SSLV-D3: ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆగస్టు16వ తేదీ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3)ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం నాలుగు దశల్లో 17 నిమిషాలపాటు జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ సోమనాథన్ ప్రకటించారు.
చిన్న చిన్న శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు తయారు చేసిన ఎస్‌ఎస్‌ఎల్‌వీని ఇస్రో మూడోసారి ప్రయోగించింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్‌ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి.
ఇస్రో తొలిసారిగా 2022లో ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ మిషన్ ఫెయిల్ అయింది. రెండోసారి 2023 ఫిబ్రవరి నెలలో చేపట్టిన మిషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మూడోసారి చేపట్టిన ఈ ప్రయోగంలో 175 కిలోల బరువు ఉన్న ఈవోఎస్08 ద్వారా ఏకంగా 21 కొత్త టెక్నాలజీలను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.