Skip to main content

TG DSC 2024 : డీఎస్సీలో నియామ‌క ప్ర‌క్రియ‌లో భారీ స్కామ్‌...? నిలదీస్తే నో ఆన్స‌ర్‌...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఏ ప‌రీక్ష జ‌రిగిన ఎక్క‌డో ఒక చోటు స్కామ్‌ జ‌రుగుతూనే ఉంది. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు ప్రక్రియ పూర్తి చేసి.. వీరికి ఉద్యోగాలు కూడా ఇచ్చాము అని ప్ర‌స్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటుంది.
telangana dsc 2024 scam

అయితే.. ఇవీ రాష్ట్రప్రభుత్వ రాజ‌కీయ పెద్దలు చెప్పే గొప్పలు మాత్ర‌మే.. కానీ ఇదే డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా టీచర్‌ ఉద్యోగాల భర్తీలో భారీగా అవినీతి జరిగిందని చాలా మంది అభ్య‌ర్థులు ఆరోపణలు చేస్తున్నారు.

నిలదీస్తే నో ఆన్స‌ర్‌...
ఈ విష‌యం గురించి తెలంగాణ విద్యాశాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులను నిలదీస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే రెండు శాఖల పెద్దలు నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భారీ కుంభకోణంలో ఏ పెద్దల ప్రమేయముందో తేలాలంటే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ కోట‌లోనే...
టీఎస్ డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో 95 పోస్టులుండగా.., ఆ క్యాటగిరీలో దాదాపు 8000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ క్యాటగిరీలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీకి అప్పగించింది. అక్టోబర్‌లో మొత్తం 393 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. కోటాలోని 95 పోస్టులకు 33 మందికి ఉద్యోగాలిచ్చారు. మిగిలిన 62 పోస్టులను ఓపెన్‌ కోటాకు మళ్లించారు. కానీ పోస్టులివ్వడంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు. 

దీంతో నవంబర్‌ 20, 21, 22 తేదీల్లో కిందిస్థాయి అధికారులు సర్టిఫికెట్లు పరిశీలించారు. జనవరి 3,4న ఉన్నతాధికారులు మళ్లీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేశారు. మూడు సార్లు సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌ చేసినా ఒక్క నివేదికనూ బయటపెట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో పోస్టింగ్‌కు ఎంపిక చేయాలంటే ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ విద్యాశాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ కలిసి లక్షల రూపాయలు లంచాలు తీసుకుని, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులను పక్కనపెట్టి, జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చారని చెప్తున్నారు. ఇదే విషయంపై హైకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు. 

మ‌రో 6000 టీచ‌ర్ పోస్టుల‌కు పైగా..
ఇదిలా ఉంటే.. మరికొన్ని ఖాళీలను గుర్తించి వాటిని కూడా భర్తీ చేయాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. కొద్ది నెలల కిందట అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు నెలలను కూడా వెల్లడించింది. తెలంగాణ విద్యాశాఖలోని మరికొన్ని టీచర్ ఖాళీల భర్తీకి ప్ర‌భుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏమైనా ఖాళీలు ఉంటే... వాటిని కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 

త్వ‌ర‌లోనే తెలంగాణలో మ‌రో డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025లో ఇవ్వ‌నున్నారు. ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ లో 5000 నుంచి 6000 మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.

Published date : 17 Mar 2025 03:26PM

Photo Stories