Skip to main content

SSLV D-3: ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3 ప్రయోగం సక్సెస్‌.. కక్ష్యలోకి సురక్షితంగా..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమ్ముల పొదిలోకి మరో రాకెట్‌ చేరింది.
ISRO successfully launches SSLV-D3 With EOS-08 Earth Observation Satellite

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) డీ–3 ప్రయోగాన్ని ఆగ‌స్టు 16వ తేదీ ఉదయం విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం ద్వారా 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈవోఎస్‌–08), ఎస్‌ఆర్‌–0 డెమోశాట్‌ అనే రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. 

ఈ ప్రయోగానికి ఆగ‌స్టు 16వ తేదీ తెల్లవారుజామున 2.47 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఆరున్నర గంటలపాటు కౌంట్‌డౌన్‌ అనంతరం ఉదయం 9.17 గంటలకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3 రాకెట్‌ నింగివైపునకు దూసుకెళ్లింది. రాకెట్‌లోని మొత్తం నాలుగు దశలు సక్రమంగా పనిచేయడంతో 16.56 నిమిషాల్లోనే ప్రయో­గం విజయవంతంగా ముగిసింది. భూమికి 475 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్‌ (సూర్య సమకాలిక కక్ష్య)లో 37.2 డిగ్రీల వృత్తాకారపు కక్ష్యలోకి విజయవంతంగా ఉప గ్రహాలను ప్రవేశపెట్టారు. 

మొదట ఈవోఎస్‌–08ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌–0 డెమోశాట్‌ అనే చిన్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఇస్రో చిన్న తరహా ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా గుర్తింపు పొందింది.   

Glide Bomb: గ్లైడ్ బాంబ్ ‘గౌరవ్‌’ తొలి ప్ర‌యోగం స‌క్సెస్‌

ఉపయోగాలు ఇవే..
ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌–08లో ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్‌ఫ్రారెడ్, గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం–రిప్లెక్టోమెట్రీ, ఎస్‌ఐసీ యూవీ డొసిమీటర్‌ అనే మూడు రకాల పేలోడ్స్‌ను అమర్చారు. వీటి ద్వారా ఈ ఉపగ్రహం భూమి మీద వాతావరణ పరిస్థితులు(భౌగోళిక–పర్యావరణం)పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సమాచారాన్ని చేరవేస్తుంది. ముఖ్యంగా అటవీ, వ్యవసాయం, భూమి స్వభావం, నీరు అధ్యయనాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం ఒక్క ఏడాదే సేవలు అందిస్తుంది.  

వాణిజ్యపరంగా కూడా వినియోగిస్తాం..
ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3 ప్రయోగం అనం­తరం ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ మిషన్‌ కంట్రో­ల్‌ సెంటర్‌ నుంచి మాట్లా­డుతూ ఇస్రోలో సరికొత్తగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ చేరిందని చెప్పారు. ఇప్పటిదాకా ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 వంటి ఐదు రకాల రాకెట్లు మాత్రమే ఉండేవని తెలిపారు. 

2022 ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3 రాకెట్‌ విఫలం కావడంతో అందులో ఏర్పడిన లోపాలను సరిచేసి.. ముందస్తు పరీక్షలు నిర్వహించి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ–3 ప్రయోగానికి సిద్ధమయ్యామన్నారు. దీనికోసం అహర్నిశలు పనిచేసిన ఇస్రోలోని అన్ని విభాగాలకు అభినందనలు తెలిపారు. వాణిజ్యపరంగా కూడా ఈ రాకెట్‌ను వినియోగిస్తామని చెప్పారు.  

Radio Signal: ఆశ్చర్యం.. అంతరిక్షం నుంచి అంతుచిక్కని రేడియో సిగ్నల్స్‌

Published date : 17 Aug 2024 03:40PM

Photo Stories