Mechanical Engineering Careers: మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయితే.. ఆ విద్యార్ధికి అపార ఉద్యోగావకాలు ఇలా ఎన్నో..
మెకానికల్ ఇంజనీరింగ్ - నిత్య వినూత్న యాంత్రిక సాంకేతిక విద్య
నేటి యంత్ర శాస్త్ర నిష్ణాత విద్యార్థులే రేపటి వినూత్న సమన్వయ సమతుల్య
ప్రపంచానికి మార్గ నిర్దేశకులు.
ప్రకృతి తొలకరి పలకరిస్తుంది.
సమాజం కొత్త పుంతలు తొక్కుతోంది.
మానవీయ దృక్పధాలు వినూత్నంగా విస్తరిస్తున్నాయి.
సాంకేతికత ఒరవడి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది.
తొలకరి జల్లులతో మొదలవుతుంది కొత్త విద్యాసంవత్సరం. ఈ తరుణంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల మదిలో మెదులుతుంటాయి ఎన్నో సంశయాలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో సంసిద్ద సందిగ్దతలు. అందులోనూ ముఖ్యముగా ఉన్నతవిద్యకు సంబందించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ రకమైన అంశాలే ఎక్కువగా ప్రస్తావనకి వస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి.ఈ క్రమంలో కోర్ ఇంజినీరింగ్ కి సంబంధించినటువంటి, అందులోనూ ప్రముఖ భూమికను పోషించేటటువంటి మెకానికల్ ఇంజినీరింగ్ కు సంబందించినటువంటి అంశాలను తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నింటినీ నాలుగు ముఖ్యమైన అంశాలయినటువంటి కళాశాలల ఎంపిక, బోధనాంశాలు, అవకాశాలు మరియు విద్యాభ్యాసం మొదలైనటువంటి వాటి ద్వారా విశ్లేషించుకొని సరైన నిర్ణయానికి ఉపయోగపడే అవగాహనను ఏర్పర్చుకునే ప్రయత్నం చేసుకుందాం.
కళాశాల ఎంపిక:
ఉన్నతవిద్యను అభ్యసించడానికి అనువైనటువంటి, అనుకూలమైనటువంటి కళాశాల ఎంచుకోవలసి ఉంటుంది. మరి ఈ ముఖ్యమైన నిర్ణయానికి కొన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. వీటిలో ప్రముఖమైన అంశాలు - కళాశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, వనరులు, భోదన, బోధనేతర సిబ్బంది, ప్రామాణిక ప్రయోగశాలలు, ప్రముఖ సంస్థల గుర్తింపులు, అక్రిడిటేషన్లు, భోదనాపద్ధతులు, కొత్త సాంకేతిక సదుపాయాలను కల్పించడం, పరిశ్రమల అవసరాలకు అనుకూలమైనటువంటి పాఠ్యప్రణాళిక, ప్రాంగణ నియామకాలు, శిక్షణ, కౌన్సిలింగ్, ప్రొఫెషనల్ సొసైటీస్, క్లబ్స్ మొదలైనటువంటివి. వీటన్నిటి యొక్క సమాచారాన్ని ఆయా కళాశాలల యొక్క వెబ్ సైట్ ద్వారా గాని, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా గాని , కళాశాల యొక్క కార్యాలయంలో గాని, ఆచార్యులని గాని, సీనియర్ విద్యార్ధులని గాని సంప్రదించి సేకరించుకోవొచ్చు. వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించుకొని నిర్ణయం తీసుకుంటే, సరైన నాణ్యమైన కళాశాలను ఎంచుకొని, నాణ్యమైన విద్యను అభ్యసించవచ్చు. తద్వారా విద్యార్థి తను ఎంచుకున్న వృత్తిలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది.
మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లో బోధించే అంశాలు :
మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లో బోధించే అంశాలను నాలుగు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చు.
- డిజైన్ ఇంజనీరింగ్ (రూప కల్పన అంశాలు): ఏదైనా యంత్రాన్ని గాని, దాని యొక్క పరికరాలను గాని తయారు చేసేముందు వివిధములైన సాంకేతిక అంశాలను, ఉపయోగించే సమయంలో తలెత్తే సవాళ్లు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపకల్పన చేయవలసి ఉంటుంది.
- మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ (ఉత్పత్తి అంశాలు): రూప కల్పన చేసిన వాటి ఆధారంగా సరైన అందుబాటులో ఉన్న ఉత్పత్తి వ్యవస్థను, యంత్రాలను, ఉపకరణాలను వినియోగించుకుని ఉత్పత్తి చేయవలసి వస్తుంది.
- థర్మల్ ఇంజనీరింగ్ (ఉష్ణ సంబంధ అంశాలు): వివిధ వినియోగాలలో ఉపయోగించే పరికరాలు, యంత్రాలు శీతోష్ణాలకు గురవుతాయి. మరి వాటిని తట్టుకొని వినియోగానికి అనువైన పనిని చేయటానికి ఉపయోగించే అంశాలను దీనిలో భాగంగా బోధించడం జరుగుతుంది.
- ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (పరిశ్రమలు మరియు ఉత్పాదకత అంశాలు): పరిశ్రమలలో ఉపయోగించే వివిధ పరికరాలు, ముడి సరుకుల ఎంపిక, ఉపయోగించడం, ఉత్పత్తిని పెంపొందించడం, ఉత్పాదకతను వృద్ధి చేయడం వంటి అంశాలను ఇక్కడ బోధిస్తారు.
