నాలుగున్నరేళ్ల కోర్సు.. 5 ఏళ్లకు ఫీజా?: హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మెడికల్ ఫీజులు వసూలు చేసే విధాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఇష్టానుసారంగా ఫీజు వసూళ్లు చేయడానికి వీల్లేదని, మెడికల్ కోర్సుల కాలానికి తగ్గట్టుగానే ఫీజులు ఉండాలని తేల్చి చెప్పింది. ఫీజుల విషయం లో తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కాలేజీ యాజమాన్యాలకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. మెడికల్ (ఎంబీబీఎస్) కోర్సు నాలుగున్నరేళ్లరుుతే ఐదేళ్లకు ఫీజులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించింది. 2019-20 విద్యా ఏడాదిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్టులకు ఏ,బీ,సీ కేటగిరీలకు సింగిల్‌విండో విధానంలో దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల వసూళ్లు, నాలుగున్నరేళ్ల కోర్సుకు ఐదేళ్లు ఫీజు వసూలుకు వీలుగా ప్రభుత్వం జీవో నం.120, ఏపీ ప్రభుత్వం జీవో నం.30లను జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ వరంగల్‌కు చెందిన మైనర్ డి.పద్మతేజ 2018లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టంలోని 7(1) నిబంధనల్లో మెడికల్ కోర్సుల కాలపరిమితి నాలుగున్నరేళ్లని ఉన్నా టీఏఎఫ్‌ఆర్‌సీ పట్టించుకోకుండా ఐదేళ్లకు ఫీజుల వసూళ్లకు అనుమతించడం చెల్లదని పేర్కొంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో వరకే తీర్పు వెలువరిస్తున్నామని, ఏపీ ప్రభుత్వ జీవో చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెడికల్ విద్యార్థి కాని పిటిషనర్ పద్మతేజకు రిట్ దాఖలు చేసే అర్హత లేదని టీఏఎఫ్‌ఆర్‌సీ చేసిన వాదనలో పస లేదని పేర్కొంది. విద్యార్థులకు నష్టం చేకూర్చే విషయాన్ని టీఏఎఫ్‌ఆర్‌సీ పట్టించుకోలేదని తప్పుపట్టింది. ఫీజుల నిర్ణయం చేసేప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సంఘాలను ప్రభుత్వం/టీఏఎఫ్‌ఆర్‌సీలు పట్టించుకోలేదని ఆక్షేపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన విధంగానే ఐదేళ్లకు ఫీజులు వసూలు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ వాదన చట్ట వ్యతిరేకమని వెల్లడించింది. మెడికల్ కోర్సు నాలుగున్నరేళ్లకే ఫీజు వసూలు చేయాలని ఆదేశించింది. నాలుగున్నరేళ్లకే ఫీజు వసూలు చేయాలని 2017లో ఇచ్చిన జీవో నం.120 ప్రకారమే ఫీజుల వసూళ్లు ఉండాలని, అరుుతే రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీ యాజమాన్యాల సంఘంలోని కాలేజీలు ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తే ఏపీ విద్యా సంస్థల చట్టం కింద చర్యలు తీసుకోవచ్చునని స్పష్టం చేసింది.
Published date : 11 Jan 2020 02:49PM