Skip to main content

Andhra Pradesh High Court: ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

AP High Court Judges

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఎంపికైన న్యాయమూర్తులు ఫిబ్రవరి 14న ప్రమాణం చేశారు. నూతన న్యాయమూర్తులు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాత చేత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ ఏడుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కి చేరింది.

జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి
1966 జూన్‌ 3న జన్మించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అనేక కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. 2019లో రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులై ఇటీవలి వరకు ఆ పోస్టులో కొనసాగారు.

జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
1967 జూలై 1న జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు,  ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎల్‌ పూర్తి చేశారు. హైకోర్టులో ఆంధ్ర ప్రాంత మునిసిపాలిటీలకు, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.

జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌
1964 మే 28న జన్మించారు. ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా, నాగార్జున వర్సిటీ నుంచి మాస్టర్‌ లా పొందారు. సుప్రీం కోర్టులో పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా, రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టెలివిజన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. నాగాలాండ్‌ ప్రభుత్వం తరఫున కేసులు వాదించారు. 

జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు
1967 ఆగస్టు 3న జన్మించారు. విశాఖపట్నం ఎన్‌బీఎం కాలేజీలో బీఎల్‌ చదివారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వీవీఎస్‌ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో ఆయన వద్ద జూనియర్‌గా వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్‌ చేశారు. 

జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి
1970 ఫిబ్రవరి 5న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదివారు. తొలుత తాడేపల్లిగూడెంలో, 1997లో హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 

జస్టిస్‌ రవి చీమలపాటి
1967 డిసెంబర్‌ 4న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసులు వాదించారు. పంచాయతీరాజ్‌ శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, వివిధ ప్రభుత్వ సంస్థలకు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. 

జస్టిస్‌ వడ్డిబోయన సుజాత
1966 సెప్టెంబర్‌ 10న జన్మించారు. ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌), ఎంఏ (సైకాలజీ), ఎల్‌ఎల్‌ఎం చదివారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌కు ప్యానెల్‌ అడ్వొకేట్‌గా, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ఇటీవలి వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు.

చ‌దవండి: రాష్ట్రంలోని ఏ నగరంలో అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Feb 2022 03:57PM

Photo Stories