Jiang Zemin: చైనా మాజీ అధినేత జియాంగ్ జెమిన్ మృతి
96 ఏళ్ల జెమిన్ కొంతకాలంగా లుకేమియా, అవయవాల వైఫల్యంతో బాధపడుతున్నారు. గతంలో మేయర్‌గా సేవలందించిన షాంఘై నగరంలోనే ఆయన తుదిశ్వాస విడిచారని చైనా అధికారిక షిన్‌హువా వార్తా సంస్థ వెల్లడించింది.
నిరంకుశ వైఖరి..
1993 మార్చి 27 నుంచి 2003 మార్చి 15 దాకా పదేళ్లపాటు చైనాను పరిపాలించిన జియాంగ్ జెమిన్ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మార్కెట్ ఆధారిత సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు. బ్రిటిష్ పాలనలో ఉన్న హాంకాంగ్‌ను 1997లో చైనాలో తిరిగి విలీనం చేశారు. జెమిన్ చొరవతో 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో చైనా సభ్యదేశంగా చేరింది. దాంతో విదేశీ పెట్టుబడిదారులు చైనాలో అడుగుపెట్టారు. అభివృద్ధిని కాంక్షించిన జియాంగ్ జెమిన్ పరిపాలనలో నిరంకుశంగా వ్యవహరించారన్న అపవాదు మూటగట్టుకున్నారు. మానవ హక్కుల సంఘాలు, కార్మిక, ప్రజాస్వామ్య అనుకూల సంఘాల నేతలు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు. వారిని జైలుపాలు చేశారు. తన అధికారానికి ముప్పుగా మారిందన్న అనుమానంతో ‘ఫలూన్ గాంగ్’ అనే ఆధ్యాత్మిక ఉద్యమాన్ని నిషేధించారు.
సబ్బుల కంపెనీలో కార్మికుడిగా..
జియాంగ్ జెమిన్ 1926 ఆగస్టు 17న చైనా తూర్పు ప్రాంతంలోని యాంగ్‌జై సిటీలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. 1947లో షాంఘైలోని జియాటోంగ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ మెషినరీ డిపార్టుమెంట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తొలుత ఫుడ్ ఫ్యాక్టరీలో, తర్వాత సబ్బుల తయారీ పరిశ్రమలో, ఆటోమొబైల్ ప్లాంట్‌లో పనిచేశారు. 1966 నుంచి 1976 దాకా కారి్మక సంఘాల్లో సభ్యుడిగా చురుగ్గా సేవలందించారు. కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుల దృష్టిని ఆకర్శించారు. పార్టీలో ఆయన పరపతి పెరిగిపోయింది. 1985 నుంచి 1989 దాకా షాంఘై మేయర్‌గా పనిచేశారు. తియానన్మెన్ స్క్వేర్‌లో విద్యార్థులపై సైన్యం దాడి తర్వాత 1989లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా జెమిన్ బాధ్యతలు చేపట్టారు. 2002 దాకా ఈ పదవిలో కొనసాగారు. 1989 నుంచి చైనా మిలటరీ కమిషన్ చైర్మన్‌గా కొనసాగిన ఆయన 2004లో ఈ పదవి నుంచి తప్పుకున్నారు. చైనా ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఎదుగుదల వెనుక జియాంగ్ జెమిన్ ప్రోత్సాహం ఎంతో ఉంది.
Inspirational Story : ఇరవై ఒక్కవేల పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. నా సక్సెస్ సిక్రెట్ ఇదే..