Nursing course: ఇక ఎంసెట్ ద్వారా నర్సింగ్ కోర్సులో ప్రవేశం
- ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడి
- వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు
- బైపీసీ విద్యార్థులు చేరేందుకు అవకాశం
- ప్రైవేటు కాలేజీల్లో 60 శాతం కన్వీనర్ కోటా
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడినట్టు చెప్పారు. ఈ విధానం 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించారు. మండలి కార్యాలయంలో లింబాద్రి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)తో పనిలేదని పేర్కొంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గద ర్శకాలు విడుదల చేసిందని, రాష్ట్రాల ఇష్టానుసారం వివిధ పరీక్షల ద్వారా ప్రవేశాలు చేపట్టవచ్చని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ర్యాంకుల ద్వారా ఆయా సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించిందన్నారు. నాలుగేళ్ల నర్సింగ్ కోర్సులో ఇప్పటివరకు ఇంటర్ (బైపీసీ) మార్కులను బట్టి ప్రవేశం కల్పించేవారని చైర్మన్ వివరించారు.
Also read: AP 10th Class 2022: నేటి నుంచి పరీక్షలు ప్రారంభం... మోడల్ పేపర్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి
మే 28 వరకు దరఖాస్తులకు అవకాశం
ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 28 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విభాగానికి, బైపీసీ చేసిన వారు అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ రాయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. బైపీసీ విద్యార్థులు అందరికీ ఒకే పరీక్ష ఉంటుందని, ర్యాంకులు ప్రకటించిన తర్వాత వారు నర్సింగ్ కోర్సును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని లింబాద్రి తెలిపారు. ఎంసెట్ దరఖాస్తు గడువు మే 28 వరకూ ఉన్నందున ఇందుకోసం ప్రత్యేకంగా గడువు పొడిగించాల్సిన అవసరం లేదని చెప్పారు. ర్యాంకులు ప్రకటించిన తర్వాత సంబంధిత కాలేజీలు ప్రవేశ ప్రక్రియ మొదలు పెడతాయని వివరించారు.
Also read: PG Medical Admissions: వెబ్ ఆప్షన్‌ల నమోదుకు నోటిఫికేషన్
నర్సింగ్‌లో 5,300 సీట్లు
రాష్ట్రవ్యాప్తంగా 81 నర్సింగ్ కాలేజీలున్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు 9 అయితే, 81 ప్రైవేటు కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 680 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 4,620 సీట్లు కలిపి మొత్తం 5,300 ఉన్నాయని మండలి ప్రకటించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. నర్సింగ్ కోర్సుల్లో మాత్రం ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 60 శాతం కన్వీనర్, 40 శాతం మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా, ఇతర రిజర్వేషన్లన్నీ నిబంధనల ప్రకారమే అమలు చేస్తామని, దీనికి సంబంధించిన నియమ నిబంధనలను పరిశీలిస్తున్నామని లింబాద్రి తెలిపారు.
Also read: Non Gazetted Posts: 90 పోస్టుల భర్తీ కోసం BSF నోటిఫికేషన్ 2022