French Open title: నాలుగో సారి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఇగా స్వియాటెక్
Sakshi Education
గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో వరుసగా మూడో ఏడాది వరల్డ్ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ చాంపియన్‌గా నిలిచింది.
జూన్ 8వ తేదీ జరిగిన ఫైనల్లో స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–1 స్కోరుతో 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని (ఇటలీ)పై ఘన విజయం సాధించింది.
తొలి సారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పావ్లిని బలమైన ప్రత్యర్థి జోరు ముందు నిలవలేకపోయింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 24 లక్షల యూరోలు (సుమారు రూ.22 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.
2022, 2023, 2024లలో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్.. అంతకు ముందు 2020లో కూడా ఇక్కడ విజేతగా ట్రోఫీని అందుకుంది. 2022 యూఎస్ ఓపెన్ కలిసి ఆమె ఖాతాలో మొత్తం ఐదు గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్ చేరిన ఐదు సార్లూ స్వియాటెక్ టైటిల్ దక్కించుకుంది. 2007 (జస్టిన్ హెనిన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌ను వరుసగా మూడు సార్లు గెలిచిన తొలి మహిళా ప్లేయర్‌గా ఆమె నిలిచింది.
Published date : 11 Jun 2024 09:53AM