Skip to main content

PFR-2022: 12వ ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూను ఎక్కడ నిర్వహించారు?

President Fleet Review 2022

తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం సముద్ర జలాల్లో ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ–2022(పీఎఫ్‌ఆర్‌–2022)ను నిర్వహించారు. భారతదేశ చరిత్రలో పన్నెండవది అయిన ఈ ఫ్లీట్‌ రివ్యూలో త్రివిధ దళాధిపతి హోదాలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో ప్రయాణిస్తూ.. లంగరు వేసిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ఆయన సమీక్షించారు. అనంతరం ప్రసంగిస్తూ.. ‘సముద్ర జలాల్లో ఎదురవుతున్న సమస్యల్ని తిప్పికొట్టేందుకు స్నేహపూర్వక దేశాలతో కలిసి భారత నౌకాదళం రాజీలేని పోరాటం చేయాలి. హిందూ మహా సముద్రంలో ప్రధాన భద్రతా భాగస్వామిగా భారత్‌ వ్యవహరించాలి’ అని ఆకాంక్షించారు. 70 శాతం నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతుండటం శుభ పరిణామం అని పేర్కొన్నారు.

12వ ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ–ముఖ్యాంశాలు

  • భారతదేశ చరిత్రలో ఇది 12వ ఫ్లీట్‌ రివ్యూ. దేశ తూర్పు తీరంలో మూడో సమీక్షగా విశాఖలో జరిగింది.
  • విశాఖలోని హార్బర్‌కు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్‌కి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్, నాలుగు నౌకాదళ కమాండ్‌ల చీఫ్‌లు వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా, వైస్‌ అడ్మిరల్‌ ఏబీ సింగ్, వైస్‌ అడ్మిరల్‌ హంపిహోలి, లెఫ్టినెంట్‌ జనరల్‌ అజయ్‌ సింగ్‌ తదితరులు స్వాగతం పలికారు. 
  • తొలుత 21 తుపాకులతో భారత నౌకాదళం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి.. ప్రెసిడెన్షియల్‌ యాచ్‌గా సిద్ధంగా ఉన్న ఐఎన్‌ఎస్‌ సుమిత్ర యుద్ధనౌకలో సతీసమేతంగా సమీక్షకు బయలుదేరారు.
  • రెండు గంటలకు పైగా సాగిన నౌకాదళ సమీక్షలో ఇండియన్‌ నేవీ.. తన సామర్థ్యాల్ని ఘనంగా ప్రదర్శించింది.
  • పీఎఫ్‌ఆర్‌–2022కు తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా సమన్వయకర్తగా వ్యవహరించారు.
  • ప్రతి పీఎఫ్‌ఆర్‌ లేదా ఐఎఫ్‌ఆర్‌ నిర్వహించిన తర్వాత దాని పేరుతో పోస్టల్‌ స్టాంప్, కవర్‌ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 21న పీఎఫ్‌ఆర్‌–2022 జ్ఞాపకార్థం తపాలా శాఖ రూపొందించిన స్టాంప్, పోస్టల్‌ కవర్‌ని నేవల్‌ బేస్‌లో రాష్ట్రపతి ఆవిష్కరించారు.

చ‌ద‌వండి: బీఐఎం పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ–2022 నిర్వహణ
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు    : భారత నావికాదళం
ఎక్కడ    : విశాఖపట్నం సముద్ర జలాలు, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : నౌకాదళంపై సమీక్ష నిర్వహించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Feb 2022 04:56PM

Photo Stories