Skip to main content

TS DSC Notification 2023: టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది.
TS DSC Notification 2023
టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల

వాస్తవానికి సెప్టెంబర్‌ 5వ తేదీనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రూపొందించినప్పటికీ గోప్యంగా ఉంచిన విద్యాశాఖ, సెప్టెంబర్‌ 7న అర్థరాత్రి వెల్లడించింది. శాఖలో 22 వేల వరకూ ఖాళీలున్నప్పటికీ, కేవలం 5,089 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది. 1,523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని గతంలో ప్రకటించినా నోటిఫికేషన్‌లో ఆ ఖాళీలను ప్రస్తావించలేదు.

స్కూల్‌ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. తొలిసారిగా ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌)లో పరీక్షను నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 21 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 20 నుంచి 30వ తేదీ వరకు దశల వారీగా పరీక్ష ఉంటుందని తెలిపారు. 

చదవండి: TS DSC Notification: తెలంగాణలో 6,612 పోస్ట్‌ల భర్తీకి ఆమోదం.. అర్హతలు, పరీక్ష విధానం

గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లు.. 

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం నల్లగొండ, సంగారెడ్డిలో పరీక్ష కేంద్రాలుంటాయని ప్రభుత్వం పేర్కొంది. అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళు, దివ్యాంగులకు  పది సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఇస్తారు. అయితే ఈసారి టీఆర్టీ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కి పెంచారు. పరీక్ష ఆన్‌లైన్‌లో పెడుతున్న కారణంగా ఫీజు పెంచినట్టు అధికారులు తెలిపారు.

చదవండి: DSCలో కొత్త Subject ఇదే.. Scoring subject ఏదంటే! #sakshieducation

సెప్టెంబ‌ర్‌ 20 నుంచి అక్టోబర్‌ 20 మధ్య ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఉత్తీర్ణతకు ఓసీలు 90, బీసీలు 75, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు 60 మార్కులు తెచ్చుకోవాలి. టెట్‌ మార్కుల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టీఆర్టీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రతి పోస్టుకు ముగ్గుర్ని ఎంపిక చేస్తారు. వారి మార్కులు ఇతర మెరిట్స్‌ ఆధారంగా అందులో ఒకరిని ఎంపిక చేస్తారు. కాగా పూర్తి సమాచారం సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 

రెండు నెలల వ్యవధేనా? 

పాఠశాల విద్యాశాఖలో 22 వేల పోస్టులున్నాయని గత ఏడాది విద్యాశాఖ తెలిపింది. ఇందులో 13,086 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రస్తుతం టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపడుతున్నారు. దీనివల్ల కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. వీటిని కూడా కలిపి ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్‌ ఇస్తారని నిరుద్యోగులు భావించారు. కానీ 5,089 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్‌ జారీ చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

మరోవైపు కేవలం 2 నెలల వ్యవధిలోనే పరీక్ష నిర్వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు కూడా ఆర్నెల్ల సమయం ఇస్తున్న సర్కార్, టీఆర్టీని ఇంత త్వరగా పెట్టడం ఏమిటని నిరుద్యోగులు అంటున్నారు.  

Published date : 09 Sep 2023 11:36AM

Photo Stories