President of India Election 2022: భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఎన్నిక విధానం ఇలా..
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జూన్ 15న విడుదల చేయనున్నారు. అలాగే నామినేషన్ల దాఖలుకు జూన్ 29వ తేదీన చివరి తేదీగా నిర్ణయించారు.
ఉపరాష్ట్రపతి పదవికి కూడా..
జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్, జూలై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24వ తేదీతో ముగియనుంది.
రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు?
ఈ సారి ఇలాగే..
ఎంపీ ఓటు విలువ 700 ఉండగా.. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి.
ఈ రాష్టం నుంచి వచ్చిన మొదటి వ్యక్తి ఈయనే.
ఉత్తరప్రదేశ్ నుంచి భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి వ్యక్తి ఈయనే. ఆయన అధ్యక్ష పదవికి ముందు, అతను 2015 నుంచి 2017 వరకు బీహార్ 26వ గవర్నర్‌గా పనిచేశాడు, 1994 నుంచి 2006 వరకు పార్లమెంటు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. అలాగే రాజకీయాల్లోకి రాకముందు, అతను 16 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు.
ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు?
రాజ్యాంగ అధినేతగా..
ఆర్టికల్ -52 ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు. ఆయనే దేశంలో అత్యున్నత వ్యక్తి. ఆర్టికల్-53 ప్రకారం.. రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్యనిర్వాహక అధికారి, దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. ఆర్టికల్ 53(1) ప్రకారం భారతదేశ కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతికే అప్పగించారు. ఆయనకు సహాయపడేందుకు ఆర్టికల్ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కాబట్టే ప్రధానమంత్రిని వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా, రాష్ట్రపతిని నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతిగా పేర్కొంటారు.
రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఇవే..
రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి అర్హతల గురించి ఆర్టికల్-58 తెలియజేస్తుంది. దీని ప్రకారం..
1. భారతీయ పౌరుడై ఉండాలి.
2. 35 ఏళ్లు నిండి ఉండాలి.
3. లోక్‌సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి.
4. అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపరచాలి.
5. నామినేషన్ ఫీజుగా రూ.15,000 చెల్లించాలి. డిపాజిట్ తిరిగి రావాలంటే పోలై చెల్లిన ఓట్లలో కనీసం 1/6 వంతు రావాలి.
రాష్ట్రపతి ఎన్నిక ఇలా..
ఆర్టికల్-54 రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలుపుతుంది. దీని ప్రకారం ఎలక్టోరల్ కాలేజ్.. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజ్‌లో ఎన్నికైన పార్లమెంట్ (ఉభయసభలు) సభ్యులు, ఎన్నికైన అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల విధానసభ సభ్యులు ఉంటారు. కేంద్రపాలిత ప్రాంత విధానసభ సభ్యులకు 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటుహక్కు కల్పించారు. ఎలక్టోరల్ కాలేజ్ మొత్తం సభ్యులు 4,896, మొత్తం ఓట్లు సుమారుగా 11,00,000. వీరిలో మొత్తం పార్లమెంట్ సభ్యులు 776, విధానసభ సభ్యులు 4120. మొత్తం ఓట్లలో పార్లమెంట్ సభ్యులు సుమారుగా 5,50,000, విధాన సభల సభ్యులవి సుమారుగా 5,50,000. ఆర్టికల్-55 ప్రకారం ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల ఓటు విలువను ప్రత్యేక పద్ధతి ద్వారా లెక్కిస్తారు.
రాష్ట్రపతి ఎన్నికకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటున్నారు. ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి జనాభా 4,36,24,000. దీన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ MLA ఓటు విలువ ఈ విధంగా లెక్కిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన MLA ఓటు విలువ 148. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ (208), తమిళనాడు (176), మహారాష్ట్ర (175) ఓటు విలువను కలిగి ఉండగా, సిక్కిం (7), అరుణాచల్ ప్రదేశ్ (8), నాగాలాండ్ (9) అతి తక్కువ ఓటు విలువను కలిగున్నాయి.
గమనిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ MLA ల ఓటు విలువ ఒకే రకంగా ఉంటుంది.
పై సూత్రం ద్వారా ఎంపీ ఓటు విలువ..
ప్రస్తుతం ఒక్కో ఎంపీ ఓటు విలువ 708. అందరి ఎంపీల ఓటు విలువ సమానంగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ, మరొకసారి రాజ్యసభ సెక్రటరీ కొనసాగుతారు. ఇప్పటి వరకు 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నిక 1952లో, 15వ ఎన్నిక 2017లో జరిగింది.
