Skip to main content

Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళా.. ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకంటారు..?

జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది.
Why Prayagraj Called Land of Pilgrimages?

ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో నగరంలోని ప్రతీవీధి కొత్త కళను సంతరించుకుంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని పురాతన ఆలయాలు, ఆశ్రమాలకు మరమ్మతులు చేశారు. కొన్ని చోట్ల కారిడార్లు నిర్మించారు.  శిథిలావస్థకు చేరిన ఆలయాలను పునరుద్ధరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే, మహాకుంభమేళాకు వచ్చే భక్తులు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మైమరచిపోవడం ఖాయమనినిపించేలా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లోని భరద్వాజ ఆశ్రమం ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పర్యాటక శాఖ కారిడార్‌ను నిర్మించింది. ఈ కారిడార్‌కు ఇరువైపులా  మహర్షి భరద్వాజునికి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఈ ఆశ్రమానికి వచ్చిన చిత్రాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

సీతారాములకు ఇక్కడి నుండే భరద్వాజ మహర్షి చిత్రకూట్‌కు వెళ్లే మార్గం చూపాడని చెబుతారు. అలాగే లంకలో విజయం సాధించిన శ్రీరాముడు ఇక్కడికి వచ్చి భరద్వాజుని ద్వారా సత్యనారాయణుని కథను విన్నాడని చెబుతారు. ఇలాంటి ఎన్నో పురాణగాథలు ప్రయాగ్‌రాజ్‌తో ముడిపడి ఉన్నాయి.

Maha Kumbh Mela: మహా కుంభమేళాకు ఏర్పాట్లు.. కుంభమేళా అంటే ఏమిటి..? దేశంలో నాలుగు చోట్ల మాత్రమే..!

ఈ ప్రాంతం పేరు తీర్థరాజం అని..
ఈ ప్రదేశానికున్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మ దేవుడు ఈప్రాంతాన్ని తీర్థరాజం అని పిలిచాడని చెబుతారు. దీని అర్థం అన్ని పుణ్యక్షేత్రాలకు రాజు. ఈ ప్రదేశాన్ని వేదపురాణాలు, రామాయణం, మహాభారతాలలో ప్రయాగగా పేర్కొన్నారు. పద్మపురాణం ‍ప్రకారం ప్రయాగలోని గంగా యమునా తీరంలో స్నానం చేస్తే కోట్లాది అశ్వమేధ యాగాల ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. 

ఈ తీర్థరాజం గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శేష భగవానుని సూచనల మేరకు బ్రహ్మ దేవుడు అన్ని తీర్థయాత్రల పుణ్యాన్ని తూచాడు. తీర్థ ప్రదేశాలు, ఏడు సముద్రాలు, ఏడు ఖండాలు ఒక వైపు ఉంచారు. మరోవైపు తీర్థరాజం ప్రయాగను ఉంచారు. ఈ నేపధ్యంలో తీర్థరాజం ప్రయాగ అత్యంత బరువుతో భూమిని తాకిందట.

కాగా పర్యాటక శాఖ ప్రయాగ్‌రాజ్‌లో పలు ఆలయాల పునరుద్ధరణకు ఎర్ర ఇసుకరాయిని వినియోగించింది. ఇవి ఎంతో మన్నికైన రాళ్లుగా గుర్తింపుపొందాయి. మరోవైపు స్థానిక అధికారులు కుంభమేళా సందర్భంగా నగరంలోని పలుప్రాంతాల్లో 10 సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన బుక్‌లెట్లను భక్తులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. 

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 07 Jan 2025 10:05AM

Photo Stories