Skip to main content

Rafael Nadal wins 14th French Open title: 14వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన రాఫెల్‌ నాదల్‌

పారిస్‌: మట్టికోటలో మహరాజు... నభూతో నభవిష్యత్‌... సరిలేరు నీకెవ్వరు... నమో నమః... ‘గ్రాండ్‌ సలాం’.. ఇంకా ఏమైనా విశేషణాలు ఉన్నాయంటే వాటిని కూడా స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు జత చేయాల్సిందే. ఒకవైపు తమ కెరీర్‌ మొత్తంలో ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడకుండానే.. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గకుండానే కెరీర్‌ను ముగించేసిన టెన్నిస్‌ ఆటగాళ్లెందరో ఉంటే... మరోవైపు నాదల్‌ మాత్రం ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ టైటిల్‌ను ఒకసారి కాదు... రెండుసార్లు కాదు... మూడుసార్లు కాదు... ఏకంగా 14సార్లు గెలిచి అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రాఫెల్‌ నాదల్‌ జూన్‌ 5 (ఆదివారం) ఈ జాబితాలో మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు.
Rafael Nadal wins 14th French Open title
Rafael Nadal wins 14th French Open title

 ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)తో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ నాదల్‌ 2 గంటల 18 నిమిషాల్లో 6–3, 6–3, 6–0తో గెలిచాడు. తద్వారా ఫ్రెంచ్‌ ఓపెన్‌ను 14వసారి సొంతం చేసుకోవడంతోపాటు తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన 14 సార్లూ నాదలే గెలిచాడు. విజేతగా నిలిచిన నాదల్‌కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు)... రన్నరప్‌ రూడ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

ఏకపక్షంగా... 

ఫైనల్‌ చేరే క్రమంలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తొమ్మిదో సీడ్‌ అలియాసిమ్‌ (కెనడా)పై, క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై, సెమీఫైనల్లో మూడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలిచిన నాదల్‌కు ఫైనల్లో ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆరంభం నుంచే అద్భుతంగా ఆడిన నాదల్‌ తన ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఎనిమిదిసార్లు రూడ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. 37 విన్నర్స్‌ కొట్టిన నాదల్‌ కేవలం 18 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు రూడ్‌ 16 విన్నర్స్‌ కొట్టి, 26 అనవసర తప్పిదాలు చేశాడు.

  • 1 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన పెద్ద వయస్కుడిగా  నాదల్‌ (36 ఏళ్ల 2 రోజులు) రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రెస్‌ గిమెనో (స్పెయిన్‌; 1972లో 34 ఏళ్ల 10 నెలలు) పేరిట ఉండేది.  
  • 8 నాదల్‌ 14 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన క్రమంలో ఎనిమిదిసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్‌పై మూడుసార్లు, డొమినిక్‌ థీమ్‌పై రెండుసార్లు, సోడెర్లింగ్, పుయెర్టా, ఫెరర్, వావ్రింకా, కాస్పర్‌ రూడ్‌లపై ఒక్కోసారి విజయం సాధించాడు.  
  • 23 నాదల్‌ 14సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన క్రమంలో తన ప్రత్యర్థులకు కోల్పోయిన మొత్తం సెట్‌ల సంఖ్య. 2008, 2010, 2017, 2020లలో అతను ఒక్క సెట్‌ కూడా ఓడిపోలేదు. 2007, 2012, 2018లలో ఒక్కో సెట్‌... 2014, 2019లలో రెండు సెట్‌లు... 2005, 2006, 2011, 2022లలో మూడు సెట్‌లు... 2013లో అత్యధికంగా నాలుగు సెట్‌లు చేజార్చుకున్నాడు.  
  • 112 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ చరిత్రలో నాదల్‌ గెలిచిన మొత్తం మ్యాచ్‌లు.
  • 22 నాదల్‌ నెగ్గిన ఓవరాల్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌. ఇందులో 14 ఫ్రెంచ్‌ ఓపెన్‌కాగా... 4 యూఎస్‌ ఓపెన్, 2 వింబుల్డన్, 2 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ ఉన్నాయి.

చ‌ద‌వండి: Quiz of The Day(June 02, 2022) >> తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది?

GK Important Dates Quiz: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

 

Published date : 06 Jun 2022 05:08PM

Photo Stories