Skip to main content

AICTE: కొత్త కాలేజీల ఏర్పాటుపై నిషేధం ఎత్తేసిన ఏఐసీటీఈ.. తాజా నిబంధనలు ఇవీ..

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఇంజనీరింగ్‌ కాలేజీల ఏర్పాటు ఇక సులభతరం కాబోతోంది. అఖిల భారత సాంకేతిక విద్య మండలి(ఏఐసీటీఈ) నిబంధనలను సరళతరం చేసింది.
AICTE
కొత్త కాలేజీల ఏర్పాటుపై నిషేధం ఎత్తేసిన ఏఐసీటీఈ.. తాజా నిబంధనలు ఇవీ..

2023–24 విద్యాసంవత్సరం నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొంది. గత మూడేళ్లుగా కాలేజీల ఏర్పాటుపై ఉన్న నిషేధాన్ని ఏఐసీటీఈ ఎత్తేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం సాంకేతికవిద్య కోర్సులుండే కాలేజీల ఏర్పాటుకు ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐసీటీఈకి దరఖాస్తు చేయడం తప్పనిసరి. ఈ నిబంధనలు కొత్త కాలేజీల ఏర్పాటుకు ఇబ్బందిగా ఉన్నాయని ఏఐసీటీఈ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దీంతో అన్నిరాష్ట్రాల అభిప్రాయం తీసుకున్న మండలి కఠిననిబంధనలను తొలగించింది.

చదవండి: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ కాలేజీలు, కోర్సుల పరిస్థితి ఇదీ..

కొత్త కాలేజీల ఏర్పాటు చేయాలనుకునేవాళ్ల కోసం నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌ అనే పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ కాలేజీల అనుమతి కోసం సరికొత్త విధివిధానాలు విడుదల చేసింది. బీటెక్, పాలిటెక్నిక్‌ కోర్సులను ఒకే కాలేజీ, ఒకే క్యాంపస్‌లో నిర్వహించే అవకాశం కల్పించారు. తేలికగా కాలేజీల నిర్వహణ, పాలనాపరమైన సౌలభ్యం ఉండేలా ప్రైవేటు వర్సిటీలు, కాలేజీలను ప్రోత్సహించేలా నిబంధనలు రూపొందించింది.   

చదవండి: OU: ఇంజనీరింగ్‌ కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు

తాజా నిబంధనలు ఇవీ... 

  • బీటెక్‌ కాలేజీల్లో ప్రతీ ఆరుగురికి కంప్యూటర్‌ విధిగా ఉండాలనే నిబంధన ఎత్తేసి, దాని స్థానంలో ప్రతీ పది మందికి కంప్యూటర్‌ ఉంటే చాలని ఏఐసీటీఈ పేర్కొంది. పాలిటెక్నిక్‌ కాలేజీలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.  
  • ఇప్పటివరకూ గరిష్టంగా 300 సీట్లు ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని మరో 60 సీట్లకు పెంచారు. ఎంసీఏలో 180 నుంచి 300కు పెంచారు. దీనివల్ల కొత్తగా వచ్చే సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కంప్యూటర్‌ కోర్సుల్లో సీట్లు పెరుగుతాయి.
  • ఇప్పటివరకు ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ వంటి కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చేది. ఇక మీదట ఫార్మసీ కౌన్సిల్, ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌ మాత్రమే అనుమతిస్తాయి.  
  • ఏదైనా కాలేజీ విదేశీ వర్సిటీతో ఒప్పందాలు చేసుకునేప్పుడు ఉన్న నిబంధనలను స్వల్పంగా సడలించారు. ప్రపంచంలో 500 ర్యాంకులు ఉన్న వర్సిటీల తోనే ఒప్పందం చేసుకోవాలనే నిబంధన స్థానంలో వెయ్యి ర్యాంకుల వరకూ పొడిగించారు. దీనివల్ల విదేశీ వర్సిటీల భాగస్వామ్యం మరింత పెరగనుంది.

ప్రస్తుతమున్న కాలేజీల్లో కొత్త కోర్సులు

కావాలంటే 50% సీట్లు ఉండాలనే నిబంధనలను ఏఐసీటీఈ ఎత్తేసింది. దీనివల్ల ప్రతీ కాలేజీ కొత్త కోర్సులు ప్రవేశపెట్టే వీలుంది. విదేశీసంస్థలతో ఒప్పందాలు మరింత పెరు గుతాయని అధికారులు చెబుతున్నారు.

చదవండి: AICTE: ఇంజనీరింగ్‌ విద్యార్థులు గణితంలో తడబాటు

ఉన్నవే మూత... మళ్ళీ కొత్తవా? 

2015–16లో 288 కాలేజీలుంటే ప్రస్తుతం 145 కాలేజీలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీలను రాజధాని పరిసర
ప్రాంతాల్లోకి మార్చుకునేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో ఏటా కనీసం 45 శాతం కూడా సీట్లు భర్తీ కావడంలేదు. కంప్యూటర్‌ కోర్సుల వైపు విద్యార్థులు పరుగులు పెడుతుండటంతో వాటికి తగ్గట్టు వసతులు, ఫ్యాకల్టీని సమకూర్చుకోవడం కాలేజీలకు కత్తిమీద సాములా మారింది. ఈ పరిస్థితుల్లో కొత్త కాలేజీల స్థాపనకు ఎంతమంది ముందుకొస్తారన్నది సందేహమే అని నిపుణులు అంటున్నారు.

Published date : 06 May 2023 04:11PM

Photo Stories