Submarine: జలాంతర్గామి ‘సింధుధ్వజ్’ నిష్క్రమణ
భారత నౌకాదళంలో మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్ సింధుధ్వజ్ సబ్‌మెరైన్ సేవల నుంచి నిష్క్రమించింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా సీఎన్‌ఎస్ రోలింగ్ ట్రోఫీ అందుకున్న ఏకైక సబ్‌మెరైన్ ఇది. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రంలో సింధుధ్వజ్‌కు జూలై 17న సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఆధ్వర్యంలో డీ కమిషనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సింధుధ్వజ్‌లో విధులు నిర్వర్తించిన 15 మంది మాజీ కమాండింగ్ అధికారులు, 26 మంది క్రూ వెటరన్స్‌కు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారు చేసిన సింధుఘోష్ క్లాస్ సబ్‌మెరైన్ల నిర్మాణానికి సింధుధ్వజ్ దిక్సూచీగా నిలిచిందని వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా కొనియాడారు. 35 ఏళ్ల పాటు సుదీర్ఘంగా దేశ రక్షణ కోసం సేవలందించటం గర్వించదగిన విషయమన్నారు. ఈ డీకమిషనింగ్ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు పాల్గొన్నారు.
Also read: P17A ‘దునగిరి’ యుద్ధనౌక జాతికి అంకితం