Murali Mohan Rao: రచయిత ‘ఇలపావులూరి’ హఠాన్మరణం
తన తండ్రి సుబ్బారావు రచించిన హనుమత్ శతకం మూడో ముద్రణ గ్రంథ ఆవిష్కరణకు, అన్న నాగేంద్ర మనోహర్ కుటుంబం, మురళీమోహన్‌రావు కుటుంబం ఆదివారం అద్దంకి వచ్చాయి. కార్తీక మాసం కావడంతో కొత్తపట్నం సముద్ర తీరానికి వెళ్లి సముద్ర స్నానం చేసి అద్దంకి పట్టణంలోని తన ఇంటికి వెళుతుండగా గుండెపోటు రావడంతో ఒంగోలు కిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతదేహాన్ని హైదరాబాద్‌లోని నివాసానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
మురళీమోహన్‌రావు స్వగ్రామం అద్దంకి మండలం వేలమూరిపాడు. అయితే అద్దంకి పట్టణంలో స్థిరపడ్డారు. తండ్రి సుబ్బారావు తెలుగు పండిట్‌గా పనిచేసి పలు గ్రంథాలు రచించారు. మురళీమోహనరావు.. 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి రేస్ కోర్టులో స్టెనోగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు.
నాలుగు సినిమాలకు కథలు..
మురళీమోహన్‌రావు కథా, నవలా రచయితగా, సినీ మాటల రచయితగా ప్రఖ్యాతి పొందారు. హాస్యరస ప్రధాన కథలను ఎక్కువగా రాసేవారు. 250 కథలు, 6 సీరియల్ నవలలు రాసి పలు అవార్డులు పొందారు. ఆయన కథలు, నవలలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సినీ రంగాలకు సంబంధించి 1,500 వరకు వ్యాసాలు రాశారు. కితకితలు, ఎలుకా మజాకా వంటి నాలుగు సినిమాలకు కథలు, సూర్యుడు సినిమాకు మాటలు అందించారు. ఆయన రాసిన 20 కథలను కన్నడలోకి అనువదించారు. ‘సాక్షి’తో పాటు పలు టీవీ చానల్స్‌లో వక్తగా, చర్చా వేదికల్లో పాల్గొని రాజకీయ విశ్లేషకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు.