superstar krishna passed away : సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూత.. సినిమాల్లోకి రావడానికి కారణం ఇదే..!
తెనాలి నుంచి తెరపైకి..
కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. స్వస్థలం తెనాలి సమీపంలోని బుర్రిపాలెం. నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి దంపతులకు 1943 మే 31న జన్మించారు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు. పిల్లల చదువు కోసం తొలుత తెనాలి, ఆ తర్వాత ఏలూరులో సెటిల్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగుకు చెందిన ఇందిరాదేవిని కృష్ణ వివాహమాడారు. 1965 అక్టోబర్ 13న పెద్ద కొడుకు రమేష్ బాబు, ఆ తర్వాత పద్మజ, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని.. ఇలా ఐదుగురు సంతానం ఉన్నారు. కాగా నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ 1969లో తిరుపతిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే విజయనిర్మలకు నరేశ్ అనే కొడుకు ఉన్నాడు.
సినిమాల్లోకి రావడానికి కారణం ఇదే..!
1951.. తెనాలి రత్నా టాకీస్... గోడపై ‘పాతాళ భైరవి’ సినిమా పోస్టర్. ఎన్టీఆర్–ఎస్వీఆర్ బొమ్మ ఎనిమిదేళ్ల కుర్రాడిని ఆకర్షించింది. మళ్లీ మళ్లీ చూశాడు.. ఆ సినిమా తర్వాత మరెన్నో సినిమాలు వచ్చినా, ఆ సినిమా పోస్టరు మాత్రం ఆ బాలుడి మదిలో నిలిచిపోయింది. కొన్నేళ్ల తర్వాత అదే తెనాలి. ఆ కుర్రోడే నడుచుకుంటూ వెళుతున్నాడు. ఓ ఇంటి దగ్గర గుమిగూడిన జనం.. కాళ్లకు బ్రేకులు పడ్డాయి. వందలమంది జనం. ఎవరి కోసమో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఏమిటోనని తానూ ఆ గుంపులో చేరిపోయాడు. అంతలో ఆ ఇంటిలోంచి ఏఎన్నార్ బయటకి వచ్చారు. ఒక్కటే కేకలు, ఈలలు.. దేవుణ్ణి చూసినట్టుగా, జన్మ ధన్యమైందన్నంతగా జనం పరవశించిన సన్నివేశమది. సినిమా హీరోకి ఇంతటి ప్రజాదరణ ఉంటుందా? అని ఆశ్చర్యపోయాడు ఆ కుర్రాడు. ఎప్పటికైనా తానూ సినిమా హీరో కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు.
చిన్ననాటి కల సాకారం..
బీఎస్సీ పూర్తి చేసిన కృష్ణ సినిమాల్లో నటించాలనే తన చిన్ననాటి కలను నిజం చేసుకోవడమే కాకుండా ఏకంగా 365 సినిమాల్లో నటించారు. 1965లో విడుదలైన ‘తేనె మనసులు’ (ఆదుర్తి సుబ్బారావు డైరెక్టర్) కృష్ణ తొలి సినిమా. 1967లో బాపు దర్శకత్వంలో వచి్చన ‘సాక్షి’ చిత్రంలో కృష్ణ సోలో హీరోగా నటించారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. రోజుకు రెండు మూడు షిఫ్టులు పనిచేసేవారు. తెలుగులో అతి తక్కువ కాలంలో అత్యధిక సినిమాల్లో నటించిన స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. 16 సినిమాలకు దర్శకత్వం (తెలుగులో 14, హిందీలో 2) వహించారు. 1970లో తన సోదరులతో కలిసి ‘పద్మాలయా పిక్చర్స్’ చిత్రనిర్మాణ సంస్థను ఆరంభించి, ఎన్నో సినిమాలు నిర్మించారు. కొంతకాలం ఎగ్జిబిటర్‌గా, డి్రస్టిబ్యూటర్‌గానూ సేవలందించారు. పద్మాలయా పిక్చర్స్ 1980లో హిందీ చిత్రరంగంలోనూ ప్రవేశించింది. ఆయన నటించిన చివరి సినిమా శ్రీశ్రీ (2016).
ఎన్నో విజయాలు.. మరెన్నో అవరోధాలు..
