Marsపై అడుగిడేందుకు.. మనకు రక్షణ కవచం
ఇలాంటి సమయంలో స్పేస్ షిప్‌లు.. మార్స్‌పై దిగేప్పుడు పుట్టే వేడిని తట్టుకోవడానికి, మెల్లగా ల్యాండ్ కావడానికి వీలయ్యే రక్షణ ఏర్పాట్లు కావాలి. ఈ క్రమంలోనే నాసా ఫ్లయింగ్ సాసర్‌లా కనిపించే ఓ ప్రత్యేక ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను రూపొందించింది. బుధవారం దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఈ హీట్ షీల్డ్ ఏంటి, దాని ప్రాధాన్యత, భవిష్యత్తులో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
Also read: Chief Justice: వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా వీడ్కోలు సభలో సీజేఐ యు.యు.లలిత్
వాతావరణం ఘర్షణ నుంచి..
అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లు, వ్యోమనౌకలు గంటకు 25 వేల కి.మీ.కిపైగా వేగంతో ప్రయాణిస్తుంటాయి. తిరిగి భూవాతావరణంలోకి వచ్చేప్పుడూ అంతే వేగంతో ప్రవేశిస్తాయి. ఈ సమయంలో వాతావరణ ఘర్షణ వల్ల వాటి ఉపరితలంపై వేల డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత పుడుతుంది. దీనిని తట్టుకునేందుకు రాకెట్లు, స్పేస్ షిప్‌ల ఉపరితలంపై హీట్ షీల్డ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిరామిక్ టైల్స్ వాడతారు.
మార్స్‌పైకి వెళ్లాలంటే..
భూమితోపాటు అంగారకుడు (మార్స్), శుక్రుడు (వీనస్) వంటి గ్రహాలపైనా వాతావరణం ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యోమనౌకలు మార్స్‌పై దిగాలంటే దాని వాతావరణం ఘర్షణను ఎదుర్కోవాలి. అదే సమయంలో సున్నితంగా ల్యాండింగ్ కావడం కోసం వేగాన్ని త్వరగా తగ్గించుకోవాలి. ఇప్పటివరకు చంద్రుడు, మార్స్‌పైకి రోవర్లను పంపినప్పుడు ల్యాండింగ్ కోసం ప్యారాచూట్లను వాడారు. చిన్నవైన రోవర్లకు అవి సరిపోయాయి. కానీ మానవసహిత ప్రయోగాలకు వాడే వ్యోమనౌకలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో వేడిని ఎదుర్కోవడం, వేగాన్ని తగ్గించుకోవడానికి పరిష్కారంగా నాసా శాస్త్రవేత్తలు ‘లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్‌ఫ్లాటబుల్ డీసెలరేటర్ (లోఫ్టిడ్)’ ప్రయోగాన్ని చేపట్టారు. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్ అంటే.. మొదట చిన్నగా ఉండి, కావాలనుకున్నప్పుడు గాలితో ఉబ్బి, పెద్దగా విస్తరించే ఉష్ణ రక్షక కవచం అని చెప్పుకోవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
వ్యోమనౌకకు ముందు భాగాన ఈ ప్రత్యేక పరికరాన్ని అమర్చుతారు. మార్స్‌పైగానీ, భూవాతావరణంలోకిగానీ వ్యోమనౌక ప్రవేశించినప్పుడు ఇది విచ్చుకుంటుంది. వ్యోమనౌక ముందు గొడుగులా ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణం నేరుగా వ్యోమనౌకను తాకకుండా ఈ హీట్‌షీల్డ్ అడ్డుకుంటుంది. ఇది సుమారు 20 అడుగుల వెడల్పుతో ఉండటంతో వాతావరణం ఒత్తిడికి వ్యోమనౌక వేగం కూడా తగ్గుతుంది. వేగం బాగా తగ్గాక చివరన ప్యారాచూట్‌ను వినియోగిస్తారు. దీనితో సున్నితంగా ల్యాండింగ్ అవుతుంది.
ప్రయోగాత్మకంగా..
సోమవారం అమెరికాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అట్లాస్–వి రాకెట్ ద్వారా మరో ఉపగ్రహంతోపాటు ‘లోఫ్టిడ్’ను ప్రయోగించనున్నారు. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లాక దీనిని భూమివైపు వదిలేస్తుంది. సుమారు గంటకు 35వేల కిలోమీటర్ల వేగంతో అది భూమివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. తర్వాత ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? ఒత్తిడి ఎంత పడుతోంది? ఎంతమేర ఉష్ణోగ్రత పుడుతోందన్న వివరాలను పరిశీలించేందుకు ఇందులో ప్రత్యేకమైన సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ డేటా ఆధారంగా ‘లోఫ్టిడ్’కు తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేవలం హీట్‌షీల్డ్‌ను మాత్రమే ప్రయోగిస్తున్నారు. విజయవంతమైతే వ్యోమనౌకలకు అమర్చి పంపుతారు. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి చేసే అన్ని రకాల ప్రయోగాల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 5th కరెంట్ అఫైర్స్
కొలంబియా ప్రమాదమే ఉదాహరణ
2003లో నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ అంతర్జాతీయ అంతరిక్షం (ఐఎస్‌ఎస్) నుంచి తిరిగి వస్తూ పేలిపోయింది. అందులో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా సహా ఏడుగురు వ్యోమగాములు మృతిచెందారు. ఈ ప్రమాదానికి కారణం స్పేస్ షటిల్ ఎడమవైపు రెక్కపై ఉన్న హీట్ షీల్డ్ కొంతమేర దెబ్బతినడమే. అంతకుముందు స్పేస్ షటిల్ అంతరిక్షంలోకి వెళ్తున్న సమయంలోనే.. దానికి అనుబంధంగా ఉన్న రాకెట్ ట్యాంక్ ఇన్సులేటింగ్ ఫోమ్ చిన్న ముక్క విడిపోయి స్పేస్ షటిల్ రెక్కపై ఉన్న హీట్ షీల్డ్‌కు తగిలింది. హీట్ షీల్డ్‌గా అమర్చిన టైల్స్‌లో పగులు వచి్చంది.
చిన్న పగులుతో.. పెద్ద ప్రమాదం
కొలంబియా షటిల్ భూమికి తిరిగివచ్చేప్పుడు ధ్వని వేగానికి 20 రెట్లకుపైగా వేగంతో.. అంటే సుమారు గంటకు 25 వేల కిలోమీటర్లకుపైగా వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో 1,500 సెంటీగ్రేడ్‌లకుపైగా వేడి పుట్టింది. కానీ షీట్ షీల్డ్ టైల్స్‌లో పగులు కారణంగా ఆ వేడి లోపలి భాగానికి చేరి.. రెక్కలోని భాగాలు దెబ్బతినడం మొదలైంది. కాసేపటికే స్పేస్ షటిల్ పేలి ముక్కలైపోయింది. హీట్ షీల్డ్‌లో చిన్న పగులు ఉన్నా ఇంత ఘోరమైన ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలోనే నాసా శాస్త్రవేత్తలు.. ఇతర గ్రహాలపై దిగేప్పుడు స్పేస్ షిప్‌లకు హీట్ షీల్డ్‌గా ఉండేందుకు, అదే సమయంలో వేగాన్ని తగ్గించి సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు తోడ్పడే ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను అభివృద్ధి చేస్తున్నారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP