TSCHE: నోటిఫికేషన్ ఇచ్చాకే ఈ సీట్ల భర్తీ చేయాలి
ప్రైవేటు కాలేజీలు బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి ఇప్పటికే ద్వారాలు తెరిచాయి. బేరసారాల కోసం ఆయా కాలేజీలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశాయి. తల్లిదండ్రులూ ప్రముఖ కాలేజీల వద్ద బారులు తీరుతున్నారు. మధ్యస్థంగా ఉండే కాలేజీలు డిమాండ్ సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. కన్సల్టెన్సీలు, పీఆర్‌వోల ద్వారా విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంసెట్‌లో 50 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులు మంచి కాలేజీలో కోరుకున్న సీటు రాదని భావిస్తున్నారు. దీంతో యాజమాన్య కోటాలో సీటు తెచ్చుకునేందుకు ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌లోని మూడు ప్రముఖ కాలేజీల్లో రోజూ 20 మంది వరకూ కళాశాల ప్రతినిధులతో బేరసారాలు ఆడుతున్నారు. ఈ కేటగిరీలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉన్నతాధికారులు ఉంటున్నారు. వాస్తవానికి కన్వీనర్ కోటా సీట్ల భర్తీ తర్వాతే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఉంటుంది. కానీ కాలేజీలు అనధికారికంగా ముందే బేరం కుదుర్చుకుంటున్నాయి. నిబంధనలకు పాతరేస్తున్నా అధికారులు మాత్రం ఇవేవీ తమ దృష్టికి రావడం లేదని చెబుతున్నారు.
☛ College Predictor - 2023 TS EAMCET | AP EAPCET
రూ.లక్షల్లో బేరం
రాష్ట్రంలో దాదాపు 176 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో 145 ప్రైవేటు కాలేజీలే. 71 వేల ఇంజనీరింగ్ సీట్లు కన్వీనర్ కోటా కింద, 30 వేల సీట్లు యాజమాన్య కోటా కింద ఉంటాయి. ఇందులో సగం సీట్లను జేఈఈ ర్యాంకులు, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక రుసుం తీసుకోవాలి. కాకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండదు. మిగిలిన సగం సీట్లను ప్రవాస భారతీయుల పిల్లలకు, ఎన్‌ఆర్‌ఐలు స్పాన్సర్ చేసే వారికి ఇవ్వాలి. ఈ సీట్లకు ఎక్కువ ఫీజు వసూలు చేయొచ్చు. అందుకే ముందుగానే అనధికారికంగా డొనేషన్ల రూపంలో తీసుకుంటున్నాయి. ఒక్కో సీటుకు రూ. 8 నుంచి 12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు ఫీజులతో కలిపి రూ.20 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. బేరం కుదిరితే ఇప్పుడే సగం కట్టాలని షరతు పెడుతున్నట్లు సమాచారం.
చదవండి: Best Branch In BTech : బీటెక్‌లో ఏ బ్రాంచ్ సెలక్ట్ చేసుకుంటే మంచిదంటే..?
కంప్యూటర్ సైన్స్ హాట్ కేక్
యాజమాన్య కోటా కింద సీట్లు ఆశిస్తున్న విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్, అనుబంధ బ్రాంచ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీలు సీఎస్‌సీ సీటుకు వార్షిక ఫీజుకు అదనంగా రూ.8–10 లక్షలు అడుగుతున్నాయి. మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులైతే రూ.12 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కిందే సీట్లు భర్తీ కావడం లేదు. కాబట్టి ఎంసెట్‌లో లక్షల్లో ర్యాంకు వచ్చిన వాళ్లు, క్వాలిఫై కాని వాళ్లే ఈ సీట్లను ఆశిస్తున్నారు. ప్రముఖ కాలేజీలైతే రూ. 2 లక్షల వరకూ అదనంగా డిమాండ్ చేస్తున్నాయి.
నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలి
యాజమాన్య కోటా సీట్లయినా నిబంధనల ప్రకారమే భర్తీ చేయాలి. ఈ విషయంలో మండలి సీరియస్‌గా ఉంది. బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మెరిట్ పద్ధతి పాటించాల్సిందే. అందుకు విరుద్ధంగా డబ్బులు తీసుకుని సీట్లు అమ్ముకున్నట్టు ఫిర్యాదులొస్తే విచారణ జరిపిస్తాం. ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా ఊరు కోం. తల్లిదండ్రులు కూడా నోటిఫికేషన్ రాకుండా యాజమాన్య కోటా సీట్లు ఆశించడం సరికాదు.
ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, (ఉన్నత విద్య మండలి ఛైర్మన్)