నాలుగున్నర దశాబ్దాల సినీ జీవితంలో కృష్ణ ఎన్నో విజయాలు, మరెన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ పడిలేచి మరింత బలంగా జనం ముందుకొచ్చి తనకు తానే సాటి అనిపించుకున్నారు. సినిమా ప్రయోగాలకూ, సాహసానికీ సూపర్‌స్టార్ ఒక సింబల్. ‘తేనె మనసులు’ తొలి సాంఘిక రంగుల చిత్రమైతే, ఆయన నటించిన వందో చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ తొలి సినిమా స్కోప్‌గా రూపొందింది. ఆయన ద్విపాత్రాభినయం చేసి, దర్శకత్వం వహించిన ‘సింహాసనం’ తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా. తన మూడో చిత్రం ‘గూఢచారి 116’ తోనే తెలుగులో జేమ్స్‌బాండ్ సినిమాలకు ఆద్యుడయ్యారు. ఆ తర్వాత వచ్చిన ‘ఏజెంట్ గోపి’, ‘రహస్య గూఢచారి’, ‘జేమ్స్‌బాండ్ 007’ సినిమాలు ఆయన్ను ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్’గా నిలిపాయి. ‘మోసగాళ్లకు మోసగాడు’తో కౌబాయ్ తరహా సినిమాల్లోనూ తనకు తిరుగులేదని చాటారు. ఎన్టీఆర్ చేద్దామనుకుని ఆ తర్వాత వద్దనుకున్న ‘అల్లూరి సీతారామరాజు’ను పద్మాలయా బ్యానర్‌పై నిర్మించి, నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అందరి ప్రశంసలూ అందుకున్నారు. అదే సాహసంతో విజయనిర్మల దర్శకత్వంలో ‘దేవదాసు’ తీశారు. ఏఎన్‌ఆర్ ‘దేవదాసు’ అంతటి విజయం రాకున్నా, కృష్ణ ‘దేవదాసు’లోని పాటలన్నీ ఆదరణ పొందాయి.
మల్టీస్టారర్ సినిమాల్లోనూ..
మల్టీస్టారర్ సినిమాల్లోనూ కృష్ణ నటించారు. తన అభిమాన నటుడు ఎనీ్టఆర్‌తో కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆయనతో కృష్ణ తీసిన సొంత చిత్రం ‘దేవుడు చేసిన మనుషులు’ ఘన విజయం అందుకుంది. ఎనీ్టఆర్ అభిమాని అయినప్పటికీ ఆయనతో వృత్తిపరంగా పోటీపడటంలో ఎప్పుడూ ముందుండేవారు. ఎనీ్టఆర్ ‘దాన వీర శూర కర్ణ’, కృష్ణ ‘కురుక్షేత్రం’ సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. అక్కినేనితో ‘అక్కాచెల్లెళ్లు’ నుంచి ‘గురుశిష్యులు’ వరకు నటించారు. శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పలు చిత్రాల్లో స్క్రీన్ పంచుకున్నారు. తర్వాతి తరంలోని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతోనూ నటించారు. అప్పట్లో సినిమా పత్రిక ‘జ్యోతిచిత్ర’ నిర్వహించిన బ్యాలెట్‌లో వరుసగా అయిదేళ్లపాటు సూపర్‌స్టార్‌గా ఎంపికయ్యారు. అప్పట్నుంచీ సూపర్‌స్టార్‌గా కొనసాగారు.
సూపర్‌స్టార్ అందుకున్న అవార్డులు..
‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయ అవార్డు రాగా, ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు, 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్’ పురస్కారంతో సత్కరించింది.
రాజీవ్‌గాంధీ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి..
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లిన కృష్ణకు.. రాజీవ్ గాం«దీతో ఏర్పడిన పరిచయం ఆయన్ను రాజకీయాలవైపు తీసుకొచి్చంది. 1989 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఘటన తీవ్రంగా కలచివేయడంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత షూటింగ్‌లతో మళ్లీ బిజీ అయ్యారు.
ఘట్టమనేని వంశంలో వరుస విషాదాలు..
విజయనిర్మల 2019 జూన్ 27న మరణించారు. రమేష్ బాబు 2022 జనవరి 8న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కృష్ణ భార్య ఇందిరా దేవి కూడా ఈ ఏడాది సెపె్టంబర్ 28న మృతి చెందారు. ఇలా వరుసగా తీవ్ర విషాదాలు ఎదుర్కొన్నారు కృష్ణ.