పటికే వెల్లడించారు. ఎంటెక్, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ జరుగుతోంది. ఇది మరో పది రోజుల్లో ముగిసే వీలుంది. బీఈడీ సీట్ల భర్తీ కూడా త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాసెట్‌ ముగిసినప్పటికీ నేషనల్‌ బార్‌ కౌన్సిల్‌ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కారణంగా లాసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో జాప్యం ఉండొచ్చని భావిస్తున్నారు. దోస్త్‌ ద్వారా డిగ్రీ సీట్ల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లక్షన్నర మంది డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ తర్వాత మరో 50 వేల మంది డిగ్రీ కోర్సుల్లో చేరే వీలుందని భావిస్తున్నారు. మొత్తం మీద నవంబర్‌ మొదటి వారంలో ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కోర్సులు మొదలయ్యే అవకాశం ఉంది.

చదవండి: Social Sector Jobs: కార్పొరేట్‌ జాబ్స్‌ వదిలి.. సోషల్‌ సెక్టార్‌ వైపు అడుగులు వేస్తున్న యువత!

త్వరలో షెడ్యూల్‌ 

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బోధనకు సంబంధించిన కాలపట్టికను త్వరలోనే విడుదల చేస్తాం. ఇప్పటికే దీనిపై ఉన్నత 
స్థాయి సమీక్ష నిర్వహించాం. జోసా కౌన్సెలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ చేపడుతున్నాం. 
– ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి 

Published date : 12 Oct 2022 01:42PM

Photo Stories