Demonetisation: పెద్ద నోట్ల రద్దు సరైనదే.. సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..
‘‘ఈ నిర్ణయం తీసుకునే ముందు కేంద్రానికి, ఆర్‌బీఐకి మధ్య ఆర్నెల్ల పాటు సంప్రదింపులు జరిగాయి. కనుక పిటిషనర్లు ఆరోపించినట్టుగా నోట్ల రద్దు నిర్ణయ ప్రక్రియలో న్యాయ, రాజ్యాంగపరమైన లోపాలేవీ చోటుచేసుకోలేదు’’ అని స్పష్టం చేసింది. నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను కొట్టేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు జనవరి 2న మెజారిటీ తీర్పు వెలువరించింది. ‘‘దొంగ నోట్లకు, నల్లధనానికి, ఉగ్రవాదానికి నిధులకు అడ్డుకట్ట వేసే ఉదాత్త లక్ష్యాలతో తీసుకున్న ఆర్థిక విధానపరమైన నిర్ణయమిది. వెనక్కు మరల్చడం వీలు కాని ఇలాంటి నిర్ణయాలను కేవలం వాటిని తీసుకునేందుకు అనుసరించిన ప్రక్రియ ఆధారంగా అసమంజసమని తేల్చి కొట్టేయలేం’’ అని ధర్మాసనానికి సారథ్యం వహించిన జస్టిస్ ఎస్.ఎ.నజీర్‌తో పాటు బి.ఆర్.గవాయ్, ఎ.ఎస్.గోపన్న, వి.రామసుబ్రమణియన్ పేర్కొన్నారు.
అంతేగాక ఇలాంటి నిర్ణయాలు సమంజసమైనవేనా, ఆశించిన ఫలితాలిచ్చాయా అనే అంశాలపై న్యాయ వ్యవస్థ సమీక్ష జరపజాలదన్నారు. రద్దు చేసిన నోట్ల మార్పిడికి ఇచ్చిన 52 రోజుల గడువు సమంజసమైనదేనని అభిప్రాయపడ్డారు. ధర్మాసనం తరఫున మెజారిటీ తీర్పును జస్టిస్ గవాయ్ చదివి వినిపించారు. ధర్మాసనంలోని ఐదో సభ్యురాలు జస్టిస్ బి.వి.నాగరత్న దీనితో విభేదించారు. నోట్ల రద్దు నిర్ణయం చట్ట విరుద్ధమంటూ ఆమె విడిగా తీర్పు వెలువరించారు. నోట్ల రద్దును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వాటన్నింటినీ కలిపి విచారించిన ధర్మాసనం డిసెంబర్ 7న తీర్పును రిజర్వు చేసింది. నిర్ణయానికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని అంతకుముందు కేంద్రాన్ని ఆదేశించింది.
Supreme Court: లంచగొండి అధికారులకు శిక్షలు పడాల్సిందే.. సుప్రీంకోర్టు
పిటిషనర్ల వాదనేమిటి?
నోట్ల రద్దు కేసులో పిటిషనర్ల తరఫున చిదంబరం తదితరులు వాదించారు. వాళ్లేమన్నారంటే...
☛ రద్దు నిర్ణయానికి అనుసరించిన ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్టం. సంబంధిత పత్రాలన్నింటినీ కోర్టు ముందుంచాలి
☛ నోట్ల రద్దుకు కేంద్రం నేరుగా నిర్ణయం తీసుకోజాలదు. అందుకు ఆర్‌బీఐ కేంద్ర బోర్డు సిఫార్సు తప్పనిసరి.
☛ రద్దు ద్వారా ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు
☛ నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కు తీసుకోవడం అసాధ్యమే అయినా మున్ముందు ప్రభుత్వాలు ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడకుండా స్పష్టమైన చట్ట నిబంధనలను ఏర్పరచాలి
☛ గడువు లోగా పాత నోట్లు మార్చుకోలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించాలి
కేంద్రం ఏం చెప్పింది..
కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వెంకట రమణితో పాటు ఆర్‌బీఐ తరఫున న్యాయవాది నోట్ల రద్దును సమర్థిస్తూ వాదనలు విన్పించారు..
☛ దొంగ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదానికి నిధులు, పన్నుల ఎగవేత వంటి జాఢ్యాల ఏరివేత నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యం
☛ అన్ని కోణాల్లోనూ లోతుగా ఆలోచించి, అవసరమైన సంప్రదింపులన్నీ జరిపిన మీదట తీసుకున్న నిర్ణయమిది
☛ ఈ విషయమై ఆర్‌బీఐతో సుదీర్ఘ సంప్రదింపులు జరిగాయి
☛ ఆరేళ్ల కింద జరిగిపోయిన ఈ నిర్ణయానికి సంబంధించి ఇప్పుడు ‘కాలాన్ని వెనక్కు తిప్పి’ జరిగిపోయిన వాటిని సరి చేయడం, పరిహారం వంటివి ఇవ్వడం సాధ్యం కాదు. కనుక దీనిపై విచారణే కూడదు.
Collegium System: కొలీజియం తీర్మానాలు బయటపెట్టలేం..సుప్రీంకోర్టు
మెజారిటీ తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిందిదీ..
నోట్ల రద్దు నిర్ణయం సబబేనంటూ ధర్మాసనం తరఫున జస్టిస్ నజీర్ మెజారిటీ తీర్పు చదివి వినిపించారు. 382 పేజీల ఈ తీర్పులో ఆయనేం చెప్పారంటే..
☛ ఆర్‌బీఐతో ఆర్నెల్లపాటు సంప్రదింపులు జరిపిన మీదటే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు
☛ ఇది హడావుడిగా తీసుకున్న నిర్ణయమన్న వాదన అర్థరహితం
☛ కేవలం కొన్ని సిరీస్‌ల నోట్లనే తప్ప వాటిని మొత్తానికే రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదనడం అసంబద్ధం
☛ ఎందుకంటే నోట్ల రద్దు నిర్ణయాన్ని సొంతంగా తీసుకుని అమలు చేసే స్వతంత్ర అధికారాలు ఆర్‌బీఐకి లేవు
☛ ఆర్‌బీఐ చట్టంలోని 26 (2) సెక్షన్ కింద కేంద్రానికి ఉన్న అధికారాలు పరిమితమైనవడం, కొన్ని సిరీస్‌ల నోట్లనే తప్ప వాటిని కేంద్రంసంపూర్ణంగా రద్దు చేయజాలదని చెప్పడం సరికాదు
☛ గతంలో జరిగిన నోట్ల రద్దు నిర్ణయాలను పార్లమెంటు చట్టం ద్వారా తీసుకున్నంత మాత్రాన ఈ విషయంలో మరో విధమైన నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి అధికారం లేదని కూడా చెప్పలేం
☛ కేవలం కేంద్రం చేపట్టిన చర్యల ఫలితం ఆధారంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని కొట్టేయలేం
☛ ఈ నిర్ణయం వెనక మూడు లక్ష్యాలను గుర్తించాం. వాటిని చేరుకోవడంలో తేడాలున్నంత మాత్రాన నిర్ణయాన్ని కొట్టేయాలనడం సరికాదు
☛ ఇలాంటి నిర్ణయాల విషయంలో పూర్తిస్థాయి ముందస్తు గోప్యత చాలా అవసరం. అవి లీకైతే ఎంతటి అనర్థం జరిగేదో ఊహించుకోవడం కూడా కష్టమే.
☛ రద్దయిన నోట్ల మార్పిడికి ఇచ్చిన 52 రోజుల గడువు సమంజసమైనదే
☛ కొంతమందికి తాత్కాలికంగా కాస్త కష్టం కలిగినంత మాత్రాన మొత్తం నిర్ణయాన్నే తప్పుబట్టలేం
☛ నోట్ల రద్దు ప్రభావం తదితరాలను మదింపు చేయడం కోర్టుల పని కాదు
జస్టిస్ నాగరత్న ఏమన్నారంటే..
నోట్ల రద్దు నిర్ణయం చట్ట విరుద్ధమని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ధర్మాసనంలో అందరికంటే జూనియర్ న్యాయమూర్తి అయిన ఆమె మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ ఈ మేరకు విడిగా 124 పేజీల తీర్పు వెలువరించారు. అందులో ఏం చెప్పారంటే..
☛ నోట్ల రద్దు నిర్ణయం దొంగ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదానికి నిధులకు అడ్డుకట్టే వేసేందుకు బాగా ఆలోచించి, సదుద్దేశంతో తీసుకున్నదే. సమాజ మూలాలను పెకిలిస్తున్న జాఢ్యాలను నిర్మూలించాలన్న ఉద్దేశాన్ని అభినందించాల్సిందే
☛ కానీ ఇది కేవలం 24 గంటల్లో తీసుకున్న హడావుడి నిర్ణయం. పైగా అందుకు అనుసరించిన తీరు కూడా పూర్తిగా చట్టవిరుద్ధం
☛ ఇది కేంద్రం సిఫార్సు చేసిన నిర్ణయమని ఆర్‌బీఐ సమర్పించిన పత్రాలే చెబుతున్నాయి. అంటే ఇది ఆర్‌బీఐ స్వతంత్ర ఆలోచన కాదని స్పష్టమవుతోంది
☛ కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విస్తృతమైన అధికారాల దృష్ట్యా కేవలం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి బదులు ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే పార్లమెంటులో నోట్ల రద్దుపై విస్తృతంగా చర్చించి ఈ మేరకు చట్టం చేయాల్సింది.
☛ అయితే ఇది ఆరేళ్ల క్రితం నాటి నిర్ణయం. కనుక దీనిపై స్టే గానీ, పిటిషనర్లకు ఉపశమనం గానీ ఇవ్వలేం.