Jacinda Ardern: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా రాజీనామా
ప్రధానమంత్రిగా ఫిబ్రవరి 7 తన ఆఖరి రోజని కన్నీళ్లని అదిమిపెట్టుకుంటూ జనవరి 19వ తేదీ లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో ప్రకటించి ప్రపంచ దేశాలను షాక్‌కి గురి చేశారు. ‘‘నేనూ మనిషినే. ఎంత కాలం చెయ్యగలమో అంతే చేస్తాం. అప్పుడు సమయం వస్తుంది. ఇప్పుడు నా సమయం వచ్చింది. ఒక దేశాన్ని నడిపించడం సర్వోన్నతమైన పని. అంతే సవాళ్లతో కూడుకున్నది. అనూహ్యంగా వచ్చే సవాళ్లను, పదవితో సంక్రమించిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో సమర్థంగా నిర్వహించలేనప్పుడు ఎవరూ ఆ పదవిలో ఉండకూడదు. ఉండలేరు కూడా. ప్రధాని పదవిలో ఉండడానికి మీరు సరైన వ్యక్తా, కాదా అన్నది తెలుసుకోవడం కూడా మీ బాధ్యతే. ఇంక ఈ పదవికి నేను న్యాయం చెయ్యలేనని నాకు అనిపిస్తోంది. అందుకే తప్పుకుంటున్నాను. నేనేదో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని ఈ పదవిని వీడడం లేదు. ఆ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే సత్తా మనకుంది’’ అని పార్టీ సభ్యులతో ఆమె చెప్పారు.
Mukarram Jah Bahadur: 8వ నిజాం ముకరంజా బహదూర్ కన్నుమూత
ఎందరో మహిళలకు స్ఫూర్తి
జెసిండా 2017లో 37 ఏళ్లకే ప్రధాని అయ్యారు. అత్యంత పిన్న వయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచమంతటా రైట్ వింగ్ ప్రభుత్వాలున్న నేపథ్యంలో వామపక్ష భావజాలం కలిగిన ఆమె కొత్త తరానికి ప్రతినిధిగా నిలిచారు. ప్రధానిగా ఉంటూనే బిడ్డకు జన్మనిచ్చారు. కుటుంబ బాధ్యతలు కూడా ముఖ్యమేనని ఈ తరం అమ్మాయిలకు సందేశమిచ్చారు. పొత్తిళ్లలో పాపతోనే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సమావేశంలో పాల్గొన్నారు. న్యూజిలాండ్ చరిత్రలోనే చీకటి రోజుల్ని 2019 మార్చిలో ఎదుర్కొన్నారు. క్రిస్టిచర్చ్‌లో రెండు మసీదులపై ఒక దుండగుడు దాడి చేసి ప్రార్థనలు చేసుకుంటున్న 51 మంది ముస్లింల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసినప్పుడు చలించిన హృదయంతో బాధితుల పట్ల ఆమె చూపించిన దయ, సానుభూతి ప్రజలందరి మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
కాల్పులు జరిగిన కొద్ది వారాల్లోనే సెమీ ఆటోమేటిక్ తుపాకుల్ని నిషేధిస్తూ ఆమె కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఇక కరోనా సంక్షోభాన్ని ఆమె ఎదుర్కొన్న తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కరోనా వైరస్ సరిహద్దుల్లోనే కట్టడి చేయడానికి ఆమె తీసుకున్న చర్యలకు అందరూ భేష్ అన్నారు. వాతావరణ మార్పులే ప్రపంచ దేశాలకు అసలైన సవాల్ అని నమ్మిన ఆమె కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించడానికి 2050ని లక్ష్యంగా నిర్ణయిస్తూ విధానపరమైన నిర్ణయాలు ప్రకటించారు. ప్రధానిగా ఆమె తెగువ, శక్తి సామర్థ్యాలకు ప్రజలు ఫిదా అయ్యారు. 2020 ఎన్నికల్లో రికార్డు విజయం ఆమెకు కట్టబెట్టారు.