రాష్ట్రపతి పదవీ కాలం ఇలా..
ఆర్టికల్-56 ప్రకారం రాష్ట్రపతి పదవీ కాలం ఐదేళ్లు. ఈ సమయంలో రాష్ట్రపతిగా కొనసాగేందుకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవచ్చు. రాజీనామా లేఖను ఉప రాష్ట్రపతికి సమర్పించాలి. ఉపరాష్ట్రపతి లేనట్లయితే ఒక ప్రతిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మరో ప్రతిని ప్రధానమంత్రికి అందించాలి. ఆర్టికల్-57 ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. రెండుసార్లు మాత్రమే పదవి చేపట్టాలి అనే సంప్రదాయం మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ద్వారా మొదలైంది. రాష్ట్రపతిగా ఎక్కువ కాలం రాజేంద్రప్రసాద్, తక్కువ కాలం జాకీర్ హుస్సేన్ కొనసాగారు.
జీతభత్యాలు ఇలా..
ఆర్టికల్-59 రాష్ట్రపతి జీతభత్యాల గురించి తెలుపుతుంది. జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వాటిని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ప్రస్తుత జీతం నెలకు రూ.1,50,000. పెన్షన్ ఏడాదికి రూ. 9,00,000. ఉచిత నివాసం, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఢిల్లీ, హైదరాబాద్‌లలో రాష్ట్రపతికి నివాస గృహాలున్నాయి. సిమ్లాలో వేసవి విడిది ఉంది. జీతభత్యాలకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ సౌకర్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే అవకాశం లేదు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో..
పదవీ ప్రమాణ స్వీకారం గురించి ఆర్టికల్ 60 వివరిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన లేనట్లయితే సీనియర్ న్యాయమూర్తి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి పదవి చేపట్టాలన్నా ఇదే పద్ధతిని అనుసరిస్తారు.
రాష్ట్రపతి తొలగింపు ఇలా..
తొలగింపు గురించి ఆర్టికల్-61 తెలుపుతుంది. రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంట్ తొలగిస్తుంది. ఈ తీర్మానాన్ని ఉభయ సభల్లో ఏ సభలోనైనా 1/4 వంతు మంది సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు సభాధ్యక్షుడికి నోటీస్ అందించి ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత తీర్మానం చర్చకు వస్తుంది. చర్చ తర్వాత తీర్మానం 2/3 మెజారిటీతో ఆమోదం పొందితే రెండో సభకు వెళ్తుంది. రెండో సభ కూడా 2/3 వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి పదవి కోల్పోతాడు. ఒక సభ ఆమోదించి మరో సభ వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోయినట్టు భావిస్తారు. తీర్మానంపై ఓటింగ్ జరిపినప్పుడు రాష్ట్రపతి నామినేట్ చేసిన 14 మంది పార్లమెంట్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. 1970లో వి.వి. గిరికి నోటీస్ జారీ చేసి తర్వాత విరమించుకున్నారు. ఇప్పటి వరకు ఈ తీర్మానానికి ఎవరూ గురికాలేదు. ఆర్టికల్-62 ప్రకారం ఏదైనా కారణం వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఆరు నెలల్లోపు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి.
వివాదాలు..
ఎన్నిక వివాదాల గురించి ఆర్టికల్-71 తెలుపుతుంది. ఈ వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఓడిపోయిన అభ్యర్థి లేదా ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల్లో 20 మంది సభ్యులతో సుప్రీంకోర్టులో పిటీషన్ వేయొచ్చు. ఇలాంటి పిటీషన్‌ను ఎన్నిక జరిగిన 30 రోజుల్లోపు దాఖలు చేయాలి. ఎన్నిక వివాదంపై కోర్టుకు స్వయంగా హాజరైన రాష్ట్రపతి వి.వి. గిరి.
భారత రాష్ట్రపతి జాబితా ఇలా..
1. బాబూ రాజేంద్ర ప్రసాద్(1950-62) :
బిహార్‌కు చెందిన ఈయన అత్యధిక కాలం రాష్ర్టపతిగా పనిచేశారు. రెండుసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. సుప్రీంకోర్టు సలహాను ఎక్కువసార్లు (3సార్లు) కోరిన రాష్ట్రపతి. ఆయన చేతిలో ఓడిపోయిన వారు.. ప్రొ. కె.టి. షా, జస్టిస్, ఎన్.ఎన్.దాస్. 1962లో భారతరత్న లభించింది.
