ISRO: ఇస్రో మరో ఘనత.. ఫ్యూయెల్ సెల్ టెస్ట్ సక్సెస్
కొత్త సంవత్సరం తొలి రోజున పీఎస్‌ఎల్‌వీ-సీ58తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్ సెల్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరుకు సంబంధించిన డేటాను సేకరించింది. ఈ డేటాతో ఫ్యుయెల్ సెల్ పనితీరును పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది. ఈ విషయాన్ని ఇస్రో జనవరి 5(శుక్రవారం)వ తేదీ ‘ఎక్స్’లో ప్రకటించింది.
భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లో వాడే విద్యుత్ ఉత్పత్తి కోసం ఇస్రో ఫ్యుయెల్ సెల్‌ను రూపొందించింది. వంద వాట్ల క్లాస్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయెల్‌సెల్‌ను విజయవంతంగా పరీక్షించి విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రసాయన చర్యలో ఫ్యుయెల్ సెల్ కేవలం నీటిని మాత్రమే బై ప్రోడక్ట్‌గా విడుదల చేసింది. ఇదే లాంచ్ వెహికిల్‌లలో ఇస్రో ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్‌పోశాట్‌ను కూడా నింగిలోకి తీసుకెళ్లింది. దీంతో పాటు మరో 10 పరికరాలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది.
అంతరిక్షంలో వెలువడే ఎక్స్-రే కిరణాల మూలాలపై పరిశోధించేందుకు ఎక్స్‌పోశాట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది. నాసా తర్వాత అంతరిక్షంలో వెలువడే ఎక్స్‌రే కిరణాలపై పరిశోధన చేస్తున్నది ఇస్రోనే కావడం విశేషం. ఎక్స్‌రే కిరణాల మీద పరిశోధనకుగాను అమెరికా 2021లో ఐఎక్స్‌పీఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపింది.