Skip to main content

JNTUK: అగ్రస్థానంలో జేఎన్‌టీయూకే

Top JNTUK Affiliated Engineering Colleges In India

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సాంకేతిక వర్సిటీల్లో జేఎన్‌టీయూకే అగ్రస్థానంలో నిలుస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. జేఎన్‌టీయూకేలో బుధవారం ఉదయం వర్సిటీ 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేయగా ఉప కులపతి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముందుగా వర్సిటీ తొలి వీసీ డాక్టర్‌ అల్లం అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని సాంకేతిక విద్యకు జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూఏ విశ్వవిద్యాలయాలు మూలస్తంభాలుగా నిలుస్తున్నాయన్నారు. ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యారంగం, పరిశ్రమల మధ్య అంతరాన్ని పూరించాలని అనుబంధ కళాశాలల యాజమాన్యాలకు అధ్యాపకులకు పిలుపునిచ్చారు. విద్యార్థికి అవసరమైన సమాచారం ఎక్కడి నుంచైనా అందిపుచ్చుకునే సాంకేతికత అందుబాటులో ఉన్న నేపథ్యంలో అన్ని వనరులను వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణల ద్వారా విద్యార్థులు ఉన్నతమైన విద్యనభ్యసించి ఆత్మవిశ్వాసంతో సమాజంలోకి రావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అన్నారు. విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించవచ్చునని, తద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. అధ్యాపకులు మరిన్ని పరిశోధనలు చేపట్టేలా వారిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదట న్యాక్‌ ఏప్లస్‌ గ్రేడ్‌ సాధించిన జేఎన్‌టీయూకే అధికారులను, అధ్యాపకులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

చదవండి: JNTU Anantapur Results 2023: బీటెక్‌, బీ–ఫార్మసీ ఫలితాల విడుదల

ఆరు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి
ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహకారంతో విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. విశ్వవిద్యాలయంలో చేపట్టిన రహదారులు, డ్రైన్ల నిర్మాణం, స్నాతకోత్సవ భవనం, వసతి గృహాలు తదితర నిర్మాణాలు మరో ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనుబంధ కళాశాలలు ఎంత బాగుంటే యూనివర్శిటీ కూడా అంతే అభివృద్ధి బాటలో పయనిస్తుందని, కళాశాలలు మెరుగైన న్యాక్‌ గ్రేడ్‌ సాధించాలని సూచించారు. సంకురాత్రి ఫౌండేషన్‌ సహకారంతో వివిధ అంశాలలో సమాజ సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఖేలో ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా జేఎన్‌టీయూకే స్టేడియంలో సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, దీనికి కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ ఎంతగానో కృషి చేశారన్నారు.
వర్సిటీ పూర్వ విద్యార్థి తూర్పుగోదావరి జిల్లా సబ్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఆలస్యం చేయకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సివిల్స్‌, గేట్‌/క్యాట్‌/జీఆర్‌ తదితర పోటీ పరీక్షల ద్వారా లభించే అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించాలన్నారు. మాజీ ఉపకులపతులు వీఎస్‌ఎస్‌ కుమార్‌, ఎం.రామలింగరాజు, ఆదికవి నన్నయ యూనివర్శిటీ ఉపకులపతి కె.పద్మరాజు యూనివర్శిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
అనంతరం జేఎన్‌టీయూకే పూర్వ విద్యార్థి, తూర్పుగోదావరి జిల్లా సబ్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డికి యంగ్‌ అచీవర్‌ అవార్డును అందజేయగా న్యాక్‌ ఏప్లస్‌ప్లస్‌, ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించిన కళాశాలలకు గేట్‌/క్యాట్‌ పరీక్షలలోను, క్రీడా విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం చలమలశెట్టి సునీల్‌ ఫౌండేషన్‌ సహకారంతో రూ.5 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో చేపడుతున్న వర్సిటీ ప్రాంగణ సుందరీకరణ కార్యక్రమాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి మొక్కలను నాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Published date : 24 Aug 2023 03:06PM

Photo Stories