Railway Projects: ఎనిమిది కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్.. తెలుగు రాష్ట్రాల్లో..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సుమారు రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఎనిమిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2030–31 కల్లా పూర్తి చేస్తామన్నారు.
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహా రాష్ట్ర, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగానే కొత్తగా 64 రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం, మల్కన్‌గిరితోపాటు ఆరు ఆకాంక్ష జిల్లాల్లోని 510 గ్రామాలతోపాటు దాదాపు 40 లక్షల మంది జనాభాకు రైల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి మల్కన్‌గిరి–పాండురంగాపురం (భద్రాచలం మీదుగా) 173.61 కి.మీ పొడవున నూతన రైల్వేలైన్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాతోపాటు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలు ఉన్నాయి. ప్రముఖ పుణ్య క్షేత్రమైన భద్రాచలాన్ని ప్రధాన రైల్వేలైన్‌తో అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడనుంది. వీటితోపాటు తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన అజంతా గుహలను రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తారు.
Allotment for Railways : భారతీయ రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయింపు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా..
మల్కన్‌గిరి నుంచి పాండురంగాపురం వరకు గత ఏడాది ఫైనల్ లొకేషన్స్ సర్వే మంజూరైంది. ఆ వెంటనే సర్వే పనులు పూర్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ మార్గాన్ని నిర్మించేందుకు సిద్ధప డింది. ఈ కొత్త రైల్వేలైన్ వల్ల భద్రాద్రి కొత్తగూడెంలోని రైలు అనుసంధానం లేని కొత్త ప్రాంతాలకు రైల్వే వసతి ఏర్పడుతుంది. సరుకు రవాణా ప్రధాన లక్ష్యంగానే ఇది నిర్మిస్తున్నప్పటికీ ప్రయాణికుల రైలు కూడా దీని మీదుగా నడపనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందుకు దాదాపు రూ.3,592 కోట్లు ఖర్చు చేయబోతోంది.
జునాగఢ్ నుంచి మల్కన్‌గరి, మల్కన్‌గిరి నుంచి పాండురంగాపురం వరకు.. ఈ రెండు లైన్లు కలిపి చూస్తే అయ్యే వ్యయం రూ.7,383 కోట్లు. ఈ ప్రాజెక్టు కోసం 1697 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. సెంట్రల్ సౌత్ ఇండియాలోని పవర్ ప్లాంట్లకు మహానది కోల్డ్‌ఫీల్డ్‌కు ఇది దగ్గర దారి కాబోతోంది. బస్తర్ రీజియన్‌కు మధ్య 124 కిలోమీటర్ల దూరాభారాన్ని కూడా ఇది తగ్గించనుంది.
High Speed Rail: చెన్నై–మైసూర్ మధ్య తొలి హైస్పీడ్ రైలు.. వయా చిత్తూరు మీదుగా..