‘ఏఎఫ్‌ఆర్‌సీ’ సిఫార్సుల ప్రకారం ఫీజులు అమలు చేయాలి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మా తదితర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) ప్రతిపాదించిన సిఫార్సుల మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజులు అమలు చేయాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం (ఏపీపీఈసీఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
ఈ సిఫార్సులపై త్వరితంగా నిర్ణయం తీసుకుని వెంటనే ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని పేర్కొంది. జూలై 19నవిజయవాడలోని అపెక్మా కార్యాలయంలో సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఏఎఫ్‌ఆర్‌సీ స్థానంలో కొత్తగా మరో కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నామని, ఆ కమిషన్ నిర్ణయాల మేరకు ఫీజులు అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారని తెలిపారు. కొత్త కమిషన్ ఏర్పాటు కావడానికి, అనంతరం దాదాపు వేయి కాలేజీలకు సంబంధించిన ఫీజులు నిర్ణయించడానికి దాదాపు ఏడెనిమిది నెలల సమయం పడుతుందన్నారు. అంతకాలం ప్రవేశాలు నిలిపేందుకు అవకాశం లేదు కనుక ముందుగా ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకు ఫీజులు అమలు చేసి ప్రవేశాలను పూర్తి చేయాలని కోరారు. కొత్త కమిషన్ ఏర్పాటు తరువాత ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులపై పరిశీలన జరిపి కొత్త ఫీజులను నిర్ణయించాలని, వాటిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయవచ్చని సూచించారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సమస్య తలెత్తకుండా ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సులు అమలు చేయాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు.
Published date : 20 Jul 2019 04:32PM