Skip to main content

Asian Wrestling Championships 2023: భారత రెజ్లర్లకు ఐదు పతకాలు

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు.
Antim Panghal

ఏప్రిల్ 12న‌ ముగిసిన మహిళా ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో భారత్‌కు ఒక రజతం, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు లభించాయి. గత ఏడాది అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అంతిమ్‌ పంఘాల్‌ (53 కేజీలు) రజత పతకం నెగ్గగా.. అన్షు మలిక్‌ (57 కేజీలు), సోనమ్‌ మలిక్‌ (62 కేజీలు), మనీషా (65 కేజీలు), రీతిక (72 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్‌ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు కేవలం ఒక పాయింట్ సమర్పించుకున్న అంతిమ్‌ తుది పోరులో మాత్రం పోరాడినా ఫలితం లేకపోయింది. 2021 ప్రపంచ చాంపియన్‌ అకారి ఫుజినామి (జపాన్‌) 10–0తో మూడు నిమిషాల వ్యవధిలో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో అంతిమ్‌పై గెలిచి స్వర్ణ పతకం దక్కించుకుంది. 

Asian Wrestling Championships: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో నిషాకి రజతం, ప్రియాకి కాంస్యం

అంతకుముందు అంతిమ్‌ తొలి రౌండ్‌లో 10–0తో అల్వినా లిమ్‌ (సింగపూర్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 6–0తో లి డెంగ్‌ (చైనా)పై, సెమీఫైనల్లో 8–1తో అక్టెంగె కెనిమ్‌జయేవా (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందింది. కాంస్య పతక బౌట్‌లలో అన్షు 10–0తో ఎర్డెన్‌సుడ్‌ బట్‌ ఎర్డెన్‌ (మంగోలియా)పై, సోనమ్‌ 5–1తో జియోజువాన్‌ లు (చైనా)పై, మనీషా 8–0తో అల్బీనా కైర్‌జెల్డినోవా (కజకిస్తాన్‌)పై, రీతిక 5–1తో స్వెత్లానా (ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించారు. రెండు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు నెగ్గిన భారత్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (05-11 మార్చి 2023)

Published date : 13 Apr 2023 05:15PM

Photo Stories