ఫీజుల పెంపునకు సర్కార్ నో!
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (TFRC) చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ ఏడాది కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఫీజులనే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఆగష్టు 1న ఎఫ్‌ఆర్‌సీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎఫ్‌ఆర్‌సీ ప్రతి మూడేళ్ళకోసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపును సమీక్షిస్తుంది. ఈ విధంగా 2019లో పెరిగిన ఫీజులు 2022 వరకు అమల్లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి గత మూడు నెలలుగా కసరత్తు చేస్తోంది.
చదవండి: ‘ఏఎఫ్‌ఆర్‌సీ’ సిఫార్సుల ప్రకారం ఫీజులు అమలు చేయాలి
ఎఫ్‌ఆర్‌సీ పెంపు ప్రతిపాదించినా..
కాలేజీల యాజమాన్యాలు సమర్పించిన జమాఖర్చులు మదింపు చేసింది. వారితో చర్చలూ జరిపింది. చివరకు కని ష్ట వార్షిక ఫీజును రూ. 45 వేలుగా, గరిష్ట ఫీజును రూ.1.73 లక్షలుగా నిర్ణయించింది. ఈ మేరకు ఏ కాలేజీకి ఎంత ఫీజు పెంచాలనే ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపింది. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం ఫీజుల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై ఆగష్టు 2న ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు తెలిపాయి.
చదవండి: ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్ స్వరూప్‌రెడ్డి
వ్యతిరేకతే కారణమా?
కరోనా వల్ల గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యా సంస్థలు సరిగా నడవలేదు. ఈ సమయంలో ఫీజుల పెంపు సరికాదంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మెడికల్ కాలేజీల ఫీజులు కూడా 2022లో పెంచలేదన్న విషయం చర్చకు వచ్చింది. అలాగే 2023 ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఫీజుల పెంపుతో ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావించినట్టు తెలిసింది.