Rohan Bopanna: ఏటీపీ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా బోపన్న రికార్డు
ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. మార్చి 19న జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ వెస్టీ కూల్‌హాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీని ఓడించింది. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. డానియల్ నెస్టర్ (కెనడా) పేరిట ఉన్న రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 2015లో నెస్టర్ 42 ఏళ్ల వయసులో సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు.
గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు.. రన్నరప్ వెస్లీ కూల్‌హాఫ్–నీల్ స్కప్‌సీ జంటకు 2,31,660 డాలర్ల (రూ. 1 కోటీ 91 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Hockey India Awards: హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా సవితా పూనియా, హార్దిక్ సింగ్
☛ బోపన్న కెరీర్‌లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. గతంలో అతను మోంటెకార్లో (2017లో), మాడ్రిడ్ (2015లో), పారిస్ ఓపెన్ (2012, 2011లో) మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. మరో ఐదు మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు.
☛ బోపన్న కెరీర్‌లో ఇది 24వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది రెండోది. ఈ సీజన్‌లో ఎబ్డెన్‌తోనే కలిసి బోపన్న దోహా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు.