Agricultural: ప్రధాని ఆవిష్కరించిన 35 నూతన వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థ?
భారత వ్యవసాయ పరిశోధనా సమాఖ్య(ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన 35 రకాల నూతన వంగడాలను సెప్టెంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఐసీఏఆర్ సంస్థలతోపాటు కేంద్రీయ, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలలో వర్చువల్ విధానం ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో కొత్త వంగడాలను మోదీ విడుదల చేశారు. అనంతరం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్మించిన జాతీయ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ సంస్థ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే నాలుగు యూనివర్సిటీలకు గ్రీన్ క్యాంపస్ అవార్డులను ప్రదానం చేశారు. ‘సైంటిస్టులు 1300 రకాలకు పైగా విత్తన వెరైటీలను అభివృద్ధి చేశారు. ఈ రోజు మరో 35 వెరైటీలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి’ అని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రధాని విడుదల చేసిన కొత్త వంగడాల్లో వర్షాభావ పరిస్థితులను, చీడలను తట్టుకొనే కంది, సెనగ, సోయా, వరి, సజ్జ, మొక్కజొన్నతో పాటు అధిక పోషకవిలువల గోధుమ రకాలు ఉన్నాయి. కరవు తదితర కఠిన వాతావరణ పరిస్థితులను, వివిధ రకాల వ్యాధులను తట్టుకొని అధిక పోషక విలువలున్న ఆహారాన్ని అందించే వీటిని అభివృద్ధి చేశారు.
చదవండి: కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వ్యవసాయ పరిశోధనా సమాఖ్య(ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన 35 రకాల నూతన వంగడాల ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : సాగు రంగంలో సమస్యలను సాంకేతికతతో అధిగమించేందుకు...