Skip to main content

Digital Health ID Card: కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ఉద్దేశం?

PM Modi-ABDM

పౌరులకు డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్డును జారీ చేసేందుకు ఉద్దేశించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎమ్‌)’ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 27న ఢిల్లీలో వర్చువల్‌ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2020, ఆగస్టు 15న ఈ మిషన్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రం అమలు చేసింది.

డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్డుతో ప్రయోజనాలు..

ఆరోగ్య చరిత్ర నిక్షిప్తం: వ్యక్తి ఆధార్‌ కార్డు లేదా మొబైల్‌ నంబర్‌ను ఉపయోగించి 14 అంకెలు ఉండే డిజిటల్‌ హెల్త్‌ ఐడెంటిఫికేషన్‌(ఐడీ) నంబర్‌ కేటాయిస్తారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత మెడికల్‌ రిపోర్టులు, కుటుంబ వివరాలు, ఉండే ప్రాంతం, చిరునామా తదితరాలను తీసుకుంటారు. కార్డులో పౌరుల ఆరోగ్య చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య ఎదురైతే తోడుగా ఆస్పత్రికి హెల్త్‌ కార్డు తీసుకెళ్తే హెల్త్‌ హిస్టరీ సాయంతో సరైన చికిత్స సకాలంలో పొందే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దీంతో వేరే ప్రాంతాల, వేరే రాష్ట్రాల పౌరులకూ చికిత్స చేయడం అక్కడి వైద్యులకు సులభం అవుతుంది.

 

యాప్‌తో అనుసంధానం: డిజిటల్‌ హెల్త్‌ ఐడీ(ఖాతా) వివరాలను ఒక మొబైల్‌ అప్లికేషన్‌తో అనుసంధానిస్తారు. హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్‌ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్‌ ఫెసిలిటీస్‌ రిజిస్ట్రీస్‌గా దీనిని పిలుస్తారు. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఏ) తరహాలో యూనిఫైడ్‌ హెల్త్‌ ఇంటర్‌ఫేస్‌(యూహెచ్‌ఐ)ను ఈ వ్యవస్థలో వాడనున్నారు. వైద్యులు, వైద్యశాలలు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్, ఫార్మసీలు యూహెచ్‌ఐ ద్వారా రోగుల గత రిపోర్ట్‌లను తీసుకుంటాయి. తద్వారా సత్వర వైద్య సేవలు అందిస్తాయి.

టెలీ మెడిసిన్‌ వ్యవస్థ విస్తరణ: దేశంలో ఎంత మంది ఏ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారో తెలిస్తే.. ప్రభుత్వం సైతం తగు విధంగా విధానపర ‘ఆరోగ్య’ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టెలీ మెడిసన్‌ వంటి సదుపాయాలు ఈ హెల్త్‌ కార్డు ద్వారా సులభంగా పొందొచ్చు. దీంతో టెలీ మెడిసిన్‌ వ్యవస్థ మరింతగా విస్తరించనుంది.

చ‌ద‌వండి: డిజిటల్‌ డీ అడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎమ్‌) ప్రారంభం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 27
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు  : పౌరులకు డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్డును జారీ చేసేందుకు

Published date : 28 Sep 2021 12:11PM

Photo Stories