Skip to main content

AP DSC 2025 Notification Updates : 16,347 పోస్టుల డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌... ఇంకా...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్ర‌దేశ్ కూట‌మి ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు 16,347 పోస్టుల డీఎస్సీ నోటిఫికేష‌న్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీతో 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు.. తీరా సీఎం అయ్యాక కేవ‌లం.. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల‌తో క‌లిపి కేవ‌లం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామంటూ తొలి సంతకం చేసి అభ్య‌ర్థుల‌ను మోసం చేశారు.
ap 16347 dsc 2025 notification release announcement   DSC Notification Announcement   Andhra Pradesh CM Chandrababu Naidu Announcement  Mega DSC 2024 Teacher Recruitment

అయితే ఈ నోటిఫ‌కేష‌న్ కూడా గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సీ(MLC) ఎన్నిక‌ల త‌ర్వాత‌నే అంటూ... కాల‌యాప‌న చేస్తూ... మోసం మీద మోసం చేస్తున్నాడు.

మెగా డీఎస్సీ పేరుతో తమ జీవితాలతో..
మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం అభ్యర్థులతో ఆటలాడుతోంది.  ఇప్పటికి 8 నెలలు పూర్తయినా డీఎస్సీపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం నిలువునా మోసంచేసిందంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి, మెగా డీఎస్సీ పేరుతో తమ జీవితాలతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సీఎం చంద్రబాబు 16,347 పోస్టులకు తొలి సంతకం చేసి, గత డిసెంబర్‌కే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. 

☛➤ February 3rd Schools and Colleges Holiday : ఫిబ్ర‌వ‌రి 2, 3 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్ర‌క‌ట‌న‌.. ఎందుకంటే...?

నోటిఫికేషన్‌పై...
కానీ 8 నెలలు అవుతున్నా నోటిఫికేషన్‌ ఇవ్వకపోగా పలు సాకులతో వాయిదా వేస్తున్నారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నెల క్రితమే జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను తెప్పించుకుంది. ఆ వివరాలను కూడా వెల్లడించలేదు. నోటిఫికేషన్‌పై నిరుద్యోగులను ఇన్ని నెలలుగా మభ్యపెట్టి, వాస్తవ పరిస్థితులను వెల్లడించకపోవడంతో అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు. 

టీచర్‌ పోస్టులు భర్తీ చేయకుండా...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్‌ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అంటూ ఎన్నికల్లో నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మాట మార్చేశారు. ఉన్నవి 25 వేల ఖాళీలు కాదు... 16,347 పోస్టులే అని ప్రకటించారు. అంతేగాకుండా, గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. తర్వాత కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ జూలై 2న నోటిఫికేషన్‌ ఇచ్చి ఆగస్టులో పరీక్షలంటూ ప్రచారం చేసింది.

టెట్‌కు, డీఎస్సీకి 90 రోజుల గడువు ఉండాలంటూ..
అనంతరం టెట్‌కు, డీఎస్సీకి 90 రోజుల గడువు ఉండాలంటూ టెట్‌ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబర్ కు, తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్‌ ఫలితాలు వచ్చి మూడు నెలలైనా డీఎస్సీ నోటిఫికేషన్‌ మాత్రం ప్రకటించలేదు. దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్థికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నా, కనీసం విద్యాశాఖ మంత్రి కూడా ఫలనా రోజు డీఎస్సీ షెడ్యూల్‌ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయడంలేదు. 

అసలు చదవాలో లేదో కూడా...
ఏడాది కాలంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలు చదవాలో లేదో కూడా తెలియని గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఇన్ని పోస్టులు లేకపోవడం వల్లే నోటిఫికేషన్‌ ఇవ్వడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.  

సీఎం మొదటి సంతకంకు విలువ లేదా..? :  జి.రామన్న, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి 
తాము అధికారంలోకి వస్తే మొదట మెగా డీఎస్సీ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు యువతకు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు 16 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామంటూ తొలి సంతకం చేశారు. అయినా భర్తీ ప్రక్రియ చేపట్టకుండా కాలయాపన చేయడం అన్యాయం. 
రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇక ఓపిక పట్టే పరిస్థితి యువతకు లేదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్‌ ఇవ్వాలి. లేకపోతే పోరాటాలతోనే ప్రభుత్వానికి సమాధానం చెబుతాం. 

ఇప్పటికి రెండుసార్లు కోచింగ్‌ తీసుకున్నా... : లలిత్, డీఎస్సీ అభ్యర్థి, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా 
డీఎస్సీ కోసం ఇప్పటికి రెండుసార్లు కోచింగ్‌ తీసుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామంటే అందరం నమ్మాం. డిసెంబర్‌ అన్నారు.. జనవరి వెళ్లిపోతోంది. నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తారో మాత్రం ఎవరూ చెప్పరు. డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

రెండేళ్ళ నుంచి శిక్షణ.. కానీ : మండల శ్రీను, శ్రీకాకుళం జిల్లా 
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పారు. 16 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. రకరకాల సాకులతో వాయిదా వేస్తున్నారు. రెండేళ్ళ నుంచి శిక్షణ తీసుకుంటున్నాం. ఇంకా ఇలా మాలాంటి ఎంతో మంది అభ్య‌ర్థుల జీవితాల‌తో ఈ కూట‌మి ప్ర‌భుత్వం చెలగాటం ఆడుతుంద‌ని... అభ్య‌ర్థులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.

Published date : 31 Jan 2025 03:07PM

Photo Stories