తగ్గాల్సిందే... తగ్గేదేలే.. ఎఫ్‌ఆర్‌సీ ఎదుట 20 కాలేజీల వాదన
తాము నిర్ణయించిన ఫీజులను ఆమోదించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఆడిట్ రిపోర్టుల ఆధారంగా తాము ప్రతిపాదించిన ఫీజులే అమలు చేయాలని కాలేజీలు పట్టుబట్టాయి. చర్చల అనంతరం ఆరు కాలేజీల యాజమాన్యాలు దిగి వచ్చాయి. మిగతా కాలేజీలు మాత్రం ఎఫ్‌ఆర్‌సీతో ఏకీభవించలేదు. కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. చివరిసారి చర్చలు ముగిసిన నేపథ్యంలో నిర్ణయించిన ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌సీ భావిస్తోంది. 2019లో పెంచిన ఇంజనీరింగ్ ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సవరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జూలైలో ఎఫ్‌ఆర్‌సీ ఆడిట్ రిపోర్టులను పరిశీలించి, కాలేజీ వారీగా ఫీజులు నిర్ణయించింది. దీనిపై 81 కాలేజీలు కోర్టుకెళ్లడంతో గత నెల మరోసారి ఆడిట్ నివేదికలు పరిశీలించి, లెక్కల్లో తేడా ఉన్నాయని గుర్తించారు. దీంతో జూలైలో నిర్ణయించిన ఫీజులను తగ్గించింది. ఈ వ్యవహారంపై 20 కాలేజీలు తమకు మరోసారి చర్చించే అవకాశం ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌సీని కోరాయి.
చదవండి: Good News: పాత ఫీజులే కొనసాగించాలని టీఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదన.. మంత్రి ఆమోదం
భారీగా తగ్గిన రెండు కాలేజీల ఫీజులు..
ఎఫ్‌ఆర్‌సీ ఎదుట చర్చలకు వచ్చిన కాలేజీల్లో కేవలం రెండు కాలేజీల వ్యవహారంలోనే వివాదం ఎక్కువగా కన్పిస్తోంది. సీబీఐటీ పాత ఫీజు రూ. 1.34 లక్షలు ఉంది. రెండో దఫా ఆడిట్ రిపోర్టు పరిశీలన తర్వాత రూ. 1,12,000కు తగ్గింది. నారాయణమ్మ కాలేజీ పాత ఫీజును రూ.1,22,000 ఉంటే, రెండోసారి పరిశీలన తర్వాత రూ. 70 వేలకు కుదించారు. ఈ రెండు కాలేజీలు ఫీజుల నిర్ధారణపై ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. మిగతా 18 కాలేజీలు అవి ప్రతిపాదించిన ఫీజులను ఎఫ్‌ఆర్‌సీ ఆమోదించకపోయినా, పాత ఫీజు కన్నా కొంత పెరిగాయి. అనురాగ్ యూనివర్సిటీ రూ. 1.25 లక్షలు ఉంటే, రూ. 1.75 లక్షలకు పెంచాలని కోరింది. ఎఫ్‌ఆర్‌సీ రూ. 1.35 లక్షలకు ఒప్పుకుంది.
చదవండి: ఇక ఇంజనీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా పేరుతో యాజమాన్యాలు వసూలు చేస్తున్న అధికఫీజుకు చెక్: ఎలాగంటే..
కోరిన దానికన్నా ఎక్కువ పెంచారు
హైదరాబాద్ కొత్త బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీ పాత ఫీజు రూ. 60 వేలుంది. తమ ఫీజు రూ. 95 వేలకు పెంచాలని ఆ కాలేజీ కోరగా రూ.1.15 లక్షలకు ఎఫ్‌ఆర్‌సీ అంగీకరించింది. కాలేజీ కోరిన దానికన్నా రూ. 20 వేలు ఎక్కువ ఫీజు నిర్ణయించడంలో ఔచిత్యమేంటనే విమర్శలు వస్తున్నాయి. ఫీజు పెరిగినా మొదటిసారి పెంచిన ఫీజునే అమలు చేయాలని ఈ కాలేజీ కూడా ఇప్పుడు పట్టుబడుతోంది.
చదవండి: నాలుగున్నరేళ్ల కోర్సు.. 5 ఏళ్లకు ఫీజా?: హైకోర్టు
ఫీజుల వ్యవహారంపై విచారణ జరపాలి
కాలేజీల ఫీజుల పెంపులో పేర్కొన్న వాస్తవాలపై పూర్తి విచారణ జరపాలి. పదే పదే చర్చల కంటే, వాళ్లు ఇచ్చిన నివేదికని ఆయా శాఖ అధికారులతో, ప్రత్యేకంగా ఐటీ శాఖ అధికారులతో పరిశీలన చేపట్టాలి. అప్పుడు అనేక వాస్తవాలు బయటకొస్తాయి.
– అయినేని సంతోష్‌కుమార్ (సాంకేతిక విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)