2. సర్వేపల్లి రాధాకృష్ణన్(1962-67)
సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వరాష్ట్రం తమిళనాడు. ఈయన వివిధ యూనివర్సిటీలకు వీసీగా పనిచేశారు. రెండు యుద్ధాలను ఎదుర్కొన్న ఏకైక రాష్ట్రపతి. టెంపుల్టన్ అవార్డు గెలిచిన మొదటి భారతీయుడు. ఈయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
3. జాకీర్ హుస్సేన్ (1967-69)
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. పదవిలో కొనసాగుతూ చనిపోయిన మొదటి రాష్ట్రపతి. అతి తక్కువకాలం రాష్ట్రపతిగా పని చేశారు. ఈయనకు 1963లో భారతరత్న అవార్డు లభించింది.
4. వి.వి.గిరి (1969-74)
ఆయన సొంత రాష్ట్రం ఒడిశా. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి. అతి తక్కువ మెజారిటీతో, ఓటు బదలాయింపు ద్వారా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్నిక వివాదంలో స్వయంగా కోర్టుకు హాజరైన రాష్ట్రపతి. కార్మిక నేతగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1974-77)
అసోంకు చెందినవారు. పదవీకాలంలో చని పోయిన రెండో, చివరి రాష్ట్రపతి. అత్యధికంగా ఆర్డినెన్సులను జారీ చేసిన రాష్ట్రపతి. అత్యవసర సమయంలో కీలుబొమ్మ రాష్ట్రపతిగా పేరు గడించారు.
6. నీలం సంజీవరెడ్డి (1977-82)
ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. అతి చిన్న వయస్సులో రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనంతరం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
7. జ్ఞానీ జైల్‌సింగ్ (1982-87)
ఆయన రాష్ట్రం పంజాబ్. బలహీన వర్గాల నుంచి ఎన్నికైన మొదటి రాష్ట్రపతి. పాకెట్ వీటో అధికారాన్ని ఉపయోగించుకున్న ఏకైక రాష్ట్రపతి. ఈయన కాలంలోనే అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నిర్వహించారు.
8. ఆర్.వెంకట్రామన్ (1987-92)
తమిళనాడుకు చెందినవారు. ఎక్కువ మంది ప్రధానమంత్రులతో పదవీ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు పునాదులు వేసినవారు.
9. డా.శంకర్ దయాళ్ శర్మ (1992-97)
మధ్యప్రదేశ్‌కు చెందినవారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పనిచేసి రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.
10. కె.ఆర్. నారాయణన్ (1997-2002)
కేరళకు చెందిన వ్యక్తి. ఏకైక దళిత రాష్ట్రపతి.
11. డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం (2002-2007)
ఈయన సొంత రాష్ట్రం తమిళనాడు. రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి. భారత క్షిపణుల పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఈయన రచించిన పుస్తకం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’. కలాం జన్మదినమైన అక్టోబర్ 15ను యూఎన్‌వో ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’గా ప్రకటించింది.
12. ప్రతిభా దేవిసింగ్ పాటిల్ (2007-12)
సొంత రాష్ట్రం మహారాష్ట్ర. ఏకైక మహిళా రాష్ట్రపతి. గవర్నర్‌గా, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా పనిచేసి రాష్ట్రపతి అయ్యారు. బ్రిటన్ రాణి ఆహ్వానం అందుకున్న ఏకైక రాష్ట్రపతి. వ్యక్తిగత ఖర్చులకు ప్రజాధనాన్ని ఎక్కువగా ఖర్చుపెట్టిన రాష్ట్రపతి.
13. ప్రణబ్ ముఖర్జీ (2012 నుంచి 2017 వరకు)
సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్. కేంద్ర పరిశ్రమల, వాణిజ్య, విదేశాంగ, రక్షణ, ఆర్థిక మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
14. రామ్ నాథ్ కోవింద్ (2017 నుంచి..)
ఉత్తరప్రదేశ్ నుంచి భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి వ్యక్తి. ఆయన అధ్యక్ష పదవికి ముందు, అతను 2015 నుంచి 2017 వరకు బీహార్ 26వ గవర్నర్‌గా పనిచేశాడు, 1994 నుంచి 2006 వరకు పార్లమెంటు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. రాజకీయాల్లోకి రాకముందు, అతను 16 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు.