Republic Day 2022 Highlights: భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రతీ ఏడాది మాదిరిగా ఆర్భాటంగా సంబరాలు నిర్వహించలేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, దేశ సామాజిక, ఆర్థిక పురోగతి, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే విన్యాసాలతో రాజ్‌పథ్‌లో నిర్వహించిన పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
ముఖ్యఅతిథి లేకుండానే..
73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్–19 ముప్పుతో విదేశీ ముఖ్య అతిథి లేకుండానే నిర్వహించారు. గతంలో 1952, 1953, 1966, 2021 సంవత్సరాలలో ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి. కరోనా నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. అయితే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిధులుగా గౌరవించారు.
విశేషాలు..
- గణతంత్ర వేడకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌కు పత్య్రేకమైన టోపీ ధరించారు. దీనిపై ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రీకరించారు. అలాగే మణిపూర్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శాలువా ధరించారు.
- పెరేడ్‌లో ఎన్‌సీసీ కేడెట్లు షహీదోం కో శత్ శత్ నమాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది.
- పెరేడ్‌లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన మహిళా జవాన్లతో కూడిన సీమా భవానీ మోటర్‌సైకిల్ టీమ్ చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి.
- కేంద్ర ప్రజాపనుల శాఖ నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళినర్పిస్తూ శకటాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కొత్తగా లోక్ అదాలత్ శకటం పెరేడ్‌లో అడుగుపెట్టింది.
- ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారతీయులు 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ సహా పలు దేశాధినేతలు ఈ సందర్భంగా భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
- భారత 73వ గణతంత్ర సంబరాలు అన్ని రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి.
- కాశ్మీర్‌లో ప్రఖ్యాత లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై మువ్వన్నెల జెండాను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసుఫ్, సాహిల్ బషీర్ పాల్గొన్నారు. ఈ క్లాక్ టవర్‌పై గత 30 ఏళ్లలో త్రివర్ణ పతాకం ఎగరడం ఇదే తొలిసారి.
చదవండి: ఏ మేరే వతన్ కే లోగో గీతాన్ని ఎవరు రాశారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్