వీటికి అనుసంధానంగా మరికొన్ని అదనపు అంశాలను కూడా ప్రాధాన్యతతో బోధించడం జరుగుతుంది. ఆటోమేషన్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, మెటీరియల్స్, మోడలింగ్, సిమ్యులేషన్, అనాలసిస్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ మొదలైన ఎన్నో అంశాలను బోధిస్తారు. నేర్చుకున్న అన్నింటిని క్రోడీకరించుకొని, విద్యార్ధులు మినీ ప్రాజెక్టులు, మేజర్ ప్రోజెక్టులు కూడా చేస్తారు. ఈ క్రమంలో విద్యార్ధి యొక్క నిగూఢ అవగాహన, నిశిత పరిశీలన, వినూత్న పరిష్కారాల సామర్ధ్యం, మానవాళి అవసరాలకు సరిపడే ఉత్పత్తుల రూపకల్పనం, సామాజికాభివృద్ధి దిశలో తనదైన ప్రత్యేక శైలితో పాటుపడటం సాధ్యమవుతుంది.
అవకాశాలు: మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను ప్రాథమిక మౌలిక అంశాల పట్టుతో పరిపూర్ణంగా అధ్యయనం చేసి విజయవంతంగా పట్టా పుచ్చుకున్న విద్యార్ధికి అవకాశాలు అపారంగా ఉన్నాయి. అంటే మౌలిక అంశాలు, మెరుగైన నైపుణ్యత, మంచి నడత కలిగిన మెకానికల్ గ్రాడ్యుయేట్స్ కు అవకాశాలు వాటి అంతట అవే వస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా ఉన్నత చదువులు, పరిశోధన , ప్రాంగణ నియామకాలు, వ్యవస్థాపకత, సంస్థ స్థాపన మొదలైన అవకాశాలు మెండుగా ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ వృత్తిలో ఉంటూనే ఇంకా లోతుగా, పరిశోధనా దిశలో కొనసాగాలని ఆసక్తి ఉంటే ఏదైనా అనువైన ప్రత్యేకమైన మెకానికల్ ఉప విభాగంలో ఏదైనా ప్రామాణిక విద్యాసంస్థలలో ఉన్నత విద్య అభ్యసించవచ్చు. అవసరమైన అనుభవము, నైపుణ్యత, నెట్వర్కింగ్ సంపాదించుకొని అంకుర సంస్థలు కూడా స్థాపించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం కూడా ఇటువంటి ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు ఉత్సాహాన్ని కల్పిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది. కోర్ ఇంజనీర్ విద్యార్దులను ప్రోత్సహించడానికి ఏఐసిటిఈ యశస్వి పేరు తో స్కాలర్షిప్ ను కూడా అందిస్తోంది. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలలో, పరిశ్రమలలో కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కోర్సులు - ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అదనపు అర్హతను సంపాదించి,ఆయా సంబంధిత మెళకువలను మేళవింపు గావించుకొని ఇంకామరెన్నో విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునే ఆస్కారం కూడా మెండుగా ఉంటుంది. ఇటువంటి అవకాశాలను ఇంకా విస్తృత పరుచుకోవాలంటే, కొన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క అటానమస్ గుర్తింపు ఉన్న ప్రముఖ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ తో పాటు కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రాంలలో కూడా అదనపు మైనర్ ఇంజనీరింగ్ లేదా హానర్స్ ఇంజనీరింగ్ పట్టాలను పొందే అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చు.
విద్యాభ్యాసం:
విద్యార్థి తాను కోరుకున్న కళాశాలలో తనకు ఆసక్తి ఉన్న ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన తరువాత, తన తదుపరి విద్యాభ్యాసాన్ని ఒక క్రమపదతిలో, క్రమశిక్షణతో, క్రమానుసారంగా వ్యవస్థీకృత విద్యా విధానాలతో, ప్రామాణిక ప్రమాణాల ఆధారిత దిశలో కొనసాగించుకునే సత్సంకల్పం, ధృడ నిశ్చయం, అనితర విశ్వాసం తన హృదయంలో పదిలపరుచుకోగలగాలి. ప్రవేశం పొందిన తరువాత, నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యాభ్యాస గమనంలో మొదటి రోజున ఎంత ఉత్సాహంతో, ఆసక్తితో, ఏదో సాధించాలనే పట్టుదలతో కళాశాలకు హాజరు అవుతారో అదే ఉత్సాహంతో, రెట్టింపు పట్టుదలతో నాలుగేళ్లు విద్యాభ్యాసం కొనసాగించాలి. గొప్ప భవిష్యత్తు సమాజోద్ధరన విజయాలకు పునాదులు వేసుకోగలగాలి. ప్రతిరోజూ, ఏ కొత్త అంశాన్ని నేర్చుకున్నా దానిని కేవలం అంశ ధోరణిలో కాకుండా, ఏదో మొక్కుబడిగా పరీక్షల్లో ఉత్తీర్ణతకు కాకుండా, ఒక తత్వ దృష్టితో, ఒక సామాజిక దృక్పథంతో చూస్తూ, మానవ జీవనాన్ని మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలను ఆవిష్కరించడానికి, వినూత్నంగా ఆలోచిస్తూ, వైవిధ్యంగా పరిశీలిస్తూ, కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూ, పరిశోధన కొనసాగిస్తూ, ఇంకా లోతైన అధ్యయనం, అభ్యాసం గావిస్తూ సమాజంలో నిత్యము ఉత్పన్నమయ్యే అనేక వైవిధ్య సవాళ్లకు పరిష్కారాలను అందించే ఆశయంతో విద్యాభ్యాసం కొనసాగించుకోవాలి.
|
|
Tags
- Mechanical Engineering Careers
- Mechanical Engineering
- engineering students
- Mechanical Engineering Jobs
- Mechanical engineer students
- Engineering Careers
- Automotive engineering
- Aerospace Engineering
- Manufacturing engineering
- product design
- HVAC engineering
- Mechanical engineering technician
- Engineering Services
- Robotics
- SakshiEducationUpdates