Skip to main content

ఉన్నత విద్యారంగంఅభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వామ్యం కావాలి: యూజీసీ

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగం అభివృద్ధిలో, విద్యాసంస్థల ప్రగతిలో పూర్వ విద్యార్థులను (అలుమ్నీ) సైతం పూర్తిస్థాయిలో భాగస్వాములుగా మార్చాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిర్ణయించింది.
 విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్, శిక్షణ, ఉపాధి కల్పన తదితర కీలక అంశాల్లో వారి సహకారం తీసుకోవాలని భావిస్తోంది. పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ ఉన్నత విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించింది. మనం చదువుకున్న విద్యాసంస్థలను అభివృద్ధి చేసుకుందాం రండి అంటూ ఆహ్వానిస్తోంది.
 
 ‘న్యాక్’  గుర్తింపు సాధిస్తే... 
 విద్యాసంస్థలు తమ పూర్వ విద్యార్థుల సహకారం పొందడానికి యూజీసీ కొన్ని నిబంధనలు విధించింది. దీని ప్రకారం పూర్వ విద్యార్థులను ముఖ్య స్టేక్‌హోల్డర్లుగా గుర్తించాలి. ప్రతి వర్సిటీ తమ పరిధిలోని కాలేజీల్లో చదివిన విద్యార్థుల సమాచారాన్ని సేకరించి, వారు ఏయే రంగాల్లో ఉన్నారో గుర్తించి సమగ్ర డేటాబేస్‌ను రూపొందించుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా పూర్వ విద్యార్థుల సంబంధాల విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు యూజీసీ రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ సాయం పొందాలంటే.. నేషనల్ అక్రెడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపు, ఎ-గ్రేడ్‌తో అత్యుత్తమ ఎన్‌ఐఆర్‌ఎఫ్ గుర్తింపు పొంది ఉండాలి. యూజీసీ కోరిన సమాచారాన్ని విద్యాసంస్థలు అందజేయాలి. 
 
 విరాళాలు ఇచ్చేవారికి మరిన్ని పన్ను రాయితీలు 
 దేశంలో యూజీసీ గుర్తింపు పొందిన 907 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 40,000 కళాశాలల్లో 3 కోట్ల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో ఉన్నత విద్యనభ్యసించిన వారిలో చాలామంది వివిధ రంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. పూర్వ విద్యార్థుల సహకారం ఉంటే ఉన్నత విద్యా సంస్థలు మరింత పురోగతి సాధిస్తాయని యూజీసీ భావిస్తోంది. వర్సిటీలు, కాలేజీలకు విరాళాలు ఇచ్చే పూర్వవిద్యార్థులకు మరిన్ని ఆదాయపు పన్ను రాయితీలు కల్పించాలని యూజీసీ భావిస్తోంది. ఇప్పటికే కొన్ని ఐఐటీలకు ఇచ్చే విరాళాలకు 80సీ కింద 100 శాతం పన్ను రాయితీ లభిస్తోంది. మరికొన్ని సంస్థలు 50 శాతం పన్ను రాయితీని కల్పిస్తున్నాయి. పూర్వవిద్యార్థుల్లో పలువురు విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ పరిధిలో వీరినుంచి ఆర్థిక సహకారాన్ని విద్యాసంస్థలు పొందవచ్చు.  
 
 కాలేజీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవచ్చు 
 ‘‘యూజీసీ అందించే ఆర్థిక సాయాన్ని పొందడానికి కళాశాలలు కృషి చేయాలి. ‘న్యాక్’ గుర్తింపు సాధించాలి. ఈ ప్రక్రియలో కాలేజీ సిబ్బంది మొత్తం మమేకం కావాలి. పేరెంట్స్ కమిటీలు, పూర్వ విద్యార్థుల సంఘాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యాసంస్థలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవచ్చు’’ 
  - ఏఆర్ చంద్రశేఖర్, ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్
  అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి
 
 
 పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నాం 
 ‘‘కాలేజీలకు, పూర్వ విద్యార్థులకు మధ్య అనుబంధం పెరగాలి. వారు అందించే విరాళాలతో కాలేజీలు అభివృద్ధి సాధిస్తాయి. పూర్వ విద్యార్థుల తోడ్పాటు ద్వారా ఇండస్ట్రీ-అకాడమీ మధ్య అంతరం తగ్గించవచ్చు. రాష్ట్రంలో పూర్వ విద్యార్థుల సహకారం పొందడానికి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నాం’’ 
  - ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్  
Published date : 22 Nov 2019 05:12PM

Photo Stories