Skip to main content

High Speed Rail: చెన్నై–మైసూర్‌ మధ్య హైస్పీడ్‌ రైలు

దక్షిణ భారతదేశంలో చెన్నై–మైసూర్‌ మధ్య తొలి హైస్పీడ్‌ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
High Speed Rail between Chennai and Mysore

ఇందుకోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మీదుగా ప్రత్యేక కారిడార్‌ను నిర్మించాలని జాతీయ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 463 కి.మీ. మేర ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ 83 కి.మీ. మేర నిర్మించనున్నారు.   

మూడు రాష్ట్రాల మీదుగా.. 
ఈ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా నిర్మిస్తారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూర్‌ వరకు నిర్మిస్తారు. మొత్తం 463 కి.మీ. పొడవైన ఈ కారిడార్‌ ఆంధ్రప్రదేశ్‌లో 83 కి.మీ. మేర ఉంటుంది. తమిళనాడులో 122 కి.మీ, కర్ణాటకలో 258 కి.మీ. మేర నిర్మిస్తారు. 

రెండు దశలుగా చేపట్టే ఈ ప్రాజెక్టును మొదటి దశ కింద చెన్నై నుంచి బెంగళూరు వరకు 306 కి.మీ., రెండో దశ కింద బెంగళూరు నుంచి మైసూర్‌ వరకు 157 కి.మీ. మేర నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 

ఇక అత్యంత ఆధునికంగా నిర్మించే ఈ హైస్పీడ్‌ కారిడార్‌లో భాగంగా ఏలివేటెడ్‌ కారిడార్, ఎట్‌ గ్రేడ్, టెన్నెల్, గ్రీన్‌ఫీల్డ్‌ సెగ్మెంట్లుగా నిర్మించాలని డిజైన్‌ను ఖరారుచేశారు. ఈ కారిడార్‌లో భాగంగా 30 కి.మీ.మేర సొరంగాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. చెన్నైలో 2.8 కి.మీ, చిత్తూరులో 11.8 కి.మీ., బెంగళూరు రూరల్‌లో 2 కి.మీ., బెంగళూరులో 11 కి.మీ. మేర వీటిని నిర్మిస్తారు.   

మొత్తం 11 స్టేషన్లు.. ఏపీలో చిత్తూరులో హాల్ట్‌.. 
ఇక ఈ హైస్పీడ్‌ రైలుకు చెన్నై–మైసూర్‌ మధ్య 11 చోట్ల హాల్ట్‌లు కల్పిస్తారు. ఏపీలో ఒక్క చిత్తూరులోనే ఉంటుంది. దీంతోపాటు చెన్నై, పూనమల్లి, కోలార్, కొడహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయపనహళ్లి, ఎల్రక్టానిక్స్‌ సిటీ, కెంగేరీ, మాండ్య, మైసూర్‌లలో ఎలివేటెడ్‌ రైల్వేస్టేషన్లను నిర్మిస్తారు.   

Hydrogen Cruise: భారతదేశంలోనే తొలి హైడ్రోజన్‌ క్రూయిజ్‌.. ఎక్కడంటే..

భూసేకరణ ప్రక్రియపై కసరత్తు.. 
హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ మొత్తం 303 గ్రామాలు, పట్టణాల మీదుగా నిర్మించాల్సి ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. అందుకోసం తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, ఏపీలోని చిత్తూరు, కర్ణాటకలోని కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రామనగర, మాండ్య, మైసూర్‌ జిల్లాల్లో 2,905 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో 2,660 ఎకరాలు ప్రైవేటు భూములే. 

ప్రస్తుతం రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేసింది. మరోవైపు.. భూసేకరణ ప్రక్రియపై ప్రాథమిక కసరత్తు చేపట్టింది. అనంతరం డీపీఆర్‌ను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నది రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.  

గరిష్ట వేగం గంటకు 350 కి.మీ..
ఇక ఈ హైస్పీడ్‌ రైల్‌ గంటకు గరిష్టంగా 350 కి.మీ. వేగంతో దూసుకపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని నిర్వహణ వేగం గంటకు 320 కి.మీ.గా నిర్ణయించారు. సగటు వేగం గంటకు 250 కి.మీ. ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. మొత్తం 730 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Royalty is Not Tax: చారిత్రక తీర్పు.. మైనింగ్ ట్యాక్స్ రాయల్టీ రాష్ట్రాలకే..!

Published date : 27 Jul 2024 12:46PM

Photo Stories