T20 World Cup: ఆరోసారి టి20 ప్రపంచకప్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్.. 2016 మెగా ఈవెంట్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మళ్లీ 2018, 2020, 2023లలో ప్రపంచకప్‌ల హ్యాట్రిక్ నమోదు చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ జరిగిన ఫైనల్లో మెగ్ లానింగ్ సేన 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు అర్ధ సెంచరీ సాధించగా, ఆష్లే గార్డ్‌నర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడింది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ (2/26), మరిజన్ కాప్ (2/35) కంగారు పెట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసింది. ఓపెనర్ లారా వోల్‌వార్ట్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటం వృథా అయ్యింది. టోర్నీలో 110 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీసిన ఆసీస్ ఆల్‌రౌండర్ గార్డ్‌నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.