IAF: భారత వాయుసేన అరుదైన రికార్డు.. కార్గిల్‌లో C130-J యుద్ధ విమానం నైట్ ల్యాండింగ్..
సముద్ర మట్టానికి ఏకంగా 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్‌డ్ ల్యాండ్ గ్రౌండ్‌పై సి–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రి పూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీనికి సంబంధించి వాయుసేన ‘ఎక్స్’లో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఐఏఎఫ్ బాహుబలిగా చెప్పే ఈ విమానం పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) సమీపంలోని ఈ ఎయిర్ స్ట్రిప్‌పై రాత్రి సమయంలో దిగడం ఇదే తొలిసారి. గరుడ్ కమాండోలకు శిక్షణలో భాగంగా ఇటీవలే ఈ విన్యాసం నిర్వహించినట్లు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. అంతేగాక ఐఏఎఫ్ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు వివరించాయి.
నిజానికి రక్షణ శాఖలో రవాణా విమానాన్ని ఇలా రాత్రి పూట ల్యాండింగ్ చేయడం అత్యంత అరుదు. కొండలపై ఉన్న రన్‌వేపై భారీ విమానాన్ని క్షేమంగా దించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. హిమాలయ పర్వతాల్లో వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ర్‌స్టిప్‌లు సేవలందిస్తున్నాయి. ఎల్‌ఏసీ సమీపంలో దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఏఎల్‌జీ) సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్‌ఫీల్డ్ కావడం గమనార్హం. వాయుసేన వద్ద 12 సి–130జే విమానాలున్నాయి. ఇవి సైనికుల తరలింపు, సహాయక సామగ్రి రవాణాలో ఉపయోగపడుతున్నాయి.